సంక్షిప్త వార్తలు (7)

తీర్పు ఇవ్వకుండా తనపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయని రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో 2010లో తీర్పు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ చెప్పారు.

Updated : 04 Jun 2023 06:18 IST

రామజన్మభూమిపై తీర్పు ఇవ్వొద్దని నాపై తీవ్ర ఒత్తిడి

అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి

మేరఠ్‌: తీర్పు ఇవ్వకుండా తనపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయని రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో 2010లో తీర్పు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ చెప్పారు. అప్పుడు తాము తీర్పు ఇచ్చి ఉండకపోతే, మరో 200 ఏళ్ల వరకూ ఆ కేసు తేలేది కాదన్నారు. 2020 ఏప్రిల్‌ 23న ఆయన పదవీవిరమణ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘‘తీర్పు ఇచ్చిన తర్వాత నేను ఊరట పొందాను. తీర్పు వాయిదా వేయాలని ఇంటా బయటా నా మీద తీవ్రంగా ఒత్తిడి వచ్చింది. మా కుటుంబసభ్యులు, బంధువులు కూడా ఎలాగోలా కాలక్షేపం చేసి తీర్పు ఇవ్వకుండా ఉండాలని చెప్పారు’’ అని ఆయన అన్నారు.


కాంగ్రెస్‌ మాజీ సైనికుల విభాగం చీఫ్‌ కన్నుమూత

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ మాజీ సైనికుల విభాగం జాతీయ ఛైర్మన్‌ మేజర్‌ (రిటైర్డ్‌) వేద్‌ ప్రకాశ్‌ (85) శనివారం కన్నుమూశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిత్యం జరిగే మీడియా సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే వేద్‌ ప్రకాశ్‌కు పార్టీకి విధేయుడైన నాయకుడిగా పేరుంది. శుక్రవారమే ఆయన తన పుట్టినరోజు చేసుకోవడం గమనార్హం. కుమారుడైన విపుల్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మధ్యాహ్నం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోనే నాన్న ఉన్నట్టుండి కింద పడిపోయారు. తలకు గాయం కాగా, ఆసుపత్రికి తరలించాం. అయినా ప్రయోజనం లేకపోయింది’’ అని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీతో దశాబ్దాల అనుబంధమున్న మేజర్‌ వేద్‌ ప్రకాశ్‌ మరణం తనను కలచివేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్‌ సైతం మేజర్‌ వేద్‌ ప్రకాశ్‌ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.


కన్నడిగులు సురక్షితం

33 మందికి స్వల్ప గాయాలు

ఈనాడు, బెంగళూరు: ఒడిశాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనలో కర్ణాటకకు చెందిన 110 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ, నివారణ సంస్థ కమిషనర్‌ మనోజ్‌ రాజన్‌ శనివారం వెల్లడించారు. చిక్కమగళూరు జిల్లా నుంచి ఝార్ఖండ్‌ వెళ్తున్న వీరిలో 33 మందికి గాయాలయ్యాయని తెలిపారు. జనరల్‌ బోగీల్లో ప్రయాణిస్తున్న వారి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. గాయపడిన కర్ణాటక ప్రయాణికులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం రాత్రి ఆదేశించారు. రైళ్లు స్తంభించిపోవడంతో కోల్‌కతాలోని హావ్‌డాలో చిక్కుకున్న 32 మంది వాలీబాల్‌ క్రీడాకారులను ప్రత్యేక విమానం ద్వారా రాష్ట్రానికి తరలించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది.


ఇప్పటివరకూ తమిళులెవరినీ గుర్తించలేదు

మృతులపై సీఎం స్టాలిన్‌కు ఉదయనిధి స్పష్టత

చెన్నై, న్యూస్‌టుడే: రైలుప్రమాద మృతులు, క్షతగాత్రుల్లో తమిళనాడుకు చెందినవారిని శనివారం గుర్తించలేదని రాష్ట్ర యువజన సంక్షేమశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు. రైలు ప్రమాద మృతుల్లో రాష్ట్రానికి చెందిన 35మంది ఉన్నట్టు శనివారం ప్రచారం జరిగింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం స్పందించకున్నా... మృతులు, క్షతగాత్రులకు సాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒడిశా వెళ్లిన రాష్ట్ర బృందంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ సచివాలయం నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. తమ బృందం బాలేశ్వర్‌, కటక్‌లోని ఎస్వీపీ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న బాధితుల వివరాలు సేకరించినట్టు ఉదయనిధి తెలిపారు.


కోర్టు ధిక్కార నేరానికి ఎన్‌ఆర్‌ఐకి ఆరు నెలల జైలుశిక్ష

దిల్లీ: అమెరికాలో 2004 నుంచి నివసిస్తున్న ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు ఆరు నెలల జైలుశిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అతని కుమారుడిని భారత్‌కు తీసుకురావడంలో విఫలమైనందుకు కోర్టు ధిక్కారం కింద పరిగణించింది. సదరు వ్యక్తికి సర్వోన్నత న్యాయస్థానంపై తక్కువ గౌరవం ఉన్నట్లు అర్థమవుతోందని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. 2007లో నిందితుడు వివాహం చేసుకున్న మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. మే 2022లో కోర్టు జారీ చేసిన ఆర్డర్‌లో నమోదు చేసిన హామీని అతను ఉల్లంఘించాడని పేర్కొంది. అప్పటి ఒప్పందం ప్రకారం.. అజ్‌మేర్‌లో ఆరో తరగతి చదువుతున్న బాలుడు పదో తరగతి వరకు చదివిన తరువాత తన తండ్రి నివాసం ఉంటున్న అమెరికాకు తరలివెళతాడు. అప్పటి వరకు బాలుడు ఏటా జూన్‌లో యూ.ఎస్‌., కెనడా సందర్శించడానికి అంగీకరించారు. గతేడాది జూన్‌ 7న అజ్‌మేర్‌ నుంచి తన కుమారుడిని అమెరికా తీసుకెళ్లిన ఆ వ్యక్తి.. తిరిగి మహిళకు అప్పగించడంలో విఫలమైనట్లు ధర్మాసనం తెలిపింది. దీంతో అతనికి ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని, దాన్ని బాలుడి సంక్షేమానికి వినియోగించేలా తల్లికి అప్పగించాలని ఆదేశించింది. శిక్షా కాలంలో భారత్‌లో అతని రక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది.


42 ఏళ్ల క్రితం కేసులో..90 ఏళ్ల వృద్ధుడికి జీవితఖైదు

ఫిరోజాబాద్‌: తొంభైఏళ్ల వృద్ధుడికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ కోర్టు యావజ్జీవఖైదు విధించింది. 42 ఏళ్ల క్రితం షికోబాద్‌లో 10 మంది దళితులను కాల్చి చంపిన కేసులో గంగా దయాల్‌ నిందితుడు. ఈ కేసులో మొత్తం 10 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇందులో మిగతా తొమ్మిది మంది విచారణ సమయంలోనే చనిపోయారు. దయాల్‌కు జైలుశిక్షతో పాటు న్యాయస్థానం రూ.55 వేల జరిమానా కూడా విధించింది.


వ్యాధి కన్నా చికిత్స బాధాకరంగా ఉంది

భారత శిక్షా స్మృతి(ఐపీసీ) నుంచి సెక్షన్‌ 124ఎ(దేశద్రోహం)ను తొలగించాలని ఓ వైపు పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తుంటే, లా కమిషన్‌ మాత్రం ఈ కేసుల్లో జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం శోచనీయం. వైద్యుడు సిఫార్సు చేసిన చికిత్స.. వ్యాధి కన్నా బాధాకరంగా ఉన్నట్లుగా ఇది ఉంది.

పి.చిదంబరం


రైల్వే అధికారులనూ బాధ్యుల్ని చేయొద్దు

రైళ్ల ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఈ సంక్షోభ సమయంలో ఆయన విధులు నిర్వర్తించాల్సిన అవసరం చాలా ఉందని కొందరు చెబుతున్నారు. అలాగైతే సంబంధిత రైల్వే అధికారులను  కూడా బాధ్యుల్ని చేసి విధుల నుంచి తప్పించకూడదు కదా.

ప్రియాంకా చతుర్వేది


మన జీవన విధానం మారితేనే పుడమి భద్రం

మన భూగ్రహం ప్రమాదంలో ఉంది. దాన్ని కాపాడుకోవాలంటే మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. విద్యతో మార్పు మొదలవుతుంది. వాతావరణ మార్పులు సహా పుడమికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి సుస్థిరాభివృద్ధి సాధించడానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించేలా విద్యా విధానాలను తీర్చిదిద్దాలి. ఈ దిశగా అన్ని దేశాలూ కృషి చేయాలి.

యునెస్కో


అమెరికాలో తగ్గిన నిరుద్యోగ రేటు

అమెరికాలో గల 16 నెలలుగా నిరుద్యోగ రేటు 4 శాతం కన్నా తక్కువగా ఉంది. చివరిగా 1960ల్లో మాత్రమే దీర్ఘకాలం పాటు నిరుద్యోగ రేటు అత్యల్పంగా నమోదైంది. మా ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక ప్రణాళిక సత్ఫలితాలిస్తోందనడానికి ఇదే నిదర్శనం.

బైడెన్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని