దిల్లీ మద్యం కేసులో రూ.623 కోట్ల అవినీతి
ముడుపులు తీసుకొని దిల్లీ మద్యం విధానాన్ని ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తయారుచేసిన వ్యవహారంలో రూ.623 కోట్ల అవినీతి వెలుగుచూసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొంది.
సిసోదియాను 29వ నిందితుడిగా పేర్కొంటూ దాఖలుచేసిన 4వ ఛార్జిషీట్‌లో ఈడీ వెల్లడి
ఈనాడు, దిల్లీ: ముడుపులు తీసుకొని దిల్లీ మద్యం విధానాన్ని ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తయారుచేసిన వ్యవహారంలో రూ.623 కోట్ల అవినీతి వెలుగుచూసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొంది. ఈ వ్యవహారంలో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను 29వ నిందితుడిగా చేరుస్తూ మే 4న దాఖలుచేసిన 4వ ఛార్జిషీట్‌లో ఈ అంశాన్ని పేర్కొంది. దీన్ని మంగళవారం ఇక్కడి రౌస్‌ఎవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకొంది. సౌత్‌గ్రూప్ ముడుపుల కింద ఇచ్చిన రూ.100 కోట్లలో రూ.31 కోట్లను హైదరాబాద్ నుంచి హవాలాలో తరలించినట్లు పేర్కొంది. దిల్లీ బెంగాలీ మార్కెట్‌లోని బ్రోకర్ల ద్వారా ఈ వ్యవహారం నడిపినట్లు తెలిపింది. హవాలా కోసం ఉపయోగించిన రూ.50, రూ.20 నోట్లను ఈడీ ఛార్జిషీట్‌లో పొందుపరిచింది. 49 మంది నిందితులు, సాక్షుల వాంగ్మూలాలను జతచేసింది.
సిసోదియాదే కీలకపాత్ర
మొత్తం వ్యవహారంలో మనీష్ సిసోదియానే కీలకపాత్ర పోషించినట్లు ఈడీ తెలిపింది. ముడుపులు ఇచ్చిన వారికి అక్రమ ప్రయోజనం కల్పించేలా ఆయన మద్యం విధానాన్ని అమలు చేశారంది. పాత విధానంలో హోల్‌సేల్ వ్యాపారం చేసేవారికి 5% లాభం అనుమతించగా, కొత్త విధానంలో దాన్ని 12%కి పెంచినట్లు వెల్లడించింది. ఇందుకు కారణం అడిగితే లైసెన్స్ ఫీజును రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్లకు పెంచడం, స్థానిక రవాణా ఛార్జీలను లైసెన్స్‌దారే భరించాలని షరతు విధించడం, అలాగే ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ల్యాబ్‌టెస్టింగ్ చేయించాలన్న షరతులను దృష్టిలో ఉంచుకొని మార్జిన్‌ను 12%కి పెంచినట్లు నిందితులు చెప్పారని ఈడీ పేర్కొంది. అయితే ఇవేవీ నిజంకాదంది. ఈ మద్యం వ్యాపారంలో ఎక్కువమంది పాల్గొనకుండా చేయడానికి లైసెన్స్ ఫీజును రూ.5 కోట్లకు పెంచినట్లు వెల్లడించింది. అలాగే మద్యం విధానం నడిచిన కాలంలోనే ఇండోస్పిరిట్ సంస్థకు రూ.112 కోట్ల లాభం వచ్చినట్లు పేర్కొంది. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ లేఖప్రకారం ఈ సంస్థ లాభం రూ.192.8 కోట్ల మేర ఉన్నట్లు వెల్లడించింది. సౌత్‌గ్రూప్‌తో కుమ్మక్కయ్యే లాభాన్ని 12%గా ఖరారుచేసినట్లు పేర్కొంది. మనీష్ సిసోదియా ప్రతినిధి విజయ్‌నాయర్ సౌత్‌గ్రూప్‌నకు చెందిన శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ్ మాగుంట, కె.కవితలతో కుమ్మక్కై హోల్‌సేలర్లకు 12%, రిటైల్ వ్యాపారులకు 185% లాభం వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించినట్లు తెలిపింది. ఇందుకోసం సౌత్‌గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పినట్లు పేర్కొంది. 2021 మార్చి 19, 20 తేదీల్లో సిసోదియా ప్రతినిధి విజయ్‌నాయర్‌తో కవిత భేటీ అయినట్లు బుచ్చిబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని ఈడీ వెల్లడించింది. సౌత్‌గ్రూప్ ముడుపుల కింద చెల్లించిన రూ.100 కోట్లలో రూ.31 కోట్లను దిల్లీలోని ఇద్దరు హవాలా బ్రోకర్ల ద్వారా సేకరించినట్లు పేర్కొంది. ఈ సొమ్మును ఆప్ గోవా ఎన్నికల ప్రచారం కోసం ఖర్చుచేసినట్లు వెల్లడించింది. మనీష్ సిసోదియా 43 సిమ్‌లు, 14 ఫోన్లు మార్చారని, ఇందులో 5 సిమ్‌లే సిసోదియావని, మిగిలినవి ఇతర పేర్లపై ఉన్నట్లు పేర్కొంది.
బెయిల్ తిరస్కరణ
మనీశ్ సిసోదియాకు బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆయనపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని ఈ సందర్భంగా పేర్కొంది. తిహాడ్ జైలులో ఉన్న సిసోదియా బెయిల్ కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. జస్టిస్ దినేష్ కుమార్ శర్మ ధర్మాసనం మంగళవారం దానిపై ఉత్తర్వులు వెలువరించింది. సిసోదియా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ 18 శాఖలను నిర్వహించారని.. ఆయన బయటకు వెళితే సాక్ష్యాలను తారుమారు చేయగలరన్న సీబీఐ వాదనలతో ఏకీభవించింది. కేసులో సాక్షులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని, వారిని సిసోదియా ప్రభావితం చేయగలరంటూ ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
దందా సొమ్ముతో ఆస్తుల కొనుగోలు
పిళ్లై బెయిల్ పిటిషన్‌పై విచారణలో ఈడీ
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవిత ప్రతినిధిగా అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యవహరించారని ఈడీ న్యాయవాదులు తెలిపారు. బెయిల్ మంజూరు కోరుతూ అరుణ్ రామచంద్ర పిళ్లై ఇక్కడి రౌస్‌అవెన్యూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ మంగళవారం పిటిషన్ విచారణ చేపట్టారు. ఈ కేసులో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని, అందులో పిళ్లైది కీలకపాత్ర అని ఈడీ న్యాయవాదులు తెలిపారు. ఆయన ఎమ్మెల్సీ కవితకు ప్రతినిధిగా వ్యవహరించారని, ఈ దందాలో వచ్చిన సొమ్ములతో కవిత, ఆమె భర్త అనిల్, గోరంట్ల బుచ్చిబాబు, ఫీనిక్స్ శ్రీహరి హైదరాబాద్‌లో ఆస్తులు కొన్నారని ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధానంలో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపినట్లు ఈడీ న్యాయవాదులు తెలిపారు. ఈ వాదనపై అరుణ్ రామచంద్ర పిళ్లై తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తోందని, పిళ్లై ఏ కుట్రలోనూ భాగస్వామి కాదన్నారు. తమ వాదనలు వినిపించేందుకు కనీసం 20 నిమిషాల సమయం ఇవ్వాలని ప్రత్యేక జడ్జిని కోరారు. అందుకు నిరాకరించిన ప్రత్యేక జడ్జి ఎప్పుడూ ఒకేతరహా వాదనలు వినిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. వాదనలు లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. తమ వాదనలు వినాలని పదేపదే విజ్ఞప్తి చేయడంతో చివరకు జూన్ 2న వింటామంటూ విచారణను వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India-Canada: భారత్‌తో తెరవెనుక చర్చలను కొనసాగిస్తాం: కెనడా
-
Pawan Kalyan: పవన్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ నోటీసులు
-
కేబినెట్ ఆమోదం పొందాకే అమల్లోకి సీమెన్స్ ప్రాజెక్టు: చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు
-
ODI WC 2023: అశ్విన్ ఎంపికపై భజ్జీ కామెంట్లు.. నెట్టింట మరోసారి సంజూ వైరల్!
-
Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
-
Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు