రంగంలోకి భారత సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌

రైలు ప్రమాద సంఘటన తెలియగానే విపత్తు నిర్వహణ సిబ్బందితోపాటు వైద్య బృందాలు, అంబులెన్సులు సహా ఇతర విభాగాలు వేగంగా స్పందించాయి.

Published : 04 Jun 2023 04:16 IST

కోల్‌కతా: రైలు ప్రమాద సంఘటన తెలియగానే విపత్తు నిర్వహణ సిబ్బందితోపాటు వైద్య బృందాలు, అంబులెన్సులు సహా ఇతర విభాగాలు వేగంగా స్పందించాయి. భారత సైన్యం, వాయుసేన బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. క్షతగాత్రులను వీలైనంత తొందరగా బయటకు తీయడంతోపాటు వారిని సమీప ఆస్పత్రులకు తరలించాయి. శనివారం మధ్యాహ్నానికి సహాయక చర్యలు దాదాపు పూర్తయినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌ జరిగిన తీరును పరిశీలిస్తే.. ప్రమాద సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు రంగంలోకి దిగాయి. రాత్రి 8.30 గంటలకల్లా బాలేశ్వర్‌లోని తొలి బృందం ప్రమాదస్థలికి చేరుకుంది. అనంతరం కటక్‌, కోల్‌కతా నుంచి మరిన్ని బృందాలు వచ్చాయి. మొత్తం 300 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొమ్మిది బృందాలుగా ఏర్పడి క్షతగాత్రులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి వారిని తొలుత కాపాడారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ జాగిలాలు, మహిళా సిబ్బందితోపాటు వైద్య బృందాలు ఇందులో పాలుపంచుకున్నాయి. భారీ క్రేన్లు, గ్యాస్‌, ప్లాస్మా కట్టింగ్‌ యంత్రాలతో రైలు కోచ్‌లను విడదీస్తూ అందులో ఇరుక్కుపోయిన వారిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయటకు తీసేందుకు శ్రమించాయి. అనంతరం లిఫ్టింగ్‌ ప్యాడ్‌లతో వారిని సమీప ప్రాంతానికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స నిర్వహించాయి. ఘటన తీవ్రమైనది కావడంతో ఇతర విభాగాలూ వేగంగా స్పందించాయి. 200 అంబులెన్సులు, 50 బస్సులు ఘటనా స్థలానికి చేరుకోవడంతోపాటు 45 మొబైల్‌ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1200 మంది రెస్య్కూ సిబ్బంది సాయంతో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. కటక్‌నుంచి 25 వైద్య బృందాలతోపాటు మరో 50 మంది వైద్యులు ఇందులో పాల్గొన్నారు.  తీవ్ర గాయాలపాలైన వారికోసం వైద్య బృందాలతో కూడిన రెండు ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్లను భారత వాయుసేన రంగంలోకి దించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని