బాధ్యులెంతటి వారైనా వదలం: మోదీ

మూడు రైళ్లు ఢీకొని భీతావహంగా మారిన బాలేశ్వర్‌ జిల్లా బహానగా బజార్‌లోని ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ శనివారం పరిశీలించారు.

Published : 04 Jun 2023 04:16 IST

బాలేశ్వర్‌: మూడు రైళ్లు ఢీకొని భీతావహంగా మారిన బాలేశ్వర్‌ జిల్లా బహానగా బజార్‌లోని ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ శనివారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా తిలకించారు. బాలేశ్వర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. క్షతగాత్రులకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ....‘గాయపడిన వారికి అత్యున్నత వైద్యం అందిస్తామ’ని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధ్యులు ఎంతటి వారైనప్పటికీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ‘ఘోర దుర్ఘటన మిగిల్చిన విషాదాన్ని వ్యక్తపరచడానికి మాటలు రావడంలేదు. ఈ పరిస్థితిని అధిగమించే స్థైర్యాన్ని ఆ భగవంతుడు మనకు ప్రసాదించాలి’ అని మోదీ పేర్కొన్నారు. రైలు ప్రమాద బాధితులకు అన్ని విధాలుగా సహకారాలు అందించిన స్థానిక ప్రజలకు, సహాయక బృందాలకు  కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ వెంట రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరును వారు ప్రధానికి వివరించారు. ఒడిశా విపత్తు నిర్వహణ శాఖ మంత్రి ప్రమీలా మల్లిక్‌, స్థానిక పోలీస్‌ ఉన్నతాధికారులతోనూ మోదీ మాట్లాడారు. బహానగా బజార్‌కు బయలుదేరటానికి ముందు ఆయన అధ్యక్షతన దిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని