రెజ్లర్ల కంట గంగ

తమను లైంగికంగా వేధించిన బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు.. కేంద్రం స్పందించనందుకు నిరసనగా పతకాలను గంగా నదిలో కలిపేందుకు మంగళవారం హరిద్వార్‌ వచ్చారు.

Published : 31 May 2023 03:58 IST

కేంద్రం తీరుకు నిరసనగా పతకాలను గంగలో కలిపేందుకు వచ్చిన మల్లయోధులు
హరిద్వార్‌లో కన్నీరుమున్నీరు
రైతు సంఘాల నేతల విజ్ఞప్తితో 5 రోజులు వాయిదా
బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలకు డిమాండ్‌

దిల్లీ, హరిద్వార్‌: తమను లైంగికంగా వేధించిన బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు.. కేంద్రం స్పందించనందుకు నిరసనగా పతకాలను గంగా నదిలో కలిపేందుకు మంగళవారం హరిద్వార్‌ వచ్చారు. ఒలింపిక్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకాలను గంగలో కలపాలని నిర్ణయించుకుని.. వందల మంది మద్దతుదారులతో కలిసి సాక్షి మలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌, సంగీత ఫొగాట్‌ తమ భర్తలతో కలిసి హరిద్వార్‌ చేరుకున్నారు. బజ్‌రంగ్‌ పునియా ఆ తర్వాత వచ్చారు. హర్‌ కీ పౌఢీ వద్ద సుమారు 20 నిమిషాలపాటు పాటు మౌన దీక్ష చేశారు. ఆ తర్వాత గంగా నది ఒడ్డుకు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. ప్రాణ సమానమైన పతకాలను నిమజ్జనం చేయాల్సి వస్తోందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమను ఈ స్థితికి తీసుకొచ్చిన నేతలపై విమర్శలు గుప్పించారు. వారి రోదనలతో అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది. అయితే చివరి క్షణంలో ఖాప్‌, రైతు సంఘాల నేతలు వారిని వారించారు. కేంద్ర ప్రభుత్వానికి కొంత గడువిద్దామని ప్రతిపాదించారు. దీంతో రెజ్లర్లు వెనక్కి తగ్గారు. ప్రభుత్వానికి 5 రోజుల గడువిస్తున్నామని, ఆలోగా చర్యలు తీసుకోకుంటే పతకాలను గంగలో కలిపేస్తామని స్పష్టం చేశారు. ‘ఈ పతకాలు మా జీవితం, ఆత్మ. వాటిని తల్లిలా భావించే గంగా నదిలో కలపాలనుకుంటున్నాం. ఆ తర్వాత బతికున్నా ప్రయోజనం లేదు. అందుకే చనిపోయే వరకూ ఇండియా గేట్‌వద్ద ఆమరణ దీక్ష చేయాలనుకుంటున్నాం’ అని సాక్షి మలిక్‌, వినేశ్‌లు ఆవేదనతో ప్రకటించారు.

ఆదివారం కొత్త పార్లమెంటు భవనంవద్దకు ర్యాలీగా వెళ్లేందుకు రెజ్లర్లు సిద్ధంకాగా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారు దీక్ష చేస్తున్న జంతర్‌మంతర్‌ను ఖాళీ చేయించారు. ఇకపై అక్కడ దీక్షకు అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రెజ్లర్లు మంగళవారం పతకాల నిమజ్జనంపై కీలక ప్రకటన చేశారు.

ఇండియా గేట్‌ వద్దా అనుమతించం

ఇండియా గేట్‌ వద్దా రెజ్లర్ల దీక్షను అనుమతించేది లేదని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అది జాతీయ స్మారకమని, ఆందోళనలకు వేదిక కాదని తెలిపారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తృణమూల్‌ ఫిర్యాదు

రెజ్లర్ల పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తృణమూల్‌ కాంగ్రెస్‌ మంగళవారం ఫిర్యాదు చేసింది. కొట్టి వేధించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేసింది.

ఎర్రకోటపై నుంచి మహిళల రక్షణ గురించి ఉపన్యాసాలిచ్చే ప్రధాని మోదీ రెజ్లర్ల డిమాండుపై ఎందుకు స్పందించడంలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు.

ప్రధాని తన దురహంకారాన్ని పక్కనబెట్టి రెజ్లర్లకు న్యాయం చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ డిమాండు చేశారు.

మరోవైపు బ్రిజ్‌ భూషణ్‌కు మద్దతుగా వచ్చే వారం ర్యాలీ నిర్వహించాలని అయోధ్యలోని కొందరు పూజారులు తెలిపారు. పోక్సో చట్టంలో పలు లోపాలున్నాయని, వాటినీ సవరించాలని వారు డిమాండు చేశారు.


మైనర్‌ పిటిషన్‌పై..

నపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మైనర్‌ రెజ్లర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏ కోర్టు విచారించాలో దిల్లీ హైకోర్టు నిర్ణయించనుంది. ఈ మేరకు మంగళవారం రిజిస్ట్రార్‌ జనరల్‌, దిల్లీ ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి మైనర్లపై లైంగిక వేధింపుల కేసును పోక్సో కోర్టు విచారిస్తుంది. కానీ ఇందులో ఎంపీ నిందితుడు కావడంతో ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు విచారించాల్సి ఉంది. దీంతో హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.


రెజ్లర్లకు మద్దతుగా 1న దేశవ్యాప్త ఆందోళన

దిల్లీ: రెజ్లర్లకు మద్దతుగా జూన్‌ 1వ తేదీన దేశవ్యాప్త ఆందోళన నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా వెల్లడించింది. నిరసన తెలిపే రెజ్లర్ల ప్రజాస్వామ్య హక్కులను కాపాడటంలో భాగంగా ఈ ఆందోళనకు పిలుపునిచ్చినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సమాజమంతా బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని కోరుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని