అపురూపం రూ.75 నాణెం
పార్లమెంటు కొత్త భవన ఆరంభోత్సవంలో ధర్మదండంతో పాటు అందరినీ ఆకర్షించిన మరోటి 75 రూపాయల నాణెం! ఇంతకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఈ బిళ్లను పొందేదెలా? దీంతో రోజువారీ లావాదేవీలు నిర్వహించొచ్చా? అనేది చాలా మందిలో సందేహం.
ఇంకా ధర నిర్ణయించని కేంద్రం
సుమారు రూ.3,500 ఉండొచ్చని అంచనా
లావాదేవీలకు ఉపయోగపడదు
పార్లమెంటు కొత్త భవన ఆరంభోత్సవంలో ధర్మదండంతో పాటు అందరినీ ఆకర్షించిన మరోటి 75 రూపాయల నాణెం! ఇంతకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఈ బిళ్లను పొందేదెలా? దీంతో రోజువారీ లావాదేవీలు నిర్వహించొచ్చా? అనేది చాలా మందిలో సందేహం. పొందొచ్చుగాని... లావాదేవీలకు వాడలేరనేదే సమాధానం!
75 రూపాయల నాణెం విలువ రూ.75 మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటు. ఇది పేరుకు 75 రూపాయల నాణెమే అయినా దీని విలువ ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది స్మారక నాణెం. ప్రభుత్వం ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని ఆయా సంఘటనల, వ్యక్తుల సంస్మరణార్థం, పథకాల ప్రచారం కోసం ఇలా నాణాలను తయారు చేసి విడుదల చేస్తుంటుంది. వీటిని స్మారక నాణాలంటారు. 1964 నుంచి భారత ప్రభుత్వం ఇలా చేస్తోంది. తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం 1964లో మొదటిసారి స్మారక నాణన్ని విడుదల చేశారు. ఇప్పటిదాకా ఇలాంటివి దాదాపు 150 దాకా వచ్చాయి. అందులో భాగంగానే తాజాగా 75 రూపాయల నాణేన్ని కొత్త పార్లమెంటు ఆరంభోత్సవ స్మారకంగా విడుదల చేశారు. 2011 కాయినేజ్ చట్టం ప్రకారం ఇలాంటి స్మారక నాణేలను ముద్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడాల్లోని ప్రభుత్వ నాణేల ముద్రణ కేంద్రాల్లో (మింట్)ల్లో ఇవి తయారవుతాయి.
పొందటమెలా?
ఎవరైనా ఈ నాణేన్ని పొందవచ్చు. ప్రభుత్వ మింట్ వెబ్‌సైట్ ద్వారా వీటిని సేకరించవచ్చు. లేదా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా వీటిని సరఫరా చేస్తుంది. తాజాగా విడుదల చేసిన రూ.75 స్మారక నాణెం ధర ఎంతో ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. 33 మిల్లీమీటర్ల వ్యాసం, 35 గ్రాముల బరువున్న ఈ నాణేన్ని 50శాతం వెండి, 40శాతం రాగి, ఐదుశాతం నికెల్, ఐదుశాతం జింక్ కలిపి తయారు చేశారు. దీనిపై ఒకవైపు అశోకస్తూపం ఉంటుంది. మరోవైపు కొత్త పార్లమెంటు భవనం బొమ్మ ఉంటుంది. విలువైన లోహాలను ఉపయోగించి తయారు చేశారు కాబట్టి దీని ధర ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే అందులో వాడిన లోహాల పరిమాణం ఖరీదే కనీసం రూ.1300 దాకా ఉంటుందని లెక్కవేస్తున్నారు. ఉదాహరణకు... కొద్దిరోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ వందో ఎపిసోడ్‌ను పురస్కరించుకొని రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేశారు. దీని ధర రూ.3,494గా పెట్టారు. ఇందులో లోహాల నిష్పత్తి తాజాగా విడుదలైన రూ.75 నాణెంలోని లోహాల నిష్పత్తి దాదాపు ఒకటే! వీటిని కొనుక్కొని దాచుకోవటమే తప్ప వీటితో ఏమీ కొనలేరు. ఇవి బయట మార్కెట్లో లావాదేవీలకు పనికిరావు. కేవలం స్మారకంగా, అపురూపంగా దాచిపెట్టుకునే అమూల్య వస్తువుగా ఉపయోగపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?
-
Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్
-
Guntur: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం
-
Biden-Trump: బైడెన్‌కు దారి దొరకడం లేదు.. అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై ట్రంప్ ఎద్దేవా