20 ఏళ్లలో 3 సార్లు శుక్రవారమే పట్టాలు తప్పిన కోరమాండల్‌

ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటన దేశం యావత్తును కుదిపేసింది. దేశంలో జరిగిన అతిపెద్ద రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది.

Published : 04 Jun 2023 06:21 IST

బాలేశ్వర్‌: ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటన దేశం యావత్తును కుదిపేసింది. దేశంలో జరిగిన అతిపెద్ద రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. శుక్రవారం నాటి ప్రమాదంతో కలిపి ఇదే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గడిచిన 20 ఏళ్లలో మూడుసార్లు పట్టాలు తప్పింది. హావ్‌డా - చెన్నై మధ్య నడిచే ఈ రైలు.. మూడుసార్లూ చెన్నై వెళ్లే క్రమంలోనే ప్రమాదాలు జరిగాయి. ఆ మూడు సందర్భాలూ శుక్రవారం రోజే నమోదుకావడం యాదృచ్ఛికం. ఇందులో రెండుసార్లు ఒడిశా, ఒకసారి ఏపీ పరిధిలో అలా జరిగింది.

* 2002 మార్చి 15న చెన్నై వెళుతున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఎవరూ మరణించనప్పటికీ.. 100 మంది వరకు గాయపడ్డారు. నెల్లూరు వద్ద రైలు పట్టాలు సరిగా లేకపోవడం ప్రమాదానికి కారణమైంది.

* 2009 ఫిబ్రవరి 13న ఒడిశాలోని జయ్‌పుర్‌ జిల్లాలో ఇదే రైలు 13 బోగీలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. 16 మంది మృతిచెందగా.. 200 మంది గాయపడ్డారు.

*  తాజాగా.. జూన్‌ 2న ఒడిశాలోని బహానగా బజార్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో కోరమాండల్‌ ఘోర ప్రమాదానికి గురైంది. మృతులు, క్షతగాత్రులు వందల సంఖ్యలో తేలారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని