పెద్ద నోట్ల ఉపసంహరణపై తీర్పు వాయిదా

కరెన్సీ నోట్లను చలామణి నుంచి తొలగించడానికి కానీ, నోట్ల ముద్రణను నిలిపివేయడానికి కానీ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు అధికారం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును దిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.

Published : 31 May 2023 04:32 IST

ఆర్బీఐ అధికారాన్ని ప్రశ్నిస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌

దిల్లీ: కరెన్సీ నోట్లను చలామణి నుంచి తొలగించడానికి కానీ, నోట్ల ముద్రణను నిలిపివేయడానికి కానీ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు అధికారం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును దిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కరెన్సీ నోట్ల రద్దు అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని పేర్కొంటూ రజనీశ్‌ భాస్కర్‌ గుప్తా అనే వ్యక్తి ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. గుప్తా న్యాయవాదితో పాటు ఆర్బీఐ న్యాయవాది వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ సుబ్రమణ్యం ప్రసాద్‌ల ధర్మాసనం తమ తీర్పును తరవాత ప్రకటిస్తామని తెలిపింది. ఆర్బీఐకి కరెన్సీ నోట్ల విడుదల, పునర్విడుదలకు మాత్రమే అధికారం ఉందనీ, ఈ నోట్ల ఆయుర్దాయం నాలుగైదేళ్లు మాత్రమేనని ఆర్బీఐ ఎలా నిర్ణయించిందని గుప్తా తరఫు న్యాయవాది సందీప్‌ అగర్వాల్‌ ప్రశ్నించారు. రూ.2000 నోట్లను గుర్తింపు పత్రం లేకుండా మార్చుకోవడానికి అనుమతించడాన్ని సవాలు చేసిన మరొక పిల్‌ను దిల్లీ హైకోర్టు మే 29న కొట్టివేసింది. ఒకే సమస్యపై వరుస పిల్‌లను విచారించకూడదని సుప్రీంకోర్టు తీర్మానించిన సంగతిని ఆర్బీఐ న్యాయవాది పరాగ్‌ త్రిపాఠీ కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, ప్రస్తుత పిల్‌ వేరని గుప్తా న్యాయవాది సందీప్‌ అగర్వాల్‌ అన్నారు. రూ.2000 నోట్లను ఉపసంహరించడం దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్బీఐకీ ఎలా ప్రయోజనకరమో చెప్పాలని గుప్తా తన పిల్‌లో డిమాండ్‌ చేశారు. ఆర్బీఐ ఏకపక్ష చర్యల వల్ల పౌరులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని హైకోర్టు దృష్టికి తెచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు