విపత్తు వేళ పోటెత్తిన మానవత
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెనువిషాదాన్ని నింపగా.. ఈ విపత్కర పరిస్థితుల్లో స్థానికులు చూపిన మానవత ప్రశంసలు అందుకుంటోంది.
రక్తదానానికి స్వచ్ఛందంగా కదిలొచ్చిన యువత
బాలేశ్వర్, హావ్‌డా: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెనువిషాదాన్ని నింపగా.. ఈ విపత్కర పరిస్థితుల్లో స్థానికులు చూపిన మానవత ప్రశంసలు అందుకుంటోంది. శుక్రవారం సాయంత్రం చీకటి పడ్డాక జరిగిన ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు వందల సంఖ్యలో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్న స్థానికులు బోగీల్లో చిక్కుకున్నవారిని బయటకు తీశారు. బాలేశ్వర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితోపాటు పలు సమీప ఆసుపత్రుల్లో వందల సంఖ్యలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రక్తదానం చేసి కాపాడేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వందల సంఖ్యలో యువకులు బాలేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి మరీ రక్తమిచ్చారు. చుట్టుపక్కల నివసించే సాధారణ కుటుంబాలకు చెందిన వీరంతా ఏ పిలుపూ లేకుండానే వచ్చి మానవత్వాన్ని చాటుకోవడం చూసి పలువురి కళ్లు చెమ్మగిల్లాయి.
* ‘‘సాయంత్రం 7.00 గంటల ప్రాంతంలో నేను, కొంతమంది మిత్రులం రైల్వేట్రాక్‌కు సమీపంలోని టీస్టాల్ వద్ద ఉన్నాం. ఉన్నపళంగా పెద్దశబ్దం, జనం ఏడుపులు వినిపించాయి. అందరం పరుగున వెళ్లాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు ప్రారంభించాం. పోలీసులకు, రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాం’’ అని ప్రమాద సమయంలో క్షణాల్లో స్పందించిన స్థానికుల్లో ఒకడైన రణజిత్ గిరి తెలిపాడు. 60 ఏళ్ల అశోక్ బెహరా మాట్లాడుతూ.. ‘‘నేనూ రక్తమిద్దామనే వచ్చా. వయసురీత్యా నా రక్తం తీసుకోలేదు. దీంతో నా కుమారులు, బంధువులకు ఫోను చేసి రక్తమిచ్చేందుకు పిలిచా’’ అని తెలిపారు. చాలామంది క్షతగాత్రులు తమ కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు అశోక్ బెహరా ఫోను సాయం చేసి సహకరించారు. తల్లిదండ్రుల జాడ తెలియని ఇద్దరు వేర్వేరు పిల్లలు ఆయన సంరక్షణలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.