భారత కరెన్సీ సమగ్రతపై అనుమానం

భారత కరెన్సీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.రెండు వేల నోట్లను ప్రవేశపెట్టడం, రద్దు చేయడాన్ని చూస్తుంటే భారత కరెన్సీ స్థిరత్వం, సమగ్రతలపై అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

Published : 30 May 2023 05:17 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం

ముంబయి: భారత కరెన్సీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.రెండు వేల నోట్లను ప్రవేశపెట్టడం, రద్దు చేయడాన్ని చూస్తుంటే భారత కరెన్సీ స్థిరత్వం, సమగ్రతలపై అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. సోమవారం ముంబయిలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో చిదంబరం వివిధ అంశాలపై మాట్లాడారు. ఆర్థికాభివృద్ధి సూచీలన్నీ నేల చూపులు చూస్తున్న నేపథ్యంలో.. దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతుందన్న నమ్మకం కలగడం లేదన్నారు. మణిపుర్‌ అల్లర్లలో ఇప్పటి వరకు 75 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రధాని అక్కడ పర్యటించలేదని ఆక్షేపించారు. రెజ్లర్ల పోరాటంపై మోదీ మౌనం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని చిదంబరం పేర్కొన్నారు. లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాల ప్రజలను ఒకే విధంగా చూడాలని.. ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైందన్నారు. 2024 ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు. విపక్షాల ఐక్యతపై పని జరుగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

తిప్పికొట్టిన సీతారామన్‌

రూ. 2వేల నోట్లపై చిదంబరం చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తిప్పికొట్టారు. ఆర్థికమంత్రిగా పని చేసిన వ్యక్తి.. దేశ కరెన్సీ గురించి, రిజర్వు బ్యాంకు నిర్ణయం గురించి అలా మాట్లాడటం సరికాదన్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంటు వేదికగా తాము చాలా ప్రశ్నలు సంధించామని.. అయితే వాటికి ఎప్పుడూ సమాధానాలు రాలేదని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని