శాంతిని నెలకొల్పుతాం

తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో ఆ రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Updated : 31 May 2023 04:43 IST

అందరూ సహకరిస్తున్నారు
అమిత్‌ షా వెల్లడి
మణిపుర్‌లో వరుస భేటీలు
బాధిత ప్రాంతాల్లో పర్యటన
మరణించిన వారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం
ఇంటికో ఉద్యోగం

ఇంఫాల్‌, చురాచాంద్‌పుర్‌: తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో ఆ రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం మహిళలతో మాట్లాడిన ఆయన ఆ తర్వాత పౌర సంఘాలతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఆ తర్వాత చురాచాంద్‌పుర్‌లో పర్యటించారు. శాంతిని నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తొలుత మంగళవారం ఉదయం ఇంఫాల్‌లో మహిళా నేతలతో (మీరా పైబీ) అమిత్‌ షా తేనీటి విందు సమావేశం నిర్వహించారు. మణిపుర్‌ సమాజంలో వారి పాత్ర ఎంతో కీలకమని, కలిసి శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని నిర్ణయించామని ఆ తర్వాత షా ట్వీట్‌ చేశారు. పలు పౌర సంఘాల ప్రతినిధులతోనూ ఆయన సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలితాలనిచ్చాయని, వారంతా శాంతి పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని చెప్పారని అమిత్‌ షా ట్విటర్‌లో వెల్లడించారు.

అక్కడి నుంచి ఘర్షణలతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన చురాచాంద్‌పుర్‌కు కేంద్ర నిఘా విభాగం అధిపతి తపన్‌ కుమార్‌ డేకా, హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లాలతో కలిసి వెళ్లారు. అక్కడ చర్చి ప్రతినిధులు, కుకీ తెగకు చెందిన కొందరు మేధావులతో చర్చించారు. కుకీ, మేతీ వర్గాలతో సమావేశమయ్యారు. శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్‌ఎఫ్‌), కుకీ విద్యార్థి సంఘంతో మూడు రౌండ్ల చర్చలు జరిపారు. అయితే మణిపుర్‌ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నామని, అప్పటివరకూ రాష్ట్రపతి పాలన పెట్టాలని ఐటీఎల్‌ఫ్‌ కార్యదర్శి మువాన్‌ టోంబింగ్‌ డిమాండు చేశారు మణిపుర్‌ సమగ్రతను దెబ్బతీసే ఏ చర్యలు చేపట్టినా తమ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తామని క్రీడాకారులు స్పష్టం చేశారు. ఈ మేరకు 11 మంది అమిత్‌ షాకు మెమోరాండం సమర్పించారు. అందులో అనితా చాను, కుంజరాణి దేవి, సరితా దేవి, సంధ్యారాణి దేవి, మీరాబాయి చాను తదితరులు ఉన్నారు.

పరిహారం ప్రకటన

ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌తో అమిత్‌ షా సోమవారం రాత్రి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. చనిపోయిన వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నారు. తక్కువ ధరలకు పెట్రోలు, వంట గ్యాస్‌, బియ్యం, ఇతర ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

ప్రత్యేక అధికారి

మణిపుర్‌లో పరిస్థితిని అదుపు చేసేందుకు సీనియర్‌ పోలీస్‌ అధికారిని కేంద్రం పంపించింది. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా ఉన్న రాజీవ్‌ సింగ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఆయన 1993 బ్యాచ్‌కు చెందిన త్రిపుర కేడర్‌ ఐపీఎస్‌ అధికారి.


వేర్పాటు వాదంతో సంబంధం లేదు.. సీడీఎస్‌

ణిపుర్‌ హింసకు రెండు తెగల మధ్య నెలకొన్న వైరమే కారణమని, దానికి వేర్పాటు వాదంతో ఎటువంటి సంబంధం లేదని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ వెల్లడించారు. సమస్యలు వెంటనే పరిష్కారం కావని, వాటికి కొంత సమయం పడుతుందని తెలిపారు.


రాష్ట్రపతికి కాంగ్రెస్‌ వినతిపత్రం

ణిపుర్‌లో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కాంగ్రెస్‌ వినతి పత్రం అందజేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని బృందం 12 డిమాండ్లతో కూడిన లేఖను ముర్ముకు అందజేసింది. సుప్రీంకోర్టు సిట్టింగ్‌, రిటైర్డ్‌ జడ్జితో ఉన్నత స్థాయి కమిషన్‌ వేసి విచారించాలని కోరింది.

మణిపుర్‌లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు