పల్లె జనం.. మరవలేని సాయం

ఒకవైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు.. కళ్లముందే విగతజీవులైన వారు ఎందరో.. పక్కనే శరీర భాగాలు నుజ్జయిన వారి రోదనలు. ఊహించని పరిణామంతో అందరిలోనూ వణుకు.

Published : 04 Jun 2023 03:21 IST

ఈనాడు, అమరావతి: ఒకవైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు.. కళ్లముందే విగతజీవులైన వారు ఎందరో.. పక్కనే శరీర భాగాలు నుజ్జయిన వారి రోదనలు. ఊహించని పరిణామంతో అందరిలోనూ వణుకు. బెర్తుల మీద తెగిపడిన శరీర భాగాలు.. చుట్టూ మృతదేహాలు.. శరీరం సహకరించని పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాల వారు స్పందించి చేయూత ఇచ్చిన తీరు ఎంతో గొప్పదని బాధితులు తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే.. రైల్వే అధికారులు, విపత్తు నిర్వహణ దళంకంటే ముందే వారు పరుగుపరుగున అక్కడకు చేరుకున్నారు. నగరాల్లో మాదిరిగా ఘటనను, బాధితుల ఆక్రందనలను సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తూ కూర్చోలేదు.. కొందరు టార్చ్‌లైట్లు, నిచ్చెనలు, మరికొందరు తాళ్లు.. ఇలా ఎవరికి తోచిందివారు పట్టుకుని వచ్చి బాధితులను రక్షించడానికి పూనుకున్నారు. ఆ పల్లెజనం సాయంతో క్షతగాత్రులు నెమ్మదిగా బయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడినవారు చెప్పిన అనుభవాలివి..

స్థానికులే కాపాడారు: మురళీమోహన్‌ 

నేను, స్నేహితులు కలిసి.. నలుగురం బి-4 బోగీలో ప్రయాణిస్తున్నాం. అప్పుడే భోజనం తిందామని సిద్ధమయ్యా. ఈలోగా పెద్ద కుదుపు వచ్చింది. పెద్ద శబ్దంతో బోగీ దూసుకుపోయినట్లనిపించింది. మేమంతా పడిపోయాం. చచ్చిపోయామనే అనుకున్నాం. వెంటనే అద్దాలు పగలగొట్టాం. ప్రమాదం జరిగాక రైల్వే వాళ్లు రావడం చాలా ఆలస్యమైంది. ఈలోగా పక్కనే ఉన్న గ్రామం వాళ్లు స్పందించి.. నిచ్చెనలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు పట్టుకుని వచ్చారు. వారంతా స్పందించి ఎక్కువమందిని రక్షించగలిగారు. లేదంటే ఎక్కువ ప్రాణనష్టం జరిగేది. నేను, నా స్నేహితులు చాలామందిని బయటకు తెచ్చాం.

బోగీలు చెల్లాచెదురు: వివేక్‌, ఖరగ్‌పుర్‌

ఖరగ్‌పుర్‌ నుంచి రాజమహేంద్రవరానికి ప్రయాణిస్తున్నాం. రైలు 128 కి.మీ. వేగంతో వెళ్తోందని మొబైల్‌లో పక్కనే ఉన్న మా అమ్మకు ఫోన్లో చూపించా.. అంతలోనే పెద్ద కుదుపు వచ్చింది. ఆమె కింద పడిపోయారు. నేను కూడా తుళ్లి కిందపడ్డా. అదే సమయంలో శబ్దాలు వచ్చాయి. చూసేసరికి కొన్ని బోగీలు పట్టాలపై పడిపోయి ఉన్నాయి. తర్వాత చిన్నగా బయటకు వచ్చాం. అదే రైలులో మాతోపాటు మరికొందరు కూడా బి-5 బోగీలో పెళ్లికి వస్తున్నారు. వారిని వెదుకుదామని వెళ్లాం. బోగీ మెట్లు విరిగిపడ్డాయి. అంతా గుంతలా తయారైంది. చాలామంది ఏడుస్తూ దిగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని