ప్రధాని హత్యకు కుట్రకేసు దర్యాప్తు ముమ్మరం

ప్రధాని మోదీ హత్యకు పన్నిన కుట్రను గతేడాది భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తును తీవ్రం చేసింది.

Published : 01 Jun 2023 03:14 IST

3 రాష్ట్రాల్లో 25 చోట్ల ఎన్‌ఐఏ దాడులు
పీఎఫ్‌ఐ స్థావరాలే లక్ష్యంగా తనిఖీలు

దిల్లీ/ఉడుపి, న్యూస్‌టుడే : ప్రధాని మోదీ హత్యకు పన్నిన కుట్రను గతేడాది భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తును తీవ్రం చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోని 25 ప్రాంతాల్లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) స్థావరాలుగా అనుమానం ఉన్నచోట్ల తనిఖీలు జరిగాయి. బిహార్‌లోని కటిహార్‌, కర్ణాటకలోని దక్షిణ కన్నడ.. శివమొగ్గ, కేరళలోని కాసర్‌గోడ్‌, మలప్పురం, కొజికోడ్‌, తిరువనంతపురం జిల్లాల్లో దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో రూ.17.50 లక్షల నగదుతోపాటు డిజిటల్‌ ఉపకరణాలు, మొబైల్‌ ఫోన్లు, హార్డ్‌ డిస్కులు, పెన్‌ డ్రైవ్‌లు, సిమ్‌కార్డులు, డేటాకార్డులు, కొన్ని డాక్యుమెంట్లు సీజ్‌ చేశారు. కర్ణాటక తీర ప్రాంతంలోని ఉడుపి, బెళ్తంగడి, ఉప్పినంగడి, పుత్తూరు, బంట్వాళ చుట్టుపక్కల ప్రాంతాలలో 16 చోట్ల సోదాలు నిర్వహించారు. నిషేధిత పీఎఫ్‌ఐకి చెందిన సభ్యులను కొద్దిరోజుల కిందట జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. వారి నుంచి స్వాధీనపరుచుకున్న డిజిటల్‌ సాక్ష్యాల ఆధారంగా దేశంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు గల్ఫ్‌ దేశాల నుంచి హవాలా మార్గంలో కోట్లాది రూపాయలను నిందితులు సమకూర్చుకున్నారని గుర్తించారు. 2022 జులై నాటి పట్నా ర్యాలీలో ప్రధాని మోదీని హత్య చేయాలని పీఎఫ్‌ఐ పన్నిన కుట్రపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. పట్నాలోని పుల్వార్‌ షరీఫ్‌ వద్ద జాతి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అయిదుగురు వ్యక్తులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 85 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు జరిగాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు