రాజద్రోహం కేసును కొట్టేయండి

మూడున్నరేళ్ల కిందట తాను చేసిన అభ్యంతరకర ప్రసంగంపై క్రిమినల్‌ కేసు పెట్టిన పోలీసులు.. అనుబంధ చార్జీషీటు ద్వారా రాజద్రోహం, విద్వేష ప్రసంగం అనే అభియోగాలను కొత్తగా చొప్పించారని, వాటిని రద్దు చేయాలని షర్జీల్‌ ఇమామ్‌ అనే విద్యార్థి ఉద్యమకారుడు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Published : 03 Jun 2023 06:01 IST

దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన షర్జీల్‌ ఇమామ్‌
పోలీసుల అభిప్రాయాన్ని కోరిన న్యాయస్థానం 

దిల్లీ: మూడున్నరేళ్ల కిందట తాను చేసిన అభ్యంతరకర ప్రసంగంపై క్రిమినల్‌ కేసు పెట్టిన పోలీసులు.. అనుబంధ చార్జీషీటు ద్వారా రాజద్రోహం, విద్వేష ప్రసంగం అనే అభియోగాలను కొత్తగా చొప్పించారని, వాటిని రద్దు చేయాలని షర్జీల్‌ ఇమామ్‌ అనే విద్యార్థి ఉద్యమకారుడు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై దిల్లీ పోలీసుల అభిప్రాయాన్ని హైకోర్టు శుక్రవారం కోరింది. తదుపరి విచారణను అక్టోబరు 18కి వాయిదావేసింది. వలస పాలకులు తెచ్చిన రాజద్రోహ చట్టం ఆవశ్యకతను సముచిత ప్రభుత్వ వేదిక పునఃపరిశీలించాలనీ, అంతవరకు ఆ చట్టం కింద కేంద్ర, రాష్ట్రాలు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు, దర్యాప్తు, కఠిన చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు 2022 మే 11న స్టే ఇచ్చింది. షర్జిల్‌ ఇమామ్‌ తరఫు న్యాయవాది ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో విద్వేష ప్రసంగాలిచ్చారంటూ ఇమామ్‌పై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ దాఖలై ఉందనీ, దాంట్లో అదనంగా రాజద్రోహ ఆరోపణను చొప్పించడాన్ని తాము సవాలు చేస్తున్నామని హైకోర్టుకు తెలిపారు. సీఏఏ వ్యతిరేక అల్లర్లకు సంబంధించి ఇమామ్‌పై అనేక కేసులు పెట్టారు. ఒకే ఘటనను తీసుకుని తనపై పలు కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇమామ్‌ వాదిస్తున్నారు. ప్రస్తుత ఎఫ్‌ఐఆర్‌పై ట్రయల్‌ కోర్టు ఇమామ్‌కు 2022 సెప్టెంబరు 30న బెయిలు ఇచ్చినా, ఇతర కేసుల వల్ల అతడు ఇప్పటికీ జైలులోనే ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని