శివాజీ పాలనావిధానాలు నేటికీ అనుసరణీయాలే

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా కొనసాగిన శివాజీ మహారాజ్‌ పరిపాలనా విధానాలు నేటి కాలంలోనూ అనుసరణీయాలేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Published : 03 Jun 2023 06:05 IST

ఆయన వ్యక్తిత్వం, జీవితం స్ఫూర్తిదాయకం
ఛత్రపతి 350వ వార్షిక పట్టాభిషేక మహోత్సవంలో  ప్రధాని మోదీ సందేశం

ముంబయి: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా కొనసాగిన శివాజీ మహారాజ్‌ పరిపాలనా విధానాలు నేటి కాలంలోనూ అనుసరణీయాలేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఛత్రపతి కృషి, వ్యక్తిత్వం, జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. మరాఠా రాజు పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లయిన సందర్భంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ కోటపై శుక్రవారం భారీ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ వీడియో సందేశాన్ని పంపించారు. ఛత్రపతి శివాజీ అద్భుతమైన ధైర్యసాహసాలు, వ్యూహ నైపుణ్యాలు, దార్శనికత దేశ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పించేలా చేశాయన్నారు. ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌’ అనే తమ ప్రభుత్వ నినాదానికి శివాజీ మహారాజ్‌ ఆదర్శాలే ఆధారమని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం, మహిళాసాధికారత, సామాన్యుల చెంతకు పాలనను తీసుకురావడం, జలవనరుల నిర్వహణ విధానాలు శివాజీ ప్రత్యేకతలుగా ప్రధాని మోదీ వివరించారు. ప్రజలను సన్నద్ధం చేయడంతో పాటు వారిలో విశ్వాసాన్ని నింపిన తీరు, జాతీయ భావనను పాదుకొల్పడం వంటి చర్యల ద్వారా తర్వాత కాలంలో స్వరాజ్య సాధన ఉద్యమానికి అవసరమైన స్ఫూర్తిని భావితరాలకు శివాజీ అందించారని కొనియాడారు. విదేశీ దాడుల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా సాంస్కృతిక పరిరక్షణకూ పాటుపడ్డారని తెలిపారు.


అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రధానిని ఆహ్వానిస్తాం

అయోధ్య: శ్రీరాముని నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు అయోధ్య రామాలయ కమిటీ వెల్లడించింది. ఇటీవల జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. ఆలయ మొదటి అంతస్తు అక్టోబరు కల్లా సిద్ధమవుతుందన్నారు. డిసెంబరు, జనవరి 26 తేదీల మధ్య తనకు అనువైన రోజును కేటాయించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తామని చంపత్‌ రాయ్‌ తెలిపారు. శ్రీరాముని వ్రిగహ ప్రతిష్ఠాపన తర్వాత ఆలయాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని, అప్పటి నుంచి పూజలు, దర్శనాలు చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు