సంక్షిప్త వార్తలు(7)
మద్యం కేసు విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చే సమయంలో భద్రతా సిబ్బంది తనపై చేయిచేసుకున్నారంటూ దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా చేసిన ఆరోపణలపై ఇక్కడి రౌజ్ ఎవెన్యూకోర్టు స్పందించింది.
కోర్టు ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని భద్రపరచండి
భద్రతా సిబ్బంది చేయి చేసుకున్నారన్నసిసోదియా ఆరోపణపై జడ్జి ఆదేశం
ఈనాడు, దిల్లీ: మద్యం కేసు విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చే సమయంలో భద్రతా సిబ్బంది తనపై చేయిచేసుకున్నారంటూ దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా చేసిన ఆరోపణలపై ఇక్కడి రౌజ్ ఎవెన్యూకోర్టు స్పందించింది. మే 23 నాటి కోర్టు ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజిని భద్రపరచాలని గురువారం పోలీసులను ఆదేశించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో దిల్లీ పోలీసులు కూడా ఆయన్ను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపరిచేందుకు అనుమతివ్వాలంటూ దరఖాస్తు చేశారు. సిసోదియాను న్యాయస్థానానికి తీసుకొచ్చినప్పుడు కోర్టు ప్రాంగణంలో ఆప్ మద్దతుదారులు, మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో గుమికూడుతుండటం వల్ల తోపులాట పరిస్థితి నెలకొంటోందని, అందువల్ల ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించాలని కోరారు. ఈ రెండు అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ సిసోదియాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలని ఆదేశించారు. మనీలాండరింగ్ ఆరోపణల కింద సిసోదియాను ఈడీ మార్చి 9న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తిహాడ్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
ప్రైవేటు రంగం నుంచి 17 మంది ఉన్నతాధికారులు
ఆరు కేంద్ర విభాగాల కోసం యూపీఎస్సీ ప్రకటన
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 17 మంది సీనియర్ ఉన్నతాధికారుల పోస్టులను ప్రైవేటు రంగం నుంచి నేరుగా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆరు విభాగాలకు ముగ్గురు సంయుక్త కార్యదర్శుల స్థాయి అధికారులను, 14 మంది డైరెక్టర్లు/ డిప్యూటీ సెక్రటరీలను తీసుకోవాలని యూపీఎస్సీని ‘సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ’ కోరినట్లు కేంద్రం గురువారం ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఇలాంటి సీనియర్ ఉన్నతాధికారుల పోస్టులను అఖిల భారత, గ్రూప్-ఎ సర్వీసుల అధికారులు నిర్వర్తిస్తారు. ప్రభుత్వ సేవల్లోకి ప్రతిభావంతులను, నిపుణులను తీసుకురావడానికి, మానవ వనరుల లభ్యతను పెంచడానికి 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం ఇలా ఇప్పటికే మూడుసార్లు నియామకాలు చేపట్టింది. మొదట తాత్కాలిక విధానంలో 20 మంది సీనియర్ అధికారుల భర్తీకి మే 20న యూపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. తాజా నియామకాల కోసం పూర్తి వివరాలు, నియమ నిబంధనలను ఈ నెల 3న యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు జులై 3 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.
రూ.150 కోట్ల డ్రగ్స్ పట్టివేత
రాజౌరి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పోలీసులు అంతర్రాష్ట మాదకద్రవ్యాల రవాణా ముఠాను భగ్నం చేశారు. కారులో రూ.150 కోట్ల విలువైన 22 కిలోల డ్రగ్స్‌ను రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. జమ్మూ-రాజౌరి జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులిద్దరూ పంజాబ్‌కు చెందినవారని తెలిపారు.
రాష్ట్రపతితో ప్రచండ సమావేశం
దిల్లీ: నేపాల్ ప్రధాని ప్రచండ...గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ... నేపాల్ ఎప్పుడూ భారత్‌కు ప్రాధాన్య మిత్ర దేశమన్నారు. కొవిడ్ కష్టకాలంలోనూ రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం కొనసాగిందని ఆమె గుర్తు చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నేపాల్ ప్రధాని ప్రచండ శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు వెళ్తారు.
మనలో మనమే ఘర్షణ పడుతున్నాం: మోహన్ భాగవత్
నాగ్‌పుర్: భారత ఐక్యత, సమగ్రతలను కాపాడేందుకు పౌరులంతా కృషి చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. దేశ సరిహద్దుల్లో శత్రువులకు మన బలం చూపించడానికి బదులు ప్రస్తుతం మనలో మనమే ఘర్షణ పడుతున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాగ్‌పుర్‌లో ఆరెస్సెస్ శ్రేణుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా భాగవత్ గురువారం ఈ మేరకు ప్రసంగించారు.
గోవులను బంధించి ఉంచుతున్నారు
జమ్మూలో ప్రజాహిత వ్యాజ్యం
గోశాలను దర్శించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జమ్ము: ఆవుల సంరక్షణ కేంద్రంలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని జమ్మూకశ్మీర్-లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా తీసుకుంది. జమ్మూలోని నగ్రోటాలోని గోశాల పరిస్థితిని తామే స్వయంగా సమీక్షిస్తామని పేర్కొంది. ‘‘సేరీ కుర్ద్ గ్రామంలోని గోశాలను శుక్రవారం సందర్శిస్తాం. ఆ ప్రాంతంలో సాయంత్రం 4.30 గంటలకల్లా అధికారులు ఉండాలని ఆదేశిస్తున్నాం’’ అని గురువారం ప్రధాన న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది షకీల్ అహ్మద్ తన వాదనలు వినిపిస్తూ.. ఏప్రిల్ 8న ఆ గోశాలను తాను దర్శించానని, అక్కడి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను న్యాయస్థానం ముందుంచారు. గోవులను రోజంతా బంధించే ఉంచుతున్నారని, మేతకూ పంపడం లేదని పేర్కొన్నారు.
స్థానికంగా ఉంటే సీఆర్‌పీఎఫ్ కమాండోలొద్దు
బయటి రాష్ట్రాలకు వెళ్లినప్పుడు చాలు
కేంద్రానికి పంజాబ్ సీఎం స్పష్టీకరణ
చండీగఢ్: జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో భాగంగా చుట్టూ పహరా కాసే సీఆర్‌పీఎఫ్ కమాండోలు తాను దిల్లీ, పంజాబ్‌లలో ఉన్నప్పుడు అవసరం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ఈ రెండు చోట్ల మినహా మిగిలిన రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆ కమాండోలు ఉంటే చాలని కేంద్రానికి తేల్చి చెప్పారు. ఖలిస్థానీ ఆందోళనల నేపథ్యంలో మాన్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సీఆర్‌పీఎఫ్ కమాండోలు నిత్యం పహరా కాసేలా ఆదేశాలిచ్చింది. దీనిపై స్పందించిన పంజాబ్ ప్రభుత్వం.. కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. పంజాబ్, దిల్లీలలో రాష్ట్ర పోలీసులు పూర్తి భద్రత కల్పిస్తున్నారని, మిగిలిన రాష్ట్రాలకు వెళ్లినప్పుడు సీఆర్‌పీఎఫ్ కమాండోలు వస్తే చాలని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!
-
Taiwan: చైనాకు భారీ షాకిచ్చిన తైవాన్.. సొంతంగా సబ్‌మెరైన్ తయారీ..!
-
Manipur Violence: ‘కనీసం అస్థికలైనా తెచ్చివ్వండి’.. మణిపుర్లో ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన
-
Raveena Tandon: అతడి పెదవులు తాకగానే వాంతి అయింది: రవీనా టాండన్
-
Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ.. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్: రష్మిక
-
Yuvagalam: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా