మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌ కన్నుమూత

మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌ బాలూ ధనోర్కర్‌ (47) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Updated : 31 May 2023 04:37 IST

తండ్రి చనిపోయిన 2 రోజులకే మరో విషాదం

దిల్లీ/ముంబయి: మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌ బాలూ ధనోర్కర్‌ (47) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్ర్‌పుర్‌ నుంచి గెలిచిన సురేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మహారాష్ట్ర ఎంపీ. రెండు రోజుల క్రితమే ఆయన తండ్రి అనారోగ్యంతో మరణించారు. రోజుల వ్యవధిలోనే కుమారుడు కూడా మరణించడం సురేశ్‌ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. కిడ్నీలో రాళ్లకు చికిత్స కోసం మే 26న సురేశ్‌ నాగ్‌పుర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గత ఆదివారం ఆయన్ను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి ఎయిర్‌ అంబులెన్సు ద్వారా తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారని కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్‌ థోరట్‌ తెలిపారు. సురేశ్‌ నాగ్‌పుర్‌ ఆసుపత్రిలో చేరిన మరుసటిరోజే తండ్రి నారాయణ్‌ ధనోర్కర్‌ (80) దీర్ఘకాల అనారోగ్య కారణాలతో గత శనివారం మరణించారు. ఆదివారం జరిగిన తండ్రి అంత్యక్రియలకు కూడా ఎంపీ హాజరు కాలేకపోయారు. బాలాసాహెబ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్‌.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్ర్‌పుర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సురేశ్‌ భార్య ప్రతిభ 2019లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వరోరా-భద్రావతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎంపీ సురేశ్‌ బాలూ ధనోర్కర్‌ మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని