Odisha Train Accident: మృత్యు సిగ్నల్‌

రెప్పపాటు నిర్లక్ష్యం ఎన్నో కనురెప్పల్ని శాశ్వతంగా మూయించింది. గురితప్పిన దారిదీపం వందలకొద్దీ ఇంటి దీపాల్ని ఆర్పేసింది. సిగ్నలింగ్‌ సిబ్బంది అలవిమాలిన నిర్లక్ష్యంతో 288 నిండు ప్రాణాలు బలైపోయాయి.

Updated : 04 Jun 2023 08:26 IST

ఒడిశాలో తీవ్ర ప్రమాదానికి సిగ్నలింగ్‌ సిబ్బంది అలసత్వమే కారణం!
288కి చేరిన మృతుల సంఖ్య
1,175 మందికి గాయాలు
ఘటనాస్థలికి ప్రధాని మోదీ
ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ
మరో రూ.2 లక్షల పరిహారం ప్రకటన
క్షణాల్లో సహాయ హస్తం అందించిన స్థానికులు
స్వచ్ఛందంగా రక్తదానం
ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలు
ఆసుపత్రుల్లో క్షతగాత్రుల ఆర్తనాదాలు

బాలేశ్వర్‌, భువనేశ్వర్‌: రెప్పపాటు నిర్లక్ష్యం ఎన్నో కనురెప్పల్ని శాశ్వతంగా మూయించింది. గురితప్పిన దారిదీపం వందలకొద్దీ ఇంటి దీపాల్ని ఆర్పేసింది. సిగ్నలింగ్‌ సిబ్బంది అలవిమాలిన నిర్లక్ష్యంతో 288 నిండు ప్రాణాలు బలైపోయాయి. 1,175 మందికి గాయాలయ్యాయి. అత్యంత ప్రాధాన్యమున్న సూపర్‌ఫాస్ట్‌ రైలు విషయంలో వారి అలసత్వమే పెను విషాదానికి కారణమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సాంకేతిక వైఫల్యాల కంటే మానవ తప్పిదాలే ఎక్కువశాతం ప్రమాదాలకు కారణమని మరోసారి రుజువైంది. చరిత్రలోనే అరుదైన తప్పిదాల్లో ఒకటిగా నిలిచిపోయే ఘోరాతిఘోర రైలు ప్రమాద తీరుపై శనివారానికి స్పష్టత వచ్చింది. ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద షాలీమార్‌-చెన్నై కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మెయిన్‌లైన్‌లోకి వెళ్లడానికి సిబ్బంది గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి, ఎందువల్లనో వెంటనే వెనక్కి తీసుకున్నారని తేలింది. ఆ రైలు లూప్‌లైన్లోకి వెళ్లి అప్పటికే అక్కడ ఆగిఉన్న గూడ్సురైలును ఢీకొట్టింది. ఆ తీవ్రతకు కోరమాండల్‌లోని కొన్ని బోగీలు ఎగిరి, పక్కనున్న ట్రాకుపై పడ్డాయి. అదే సమయంలో ఆ మార్గంలో దూసుకువస్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలు వాటిని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయిందని తేటతెల్లమైంది.


నలిగిన జీవితాలు

ప్రమాద స్థలంలో కొన్ని బోగీలలో భీతావహ దృశ్యాలు


భారీగా పెరిగిన ప్రాణనష్టం

అత్యంత ఘోర విషాద ఘటనలో మృతుల సంఖ్య 288కి పెరిగింది. యావద్దేశాన్ని ఈ ఘటన కదిలించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లతోపాటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తదితరులు శనివారం ఘటనాస్థలిని సందర్శించారు. ప్రధాని బాలేశ్వర్‌ ఆసుపత్రికి కూడా వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రైల్వే ప్రకటించిన రూ.10 లక్షలకు అదనంగా మరో రూ.2 లక్షల సాయాన్ని ఇస్తామని చెప్పారు. దేశ విదేశాల ప్రముఖులు అనేకమంది సంతాపం తెలిపారు. భారీ శబ్దాలు విని పరుగుపరుగున ఘటనాస్థలానికి చేరుకున్న సమీప ప్రాంత ప్రజలు సహాయ హస్తం అందించిన తీరు, రక్తదానం చేస్తామంటూ వందలమంది ముందుకు రావడం వేనోళ్ల ప్రశంసలు అందుకుంటోంది. రైల్వేలో భద్రత గాలిలో దీపంలానే ఉందంటూ ప్రభుత్వాన్ని విపక్షాలు తప్పుపట్టాయి.

మెయిన్‌లైన్‌ నుంచి ఎలా మారింది?

మెయిన్‌లైన్లో వెళ్లాల్సిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎందువల్ల లూప్‌లైన్లోకి వెళ్లిందనేది తెలియాల్సి ఉంది. భీతావహంగా మారిన ప్రమాద స్థలానికి పెద్దఎత్తున చేరుకున్న రైల్వే, సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ల సిబ్బంది అలుపెరగకుండా సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని తరలించడానికి రెండు హెలికాప్టర్లను కూడా అందుబాటులో ఉంచారు. నేలలో కూరుకుపోయి బాగా దెబ్బతిన్న ఒక రైలుపెట్టె మాత్రం వీరిని బాగా ఇబ్బందిపెట్టింది. పెట్టెల్లో చిక్కుకున్నవారిని, మృతదేహాలను వెలికితీయడానికి గ్యాస్‌కట్టర్లు వినియోగించారు. ఎక్కడ చూసినా మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రదేశం భీతావహంగా, హృదయవిదారకంగా ఉంది. బాలేశ్వర్‌ జిల్లా ఆసుపత్రి ఒక రణక్షేత్రంలా కనిపించింది. అక్కడంతా ఆర్తనాదాలే. వందలమందికి ఒకేసారి చికిత్స అందించాల్సి రావడంతో వరండాలు కూడా కిక్కిరిసిపోయాయి. దాదాపు 2,000 మంది స్థానికులు అక్కడకు చేరుకుని ఎలాంటి సాయం కావాలన్నా అందించారు. అక్కడి శవాగారంలో మృతదేహాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. చాలావాటిని సంబంధీకులు గుర్తించాల్సి ఉంది. ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం కావడంతో మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకోవడమూ కష్టంగా మారింది. కోరమాండల్‌లో 1,257 మంది, బెంగళూరు-హావ్‌డా రైల్లో 1,039 మంది రిజర్వేషన్‌ పొందిన ప్రయాణికులు ఉన్నారు. కోరమాండల్‌లోని సాధారణ బోగీల్లో ఎక్కువమంది తమిళనాడు, కేరళ వలస కార్మికులే.

దేశంలో నాలుగో అతిపెద్ద ప్రమాదం ఇదే

అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఈ రైలు ప్రమాదం దేశంలో నాలుగో అతిపెద్దదని తెలుస్తోంది. 1981 జూన్‌ 6న బిహార్‌లో బాగ్‌మతి నదిలో రైలు పడిపోయిన ఘటనలో 750 మందికిపైగా చనిపోయారు. అత్యంత దారుణ ప్రమాదాల్లో అది మొదటిది. తాజా ప్రమాద తీవ్రతకు రైలుపట్టాలు సయితం తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోరమాండల్‌లో 21 పెట్టెలు పట్టాలు తప్పగా వాటిలో మూడు పక్కనున్న పట్టాలపై పడ్డాయి. సమీపంలో ఎక్కడా హాల్టు లేకపోవడంతో రెండు రైళ్లూ పూర్తివేగంతో వెళ్తుండగా ఘోరం జరిగిపోయింది. గత మూడు దశాబ్దాల్లో ఇంతటి ఘోరమైన రైలు ప్రమాదం ఎక్కడా జరగలేదని చెబుతున్నారు. దీనికి కారణం.. సిబ్బంది తప్పిదమా, లేక సిగ్నల్‌ వైఫల్యమా అనేది దర్యాప్తులో తేలనుంది. కోరమాండల్‌కు మొదట మెయిన్‌లైన్‌ సిగ్నల్‌ ఇచ్చి, వెంటనే వెనక్కి తీసుకున్నారనీ, అప్పుడది లూప్‌లైన్లోకి వెళ్లి గూడ్సురైలును ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తు నివేదిక పేర్కొంటోంది. ఆ లైన్లో ఉన్న గూడ్సురైలు డ్రైవరు (లోకోపైలట్‌), గార్డు సురక్షితంగా బయటపడ్డారు. గాయాలపాలైన మిగతా రెండు సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల డ్రైవర్లు, గార్డులు చికిత్స పొందుతున్నారు. రైళ్లు ఢీకొనకుండా నివారించడంలో కీలకంగా నిలిచే ‘కవచ్‌’ వ్యవస్థ.. ఈ మార్గంలో ఉండి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని బలంగా వినిపిస్తోంది.

లోకోపైలట్ల తప్పు ఉండకపోవచ్చు: సుధాన్షు

ప్రమాదంలో రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల లోకోపైలట్ల తప్పిదమేమీ ఉండకపోవచ్చని చెన్నైలోని ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) మాజీ జీఎం సుధాన్షు మణి అభిప్రాయపడ్డారు. తొలిరైలు పట్టాలు తప్పడం, అదే సమయంలో పక్కనున్న మార్గంపై మరో రైలు వేగంగా దూసుకువస్తుండడం దురదృష్టకరమన్నారు. ఒక రైలే ప్రమాదానికి గురైతే దానిలోని ఎల్‌హెచ్‌బీ పెట్టెలు ఇంతలా దెబ్బతినడం గానీ, ఇంతగా ప్రాణనష్టం సంభవించడం గానీ జరిగేవి కాదన్నారు. గ్రీన్‌సిగ్నల్‌ ఉండడం వల్లనే రైళ్లు వేగంగా వెళ్లాయని చెప్పారు.


కుట్ర కోణం లేదు: రైల్వే

ప్రమాదం వెనుక కుట్ర కోణమేమీ లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఘటనపై రైల్వే భద్రత ఆగ్నేయ సర్కిల్‌ కమిషనర్‌ ఎ.ఎం.చౌధరి నేతృత్వంలో విచారణ నిర్వహించనున్నారు. సహాయక చర్యలు ముగిశాయనీ, రైలుమార్గం పునరుద్ధరణపై దృష్టి సారించామని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ తెలిపారు. గాయాలపాలైన 1,175 మందిని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. వీరిలో 793 మందికి స్వల్ప చికిత్సల అనంతరం ఇళ్లకు పంపించారు. మిగిలినవారు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు మినహా అందరి పరిస్థితి నిలకడగా ఉందని ఒడిశా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రక్తదానం చేసేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. ప్రధాన మార్గానికి అంతరాయం కలగడంతో దాదాపు 150 రైళ్లను పూర్తిగానో, పాక్షికంగానో రద్దుచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు