ఎక్కడపడితే అక్కడ చేతులేసేవారు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Updated : 03 Jun 2023 07:12 IST

సహకరించకపోతే కెరీర్‌ నాశనం చేస్తానని బెదిరించేవారు
భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై మహిళా రెజ్లర్ల ఫిర్యాదు
ఎఫ్‌ఐఆర్‌లలో సంచలన విషయాలు

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమతో ఆయన దారుణంగా ప్రవర్తించేవారని, శరీరాన్ని తాకడం, అనుమతి లేకుండా దుస్తుల్లో చేతులు పెట్టడం.. కౌగిలించుకోవడం.. తదితర అసభ్య కార్యకలాపాలకు పాల్పడేవారని మహిళా రెజ్లర్లు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో పోటీలు జరిగే సమయంలోనూ బ్రిజ్‌ భూషణ్‌ ఈ దురాగతాలకు పాల్పడినట్లు ఆరోపించారు. సహకరించకపోతే కెరీర్‌ను నాశనం చేస్తానని కూడా ఆయన బెదిరించేవారని చెప్పారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భారత అగ్రశ్రేణి రెజర్లు గత కొన్ని రోజులుగా దిల్లీలో ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేయడంతో దిల్లీలోని కనాట్‌ప్లేస్‌ పోలీసుస్టేషన్‌లో గత నెల రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆరుగురు మహిళా రెజ్లర్లతో మొదటి ఎఫ్‌ఐఆర్‌, మరో మైనర్‌ రెజ్లర్‌ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్‌ ఏప్రిల్‌ 28న దాఖలైంది. ఇందులో పోక్సో చట్టం సెక్షన్‌ కూడా ఉంది. ఈ కేసు నిరూపితమైతే బ్రిజ్‌ భూషణ్‌కు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

టీషర్ట్‌లో చేయి పెట్టి..

బ్రిజ్‌ భూషణ్‌ తమతో అత్యంత అనుచితమైన, దారుణమైన రీతిలో బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.‘‘నేను అందరితో కలిసి సాధన చేస్తున్నా. ఆ సమయంలో నిందితుడు (బ్రిజ్‌ భూషణ్‌) నన్ను రమ్మని పిలిచారు. ఇతర అమ్మాయిలను అసభ్యకరంగా తాకుతుండడం చూసి తిరస్కరించాను. మళ్లీ పిలిచారు. తర్వాత నా టీషర్ట్‌లో చేయి పెట్టారు. పొట్టపై చేతులు వేశారు. నాభి భాగాన్ని తడిమారు. ఆయనకు భయపడి అమ్మాయిలెప్పుడూ ఒంటరిగా తిరిగేవాళ్లు కాదు. గదుల్లో నుంచి బయటకు వచ్చినా బృందాలుగానే ఉండేవాళ్లం’’ అని ఓ రెజ్లర్‌ తన ఫిర్యాదులో తెలిపారు.

కోచ్‌ లేని సమయంలో..!

కోచ్‌ లేని సమయంలో బ్రిజ్‌ భూషణ్‌ తన వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించేవారని ఇంకో రెజ్లర్‌ ఆరోపణలు చేశారు. ‘‘విదేశాల్లో జరిగిన పోటీల్లో గాయపడ్డాను. అప్పుడు ఆయన (బ్రిజ్‌భూషణ్‌) నా వద్దకు వచ్చి.. తనతో సన్నిహితంగా ఉంటే చికిత్సకయ్యే ఖర్చులన్నీ సమాఖ్యే భరిస్తుందని చెప్పారు’’ అని  తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.

తనిఖీ పేరుతో..

‘‘నేను మ్యాట్‌పై సాధన చేస్తున్నా. అకస్మాత్తుగా వచ్చారు. నా మీదకు వంగి అనుమతి లేకుండా టీషర్ట్‌ను లాగి.. తన చేతులను నా ఛాతీపై పెట్టారు. అక్కడి నుంచి శ్వాస తనిఖీ నెపంతో పొట్ట దగ్గరకు చేతిని తీసుకెళ్లారు’’ అని ఇంకో రెజ్లర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అభినందిస్తారనుకుంటే..

‘‘నేను ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచాను. నా గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఆ సమయంలో అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ తన గదికి రమ్మంటున్నారని ఫిజియో థెరపిస్టు చెప్పారు. అభినందించడానికి పిలుస్తున్నారనుకున్నా. అక్కడ తన మొబైల్‌లో నా తల్లిదండ్రులతో మాట్లాడించారు. తర్వాత మంచం వద్దకు రమ్మన్నారు. అకస్మాత్తుగా కౌగిలించుకున్నారు. ఏడ్చేసరికి.. వెనక్కి తగ్గారు. తండ్రిలాంటివాడినని చెప్పి నాటకం ఆడారు’’ అని మరో రెజ్లర్‌ తన ఫిర్యాదులో చెప్పారు.

వెనక నుంచి వచ్చి..

‘‘అందరం కలిసి ఫోటో తీసుకుంటున్నాం. ఆ సమయంలో ఆయన నా వెనుక నుంచి వచ్చి చేయి వేశారు. ఉలిక్కిపడి వెనక్కి చూశాను. దూరంగా వెళ్లడానికి ప్రయత్నించాను. అయినా నా భుజాన్ని గట్టిగా పట్టుకొని నిరోధించారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాను’’ అని ఒక రెజ్లర్‌ పేర్కొన్నారు.


మైనర్‌నీ వదల్లేదు

రెండో ఎఫ్‌ఐఆర్‌లో మైనర్‌ తండ్రి తన కుమార్తెకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. ‘‘పతకం గెలిచిన నా కుమార్తెతో ఫొటో దిగే నెపంతో భుజాలపై బ్రిజ్‌భూషణ్‌ చేతులు వేశారు. కదలకుండా గట్టిగా అదిమిపెట్టి.. తన చేతులతో ఆమె శరీరాన్ని తడిమారు’’ అని పేర్కొన్నారు.


9 లోపు అరెస్టు చేయాల్సిందే: రాకేశ్‌ టికాయిత్‌

కురుక్షేత్ర(హరియాణా): బ్రిజ్‌భూషణ్‌ను ఈ నెల 9లోపు అరెస్టు చేయకపోతే రెజ్లర్లతో కలిసి రైతులు జంతర్‌ మంతర్‌లో ధర్నా చేస్తారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు. శుక్రవారం జరిగిన ‘ఖాప్‌ పంచాయత్‌’ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలి. రెజ్లర్లకు వ్యతిరేకంగా నమోదైన కేసులను వెనక్కి తీసుకోవాలి. చర్చలతో ఈ సమస్యను కేంద్రం పరిష్కరించాలి. నిందితుడిని అరెస్టు చేయాలి. లేకపోతే ఈ నెల 9న రెజ్లర్లతో కలిసి జంతర్‌ మంతర్‌లో కూర్చుంటాం’’ అని టికాయిత్‌ తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని