రెజ్లర్ల కేసుపై గందరగోళం

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై రెజ్లర్లు పెట్టిన కేసులో బుధవారం దిల్లీ పోలీసులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి గందరగోళం సృష్టించారు.

Published : 01 Jun 2023 03:14 IST

మొదట ఆధారాలేమీ దొరకలేదన్న పోలీసులు
ఆ తర్వాత దర్యాప్తు జరుగుతోందని వెల్లడి
నిరూపితమైతే ఉరేసుకుంటా: బ్రిజ్‌ భూషణ్‌

దిల్లీ: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై రెజ్లర్లు పెట్టిన కేసులో బుధవారం దిల్లీ పోలీసులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి గందరగోళం సృష్టించారు. మొదట ఆధారాలేమీ దొరకలేదని చెప్పిన పోలీసులు.. ఆ తర్వాత మాట మార్చి విచారణ జరుగుతోందని, కోర్టుకు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. మరోవైపు తనపై ఆరోపణలు రుజువైతే ఉరేసుకుంటానని బ్రిజ్‌ భూషణ్‌ పేర్కొన్నారు.

రెజ్లర్లు పెట్టిన కేసులో బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా పోలీసులకు సరైన ఆధారాలు దొరకలేదని, 15 రోజుల్లో కోర్టుకు నివేదిక సమర్పిస్తామని అధికారులు తొలుత ట్విటర్‌లో ప్రకటించారు. పోలీసుల అధికార ప్రతినిధి అదే సమాచారాన్ని మీడియాకు అందజేశారు. పీఆర్‌వో కూడా వాట్సప్‌ గ్రూపులో సమాచారాన్ని పంచుకున్నారు. అయితే గంటలోగా వారంతా ఆ సమాచారాన్ని తొలగించారు. మరో ప్రకటన చేశారు. ‘ఆ సమాచారం తప్పు. సున్నితమైన ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది’ అని దిల్లీ పోలీసులు తెలిపారు. ‘మహిళా రెజ్లర్లు పెట్టిన కేసులో దర్యాప్తు ఇంకా జరుగుతోంది. దర్యాప్తు తాజా స్థితిపై కోర్టుకు నివేదిక సమర్పిస్తాం. దర్యాప్తు జరుగుతున్నందున వివరాలను బయటపెట్టలేం’ అని పోలీసు అధికార ప్రతినిధి ట్విటర్‌లో పేర్కొన్నారు.

వారిని తప్పుపట్టబోను..

తనపై రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఒక్కటి రుజువైనా ఉరేసుకుంటానని ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ తెలిపారు. బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెజ్లర్లు తన పిల్లల్లాంటివారని, వారిని తప్పుపట్టబోనని, వారి విజయాల కోసం తాను రక్తం, స్వేదం చిందించానని పేర్కొన్నారు.

*  లైంగిక వేధింపుల కేసు పెట్టిన మైనరు రెజ్లర్‌ పేరు వెల్లడించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసులకు దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలీవాల్‌ సూచించారు. ఆ బాలికకు అంకుల్‌నంటూ ఓ వ్యక్తి వివరాలను బయటకు చెప్పారని, పోక్సో చట్టం ప్రకారం అలా వెల్లడించడానికి వీల్లేదని ఆమె పేర్కొన్నారు.

తొందర పడకండి: ఠాకుర్‌

పతకాలను గంగా నదిలో కలిపే విషయంలో సంయమనం పాటించాలని రెజ్లర్లకు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ విజ్ఞప్తి చేశారు. దర్యాప్తుపై నమ్మకం ఉంచాలని సూచించారు. దర్యాప్తు నివేదిక బయటకు వచ్చే వరకూ ఆగాలని కోరారు.


మమత నిరసన

కోల్‌కతా: జంతర్‌మంతర్‌వద్ద ఆదివారం జరిగిన ఘటనలో రెజ్లర్లను పోలీసులు కొట్టారనే ఆరోపణల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కోల్‌కతాలో ర్యాలీ జరిపారు. రెజ్లర్లకు న్యాయం చేయాలనే ప్లకార్డులతో 2.8 కిలోమీటర్ల దూరం ఆమె నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పలువురు క్రీడాకారులు, రాష్ట్ర మంత్రి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని