ఒళ్లంతా గాయాలు.. కళ్లల్లో ప్రాణాలు
ఒకరో ఇద్దరో కాదు.. కాళ్లూ, చేతులు పూర్తిగా విరిగిపోయినవారు కొందరు.. తలలు పగిలినవారు మరికొందరు.. ముఖమంతా ఛిద్రమైపోయి ఇంకొందరు... ఇప్పటికీ స్పృహలోకి రాని వారు ఎందరో.. ఎటు చూసినా క్షతగ్రాతుల ఆర్తనాదాలు, హాహాకారాలు.. ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడినవారితో నిండిపోయిన కటక్ ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆసుపత్రిలో దృశ్యమిదీ.. ‘ఈనాడు’ ప్రతినిధి శనివారం రాత్రి ఆ ఆసుపత్రిని సందర్శించి, బాధితులతో మాట్లాడినప్పుడు వారు కన్నీటి సంద్రమయ్యారు.
దయనీయస్థితిలో క్షతగాత్రులు
మాట్లాడే శక్తి లేక వివరాలు చెప్పలేకపోతున్న దైన్యం
ఆసుపత్రుల్లో పడకలు చాలక నేలమీదా వైద్యం
ఒడిశాలోని కటక్ ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆసుపత్రి నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
ఒకరో ఇద్దరో కాదు.. కాళ్లూ, చేతులు పూర్తిగా విరిగిపోయినవారు కొందరు.. తలలు పగిలినవారు మరికొందరు.. ముఖమంతా ఛిద్రమైపోయి ఇంకొందరు... ఇప్పటికీ స్పృహలోకి రాని వారు ఎందరో.. ఎటు చూసినా క్షతగ్రాతుల ఆర్తనాదాలు, హాహాకారాలు.. ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడినవారితో నిండిపోయిన కటక్ ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆసుపత్రిలో దృశ్యమిదీ.. ‘ఈనాడు’ ప్రతినిధి శనివారం రాత్రి ఆ ఆసుపత్రిని సందర్శించి, బాధితులతో మాట్లాడినప్పుడు వారు కన్నీటి సంద్రమయ్యారు.
మాట్లాడలేని స్థితిలో క్షతగాత్రులు
రైలు ప్రమాదంలో గాయపడినవారు చాలా మంది మాట్లాడలేకపోతున్నారు. పడక పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ తమ గురించి కుటుంబసభ్యులకు తెలియజేయలేక.. అయినవారు దగ్గరలేక వారు అల్లాడిపోతున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. వీరిలో కొందరు ఆసుపత్రి వార్డుల్లో ఉండగా.. లోపల పడకలు ఖాళీ లేక మరికొందరు నేలపైనే జీవచ్ఛవాల్లా పడి ఉన్నారు. ప్రమాదానికి గురైన తర్వాత చాలా మంది స్పృహ కోల్పోయారు. స్పృహలోకి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నారు. నిలువెల్లా గాయాలపాలైవారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. మరోవైపు రైలు ప్రయాణికుల బంధువులు ఆసుపత్రులకు వచ్చి.. తమవారు అక్కడున్నారేమోనని వెతుకులాడుతూ కనిపించారు. ప్రమాద బాధితుల్లో చాలామంది స్పృహలో లేకపోవటంతో ఆసుపత్రి సిబ్బందే అన్నీ అయి సేవలందిస్తున్నారు. అయితే వారెవరో తెలియకపోవడంతో కుటుంబసభ్యులకో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకో సమాచారం అందించలేని పరిస్థితి. జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నవారు ఎక్కువ మంది గాయపడ్డారు. వారి వివరాలు రైల్వేశాఖ దగ్గర కూడా అందుబాటులో ఉండవు కాబట్టి క్షతగాత్రులు ఎవరనేది తెలియడం లేదు.
కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కోచోట..
ఒడిశాకు చెందిన నీలాంబర్ పాత్రో కుటుంబం బాలేశ్వర్‌లో కోరమాండల్ ఎక్కిన అరగంటలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆయన కుటుంబమంతా చెల్లాచెదురైపోయింది. నీలంబర్ పాత్రో భార్య, చిన్న కుమారుడు ఒకచోట, పాత్రో, ఆయన పెద్ద కుమారుడు మరోచోట చిక్కుకుపోయారు. తీవ్ర గాయాలపాలైన ఈ కుటుంబంలో ఇద్దరు బాలేశ్వర్‌లో, మరో ఇద్దరు కటక్ ఎస్‌సీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరి క్షేమ సమాచారం మరొకరికి తెలియక వేదన చెందుతున్నారు. తమ కుటుంబసభ్యులు ఎక్కడున్నారో, అసలు బతికున్నారో లేదో తెలియనివారు పదుల సంఖ్యలో ఉన్నారు.
మనీష్‌కుమార్‌ది బిహార్. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. చేతులు విరిగిపోయాయి. కాళ్లు కదపలేకపోతున్నారు. ముఖమంతా గాయాలే. ఒంట్లో శక్తినంతా కూడదీసుకుంటే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేనంత బలహీనపడ్డారు. శరీరంపై బట్టలైనా సరిగ్గా కప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన గురించి ఇప్పటి వరకు కుటుంబసభ్యులకు తెలియదు. శుక్రవారం రాత్రి నుంచి కటక్‌లోని ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆసుపత్రి ప్రాంగణంలో కటికనేలపైనే చికిత్స పొందుతూ నరకయాతన అనుభవిస్తున్నారు.
అబ్దుల్ రజాక్‌ది పశ్చిమబెంగాల్. బెంగళూరు- హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని రిజర్వేషన్ బోగీలో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి స్పృహలోకి వచ్చాక కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు ఇప్పటికీ కటక్ చేరుకోలేదు. ఈలోగా తనకు సహాయం అందించేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ చిత్రంలోని బాలుడిది ఒడిశా. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో కుటుంబంతో ప్రయాణిస్తూ ప్రమాదం బారిన పడ్డారు. బాలుడి తండ్రి, తల్లి, సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు, అతని తండ్రి కటక్‌లోని ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. బాలుడి తల్లి, సోదరుడు బాలేశ్వర్‌లోని ఆసుపత్రిలో ఉన్నారు. ఒకరి క్షేమ సమాచారం మరొకరికి తెలియక అల్లాడిపోతున్నారు. కుటంబంలోని నలుగురూ నాలుగు వేర్వేరు వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు వందల కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచినట్లయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే నేను స్పృహ కోల్పోయా. చాలాసేపటికి స్పృహ వచ్చింది. అప్పటికే నేనున్న బోగీ ఇంజిన్‌పైకి ఎక్కేసి ఉంది. ఒకవైపు కిటికీకి వేలాడుతున్నాను. చుట్టూ చీకటి. ఏం జరుగుతుందో తెలియలేదు. స్థానికులు వచ్చి కాపాడారు. అప్పటికే నా చొక్కా అంతా రక్తంతో తడిసిపోయింది. నిలబడలేక పాకుతూ కొంతదూరం వచ్చాను. నన్ను కటక్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. నా కుటుంబసభ్యుల సమాచారం శనివారం మధ్యాహ్నానికి తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nitish kumar: మనం బ్రిటీష్ కాలంలో జీవించట్లేదు కదా.. ఆంగ్లంలో డిజిటల్ సైన్బోర్డ్ ఏర్పాటుపై మండిపడ్డ నీతీశ్
-
Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
-
Laddu Auction: బండ్లగూడ జాగీర్ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్