రూ.లక్ష కోట్లతో గిడ్డంగులు

ఆహార భద్రతను బలోపేతం చేయడం, సరైన ధర వచ్చే వరకు రైతులు పంటలను నిల్వ చేసుకునే వీలు కల్పించడం, ఆహారోత్పత్తుల నిల్వ నష్టాలను తగ్గించడమనే బహుళ ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 01 Jun 2023 03:14 IST

కేంద్ర మంత్రి మండలి నిర్ణయం

దిల్లీ: ఆహార భద్రతను బలోపేతం చేయడం, సరైన ధర వచ్చే వరకు రైతులు పంటలను నిల్వ చేసుకునే వీలు కల్పించడం, ఆహారోత్పత్తుల నిల్వ నష్టాలను తగ్గించడమనే బహుళ ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆహార ధాన్యాల నిల్వల సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు రూ.లక్ష కోట్లను వెచ్చించాలన్న ప్రతిపాదనకు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వచ్చే అయిదేళ్లలో సహకార రంగంలో 700 లక్షల టన్నుల మేర ఆహార ధాన్యాల నిల్వలకు ఏర్పాట్లు చేయాలని సంకల్పించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తోంది. సంబంధిత వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ మీడియాకు వెల్లడించారు.

* మన దేశంలో ప్రస్తుత గిడ్డంగుల సామర్థ్యం 1,450 లక్షల టన్నులు మాత్రమే. రాబోయే ఐదేళ్లలో దాన్ని 2,150 లక్షల టన్నులకు పెంచాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమంగా మంత్రి దీనిని అభివర్ణించారు.

* ప్రతి బ్లాకులో 2 వేల టన్నుల సామర్థ్యంతో కొత్తగా గోదాములు ఏర్పాటు చేస్తాం. ఇవి అందుబాటులోకి వస్తే తమ ఉత్పత్తులను నష్టానికి విక్రయించాల్సిన అవసరం రైతులకు ఉండదని మంత్రి తెలిపారు. ఆహార ధాన్యాల వృథాను అరికట్టేందుకూ ఇది ఉపయోగపడుతుందన్నారు.

* సుదూర ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించాల్సిన అవసరం ఉండదు కనుక రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఆహార భద్రతకు భరోసా ఏర్పడుతుందని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థతోనూ ఈ గోదాములను అనుసంధానిస్తామన్నారు.

* గిడ్డంగుల్లో ధాన్యం నిల్వల బాధ్యతలను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌)కు అప్పగిస్తారు.

అంతర్‌ మంత్రిత్వ కమిటీ ఏర్పాటు

సహకార రంగంలో గోదాముల నిర్మాణ నిర్ణయం సక్రమంగా అమలయ్యేలా చూడటానికి, అందుకు అవసరమైన నిబంధనల రూపకల్పన కోసం అంతర్‌ మంత్రిత్వ కమిటీ ఏర్పాటుకూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కమిటీ ఛైర్మన్‌గా సహకార మంత్రి వ్యవహరిస్తారు.   ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యం పెంపు నిర్ణయాన్ని తొలుత ప్రయోగాత్మకంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని ఎంపిక చేసిన 10 జిల్లాల్లో అమలు జరపనున్నారు.  

నగరాల అభివృద్ధికి విదేశీ నిధులు

దేశంలోని వివిధ నగరాల అభివృద్ధి కోసం సిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ టు ఇన్నోవేట్‌, ఇంటిగ్రేట్‌ అండ్‌ సస్టైన్‌ (సీఐటీఐఐఎస్‌) 2.0 అనే కొత్త పథకానికి ఆమోద ముద్ర వేసింది కేంద్ర మంత్రివర్గం. ఈ పథకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు కొనసాగుతుందని సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. ఫ్రెంచ్‌ అభివృద్ధి సంస్థ(ఏఎఫ్‌డీ), ఐరోపా సమాజం(ఈయూ), కేఎఫ్‌డబ్ల్యూ, జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ భాగస్వామ్యంతో ఈ పథకాన్ని చేపట్టనున్నారు. దీనికి ఏఎఫ్‌డీ రూ.1,760 కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ రూ.880 కోట్ల రుణంతో పాటు ఈయూ రూ.102 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని మంత్రి వివరించారు.   2018లో రూ.933 కోట్లతో చేపట్టిన సీఐటీఐఐఎస్‌ 1.0 పథ]కానికి ఇది కొనసాగింపు.


మోదీకి కేబినెట్‌ కృతజ్ఞతలు

ఎన్నడూలేని విధంగా వైవిధ్యమైన పథకాలను అమలుచేస్తూ గత తొమ్మిదేళ్లుగా దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రిమండలి కృతజ్ఞతలు తెలిపింది. 2019లో వరుసగా రెండోసారి విజయాన్ని అందించి దేశానికి సేవ చేసేందుకు అవకాశమిచ్చిన ప్రజలకూ కృతజ్ఞతలు చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని