మణిపుర్‌లో ప్రశాంత వాతావరణం

ఒక్కసారిగా చెలరేగిన ఘర్షణలతో ఆదివారం తీవ్ర ఉద్రిక్తంగా మారిన మణిపుర్‌ సోమవారం కాస్త శాంతించింది. ఇంఫాల్‌ లోయలో సైన్యం, పారామిలిటరీ బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి.

Published : 30 May 2023 05:17 IST

5కు చేరిన ఘర్షణల మృతులు

ఇంఫాల్‌: ఒక్కసారిగా చెలరేగిన ఘర్షణలతో ఆదివారం తీవ్ర ఉద్రిక్తంగా మారిన మణిపుర్‌ సోమవారం కాస్త శాంతించింది. ఇంఫాల్‌ లోయలో సైన్యం, పారామిలిటరీ బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి. ఆదివారం జరిగిన ఘర్షణల్లో గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో తాజా ఘర్షణల్లో మొత్తం మరణాల సంఖ్య ఐదుకు చేరింది. మిలిటెంట్లు అపహరించిన ఆయుధాల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. మే 3వ తేదీన మొదలైన జాతుల ఘర్షణల్లో ఇప్పటివరకూ 80 మంది మరణించారు. ఇటు భద్రతా బలగాల కాల్పుల్లో 40 మంది మిలిటెంట్లూ హతమయ్యారు. ప్రస్తుతం మణిపుర్‌లో 10వేల మంది సైనికులను మోహరించారు. వీరితోపాటు పారా మిలిటరీ బలగాలనూ దింపారు.

అమిత్‌ షా రాక

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సోమవారం రాత్రి ఇంఫాల్‌ చేరుకున్నారు. జూన్‌ 1వ తేదీ వరకూ ఆయన రాష్ట్రంలో ఉంటారు. ఈ పర్యటనలో భద్రతపై ఆయన పలు సమావేశాలను నిర్వహించనున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. మణిపుర్‌లో ఘర్షణలు తలెత్తాక తొలిసారిగా ఆయన ఇంఫాల్‌కు వచ్చారు.

మిలిటెంట్ల కుట్ర భగ్నం

మహిళలు, పిల్లలతోసహా అమాయక ప్రజలను కవచాలుగా వాడుకుని గ్రామాలపై దాడులు చేయాలన్న మణిపూర్‌ మిలిటెంట్ల కుట్రను సైన్యం భగ్నం చేసింది. ఇటీవల మిలిటెంట్ల కమ్యూనికేషన్‌ వ్యవస్థలోకి స్థానికంగా ఉన్న సైన్యానికి చెందిన ‘స్పియర్‌ కోర్‌ కమాండ్‌’ చొరబడింది. అక్కడ వారి సంభాషణలకు సంబంధించిన ట్రాన్స్‌స్క్రిప్ట్‌ను స్పియర్‌కోర్‌ కనిపెట్టింది. ఇందులో భద్రతా బలగాలను అడ్డుకునేందుకు అమాయక పౌరులను వాడుకోవాలనే ప్రణాళికలపై మిలిటెంట్లు చర్చించినట్లు ఉంది. ప్రజలను కవచాలుగా వాడుకుని మే 27 నాటికి ఓ గ్రామాన్ని ధ్వంసం చేయాలనే కుట్రపై మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో పిల్లలు, మహిళలు మరణిస్తే సైన్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని భావించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని