Indian Railway Accidents: భారతీయ రైల్వేలో మహా విషాదాలివీ..
మన దేశంలో రైల్వే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 170 ఏళ్లు అయ్యింది. ప్రగతిపథంలో దూసుకెళుతూ కోట్ల మంది ప్రయాణికులకు కీలక రవాణా మార్గంగా నిలిచింది.
దిల్లీ: మన దేశంలో రైల్వే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 170 ఏళ్లు అయ్యింది. ప్రగతిపథంలో దూసుకెళుతూ కోట్ల మంది ప్రయాణికులకు కీలక రవాణా మార్గంగా నిలిచింది. ఈ క్రమంలో మానవ తప్పిదాలు, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పలు దుర్ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలో మరణాల సంఖ్యపరంగా తీవ్ర విషాదాన్ని నింపిన రైలు ప్రమాదాల్లో కొన్ని..
1981 జూన్ 6 : 750 మంది
బిహార్‌లో జరిగిన ఈ ప్రమాదం భారత రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనదిగా నిలిచింది. నాడు మాన్సీ నుంచి సహర్సాకు వెళుతున్న ప్యాసింజర్ రైలు.. భాగమతి నది దాటుతుండగా.. ఏడు బోగీలు పట్టాలు తప్పి వంతెన పైనుంచి నదిలో పడిపోయాయి. ఆ సమయంలో రైలులో సుమారు వెయ్యి మందికిపైగా ప్రయాణికులు ఉండగా.. అందులో దాదాపు 750 మంది నదిలో కొట్టుకుపోయినట్లు అంచనా. ఐదు రోజుల సహాయక చర్యల అనంతరం 235 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.
1995 ఆగస్టు 20 : 350
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు సమీపంలోని ఫిరోజాబాద్‌లో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్- కాళింది ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొని ప్రయాణికులు ప్రాణాలను బలితీసుకున్నాయి.
1999 ఆగస్టు 2 : 285
పశ్చిమ బెంగాల్‌లోని గైసాల్ వద్ద అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలును బ్రహ్మపుత్ర మెయిల్ ఢీకొట్టి, పెను విషాదాన్ని మిగిల్చింది.
1998 నవంబరు 26 : 212
పంజాబ్‌లోని ఖన్నాలో ఈ దుర్ఘటన జరిగింది. నాడు కాళింది ఎక్స్‌ప్రెస్‌ను జమ్మూతావి-సియాల్దా ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది.
2016 నవంబరు 20 : 152
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్ సమీపంలోని పుఖరాయన్ వద్ద ఇందౌర్-రాజేంద్రనగర్ రైలు పట్టాలు తప్పింది.
2010 మే 28 : 148
ముంబయి వెళుతున్న జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్ వద్ద పట్టాలు తప్పింది. ఆ తర్వాత దాన్ని గూడ్స్ రైలు ఢీ కొట్టింది.
2002 సెప్టెంబరు 9 : 140
హావ్‌డా రాజధాని ఎక్స్‌ప్రెస్ బిహార్‌లోని రఫీగంజ్ వద్ద వంతెనపై పట్టాలు తప్పింది. ఇది ఉగ్రవాదుల దుశ్చర్య అని ఆరోపణలు వచ్చాయి.
1964 డిసెంబరు 23 : 126
పంబన్-ధనుష్కోటి ప్యాసింజర్ రైలు.. రామేశ్వరం తుపానులో కొట్టుకుపోయింది.
2005 అక్టోబరు 29 : 114
ఉమ్మడి ఏపీలోని వలిగొండ వద్ద వరదల కారణంగా ఒక వంతెన దెబ్బతింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ ప్రమాదానికి లోనైంది.
1988 జులై 8 : 105
కేరళలోని పెరుమాన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ బోగీలు.. వంతెనపై పట్టాలు తప్పి, అష్టముడి సరస్సులో పడిపోయాయి.
2017 జనవరి 21 : 41 మంది
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో రైలులో 600 మంది ప్రయాణికులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.