మణిపుర్‌లో శాంతికి సహకరిస్తాం

మణిపుర్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బుధవారం మయన్మార్‌ సరిహద్దులోని మోరె పట్టణాన్ని సందర్శించారు.

Published : 01 Jun 2023 04:27 IST

అమిత్‌ షాతో భేటీలో పలు వర్గాల హామీ
పరిస్థితులను చక్కదిద్ది నిరాశ్రయులను ఇళ్లకు పంపిస్తాం: షా
మయన్మార్‌ సరిహద్దులో పర్యటన

ఇంఫాల్‌, మోరె: మణిపుర్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బుధవారం మయన్మార్‌ సరిహద్దులోని మోరె పట్టణాన్ని సందర్శించారు. అక్కడ కుకీ వర్గ నేతలతో సమావేశమయ్యారు. పలు వర్గాల వారితోపాటు మోరెలో ఉంటున్న తమిళ వ్యాపారులతోనూ భేటీ అయ్యారు. మణిపుర్‌లో శాంతి నెలకొల్పేందుకు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని వారంతా హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర బలగాల అధికారులతో భద్రతపై అమిత్‌ షా సమీక్షించారు. ఆయన వెంట కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భళ్లా, నిఘా విభాగం డైరెక్టర్‌ తపన్‌ కుమార్‌ డేకా ఉన్నారు. మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ రాలేదు. కాంగ్‌పోపి జిల్లాలోనూ అమిత్‌ షా పర్యటించారు. అక్కడా పలు వర్గాల నాయకులతో సమావేశమయ్యారు. ఇంఫాల్‌లోనూ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మణిపుర్‌లో శాంతిని నెలకొల్పేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఘర్షణల కారణంగా ఇళ్లను వదిలేసి వచ్చి పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారిని పరిస్థితులను చక్కదిద్ది తిరిగి ఇళ్లకు పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొండ ప్రాంతాల్లో నిత్యావసరాల సరఫరాకు చర్యలు తీసుకుంటామని, అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఆయుధాలను ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలను ఆదేశించారు. కాంగ్‌పోపిలో కుకీ నిర్వాసితులను, ఇంఫాల్‌లో మేతీ బాధితులను ఆయన పరామర్శించారు. మరోవైపు ఎత్తుకెళ్లిన ఆయుధాలను అప్పగించి లొంగిపోవాలని మిలిటెంట్లకు ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రతా బలగాల కదలికలకు వీలుగా రోడ్లపై అడ్డంకులను తొలగించాలని కోరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని