సంక్షిప్త వార్తలు(6)
రైళ్లలో నిరీక్షణ జాబితా(వెయిటింగ్ లిస్ట్) సమస్య ప్రయాణికులకు తలనొప్పిగా మారుతోంది. 2022- 23లో ఏకంగా 2.7 కోట్ల మందికి పైగా ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. వెయిటింగ్ లిస్ట్ కారణంగా ప్రయాణించలేకపోయారని రైల్వే శాఖ ఇటీవల వెల్లడించింది.
‘వందే భారత్’ సరే.. నిరీక్షణ జాబితాకు తెర పడేదెప్పుడు?
కేంద్రాన్ని ప్రశ్నించిన శశిథరూర్
తిరువనంతపురం: రైళ్లలో నిరీక్షణ జాబితా(వెయిటింగ్ లిస్ట్) సమస్య ప్రయాణికులకు తలనొప్పిగా మారుతోంది. 2022- 23లో ఏకంగా 2.7 కోట్ల మందికి పైగా ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. వెయిటింగ్ లిస్ట్ కారణంగా ప్రయాణించలేకపోయారని రైల్వే శాఖ ఇటీవల వెల్లడించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ తాజాగా ఇదే అంశాన్ని లేవనెత్తారు. రైల్వేలో ఈ నిరీక్షణ జాబితాకు ఎప్పుడు తెరపడుతుందని ట్విటర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘నిరీక్షణ జాబితాలు ఎప్పుడు ముగుస్తాయి? 2022-23లో దాదాపు 2.7 కోట్ల మంది రైల్వే ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్‌లోనే మిగిలిపోయారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం స్వాగతించదగినదే. కానీ, కేవలం దానిపైనే దృష్టి సారించడం ఆందోళన కలిగించే విషయం. 75ఏళ్ల స్వతంత్ర భారతంలో.. బెర్త్ ఖరారు కావడం అనేది కేవలం అదృష్టానికి సంబంధించిన విషయం కాకూడదు. అదొక సాధారణ సౌకర్యంగా మారాలి. ఈ అంశంపై తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలి’ అని శశిథరూర్ పేర్కొన్నారు.
సరోగసీలో పునరుత్పాదక కణాల స్వీకరణపై నిషేధాన్ని సవాల్ చేసిన పిటిషన్ తిరస్కరణ
దిల్లీ: సరోగసీ విధానంలో సంతానాన్ని పొందాలనుకున్న దంపతులు...దాత నుంచి అండాలు/ వీర్యకణాలు పొందడంపై కేంద్ర ఆరోగ్యశాఖ విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ తరహా కేసు కోర్టు ముందు ఉందని తెలిపింది. అండాలు(ఎగ్‌సెల్స్), శుక్ర కణాలను పునరుత్పాదక కణాలుగా పిలుస్తారు. ఈ ఏడాది మార్చి 14న కేంద్రం సరోగసీ విధానంపై కొన్ని నిబంధనలు జారీ చేసింది. అవి.. 1.సరోగసీ విధానంలో సంతానం పొందాలనుకున్న దంపతుల నుంచి సేకరించిన అండాలు, శుక్రకణాలను మాత్రమే వినియోగించాలి. దాతల నుంచి వాటిని స్వీకరించరాదు. 2.విడాకులు పొందిన మహిళ లేదా ఒంటరి మహిళ సరోగసీ విధానంలో సంతానం కావాలనుకుంటే ఆమె అండాలను తప్పనిసరిగా వినియోగించాలి. దాత నుంచి శుక్ర కణాలను మాత్రమే తీసుకోవాలి. సెక్షన్ 2(హెచ్) ప్రకారం...సంతానానికి అవకాశంలేని దంపతులు లేదా మహిళ...సంతాన భాగ్యం పొందడం కోసం మాత్రమే ఒక దాత నుంచే పునరుత్పాదక కణాలను పొందాల్సి ఉంటుందని పునరుత్పాదక సహాయత సాంకేతిక నియంత్రణ చట్టం-2021 పేర్కొంది. సంతానానికి నోచుకోని దంపతులపై ముఖ్యంగా మహిళలపై సరోగసీ నిబంధనలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయంటూ దాఖలైన పిటిషన్ మంగళవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ ఇప్పటికే కేసు దాఖలైందని, మళ్లీ పిటిషన్ ఎందుకు వేశారని ధర్మాసనం నిలదీసింది.
ప్రైవేటు నిపుణులకు కేంద్రం ఆహ్వానం
దిల్లీ: ప్రభుత్వ విభాగాల్లోకి ప్రైవేటు రంగ నిపుణులను తీసుకునే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదీ కొనసాగిస్తోంది. 2018లో తొలిసారి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నాలుగో విడతను తాజాగా చేపట్టింది. ఆరు ప్రభుత్వ విభాగాల్లో 17 మంది ప్రైవేటు రంగ నిపుణులను తీసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)ను కోరినట్లు మంగళవారం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారులు తెలిపారు. ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఆర్థిక, గణాంక శాఖల్లో ఈ 17 మందిని సంయుక్త కార్యదర్శి, ఉప కార్యదర్శి, డైరెక్టర్ల హోదాలలో కాంట్రాక్టు పద్ధతిపై నియమిస్తారు.
మహారాష్ట్ర రైతుల కోసం కొత్త పథకం
నమో షెట్కారీ మహాసమ్మాన్‌కు మంత్రిమండలి ఆమోదం
ముంబయి: మహారాష్ట్రలో కోటి మంది రైతులకు ఏటా రూ.6,000 చొప్పున నగదు సహాయం అందించడానికి ఉద్దేశించిన నమో షెట్కారీ మహాసమ్మాన్ పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది. రైతులకు ఇప్పటికే ఏటా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అందిస్తున్న రూ. 6,000లకు ఇది అదనమని శిందే చెప్పారు.
రాష్ట్రపతితో ప్రధాని భేటీ
దిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ట్విటర్ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా పోస్టు చేసింది. అయితే రాష్ట్రపతి, ప్రధాని భేటీ సారాంశమేంటన్నది తెలియరాలేదు.
దేశం అలా ఉండాలి
- కపిల్ సిబల్
నవ భారత్ కోసం కొత్త పార్లమెంటు అందుబాటులోకి వచ్చిందని కేంద్రం, భాజపా చెప్తున్నాయి. నేనైతే ఇండియా కొత్తగా ఉండాలనో, పాతగా ఉండాలనో కోరుకోవడం లేదు. ఎలాంటి దేశం కావాలంటే- పార్లమెంటులో మతాచారాలకు స్థానం ఉండకూడదు. చట్టం అందర్నీ సమానంగా చూడాలి. మత విశ్వాసాల వల్ల పౌరులు హత్యకు గురికావొద్దు. ప్రేమించినివారిని వివాహమాడాలంటే.. బజరంగ్‌దళ్ భయం ఉండొద్దు. దర్యాప్తు సంస్థలపై రాజకీయ ప్రభావం ఉండకూడదు. మీడియా స్వచ్ఛంగా ఉండాలి.
మణిపుర్ సంక్షోభానికి భాజపాయే కారణం
- జైరాం రమేశ్
మణిపుర్లో ప్రస్తుత సంక్షోభానికి ఆరెస్సెస్/భాజపా విభజన రాజకీయాలే కారణం. 22 ఏళ్ల క్రితం కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నప్పుడే చివరగా ఆ రాష్ట్రంలో హింస పెల్లుబికింది. నాటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు మరింత అధ్వానంగా మారాయి.
‘మహాకాల్’లో అంతలా అవినీతి!
- అభిషేక్ సింఘ్వీ
మధ్యప్రదేశ్‌లో మహాకాల్ నడవాపై రూ.800 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క తుపానుతో అక్కడ ఆరు విగ్రహాలు దెబ్బతిన్నాయి. దీన్నిబట్టి- వాటి నిర్మాణానికి వాడిన సామగ్రి నాణ్యతను, అక్కడ జరిగిన అవినీతిని అర్థం చేసుకోవచ్చు. వెయ్యేళ్ల క్రితం నిర్మించిన కేదార్‌నాథ్ ఇంతకంటే భీకర తుపాన్లను తట్టుకుంది.
మహా సాగరాలను రక్షించుకుందాం
- యునెస్కో
2050 కల్లా మహాసముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ పరిమాణమే ఎక్కువ కానుంది. ఈ ఆందోళనకర వాస్తవాన్ని ఎదుర్కొనేందుకు మనమంతా సమష్టిగా కదలాలి. మహాసాగరాలను కాపాడుకోవడాన్ని సవాలుగా తీసుకొని ముందడుగు వేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
-
Bandaru: గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు మాజీ మంత్రి బండారు
-
చంద్రబాబుపై విషం కక్కుతున్న వైకాపా.. ప్రజల్లోకి కల్పిత ఫోన్ సంభాషణల రికార్డింగ్