బ్యాగులో బాంబు ఉందనడంతో ముంబయి ఎయిర్‌పోర్టులో కలకలం

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలు చేసిన హడావుడి కలకలం రేపింది.

Published : 03 Jun 2023 05:26 IST

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలు చేసిన హడావుడి కలకలం రేపింది. పరిమితికి మించి లగేజీ తీసుకొచ్చిన ఆమె.. దానికయ్యే అదనపు ఛార్జీలను చెల్లించేందుకు నిరాకరిస్తూ, తన బ్యాగులో బాంబు ఉందని చెప్పడం భద్రతా సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించింది. దక్షిణ ముంబయికి చెందిన ఆ మహిళ తన కుటుంబంతో కలిసి కోల్‌కతా వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి చేరుకున్నారు. చెక్‌ఇన్‌ కౌంటరు వద్ద లగేజీ అప్పగించారు. అదనపు బరువు ఉన్నందున నిబంధనల ప్రకారం ఆ మేర అదనంగా డబ్బు చెల్లించాలని సిబ్బంది కోరగా.. ఆమె నిరాకరించారు. ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తన లగేజిలోని ఓ బ్యాగులో బాంబు ఉందని ఆమె చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఆమె బ్యాగును క్షుణ్నంగా తనిఖీ చేయగా.. అలాంటిదేమీ లేదని తేలింది. ఈ వ్యవహారం విమానాశ్రయంలో కాసేపు భయాందోళనలకు దారితీసింది. ఇతరుల ప్రాణాలకు, భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తించారన్న అభియోగాలపై.. ఆమెను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని