రాష్ట్రీయ రైల్‌ సంరక్షా కోష్‌కు నిధుల కోత

రైల్వే భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒకటి. చేస్తున్నది ఒకటి. రైల్వే భద్రతను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం అయిదేళ్ల కాలం కోసం 2017-18లో రాష్ట్రీయ రైల్‌ సంరక్ష కోష్‌ (ఆర్‌ఆర్‌ఎస్‌కే)ను ఏర్పాటుచేసింది.

Published : 04 Jun 2023 04:49 IST

ఏటా కేటాయించాల్సిన మొత్తం  రూ.20వేల కోట్లు
గత 6 ఏళ్లలో 30% నిధుల తగ్గుదల
రెండేళ్లుగా కేటాయింపులు రూ.11వేల కోట్లకే పరిమితం

ఈనాడు, దిల్లీ: రైల్వే భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒకటి. చేస్తున్నది ఒకటి. రైల్వే భద్రతను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం అయిదేళ్ల కాలం కోసం 2017-18లో రాష్ట్రీయ రైల్‌ సంరక్ష కోష్‌ (ఆర్‌ఆర్‌ఎస్‌కే)ను ఏర్పాటుచేసింది. ఇందుకు ఏటా రూ.20వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. అందులో రూ.15వేల కోట్లు బడ్జెట్‌ నుంచి, రూ.5వేల కోట్లు రైల్వే అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం బాగా పనిచేస్తోందన్న కారణంతో ఈ పథకాన్ని 2022-23 నుంచి మరో అయిదేళ్లకు పొడిగించింది. కీలకమైన భద్రతా పనులకోసం ఆర్థిక వనరులు సమకూర్చి ప్రమాదాలను నివారించడం, అన్‌మేన్డ్‌ లెవెల్‌ క్రాసింగ్స్‌ని తొలగించడం ఈ కోష్‌ ప్రధాన లక్ష్యం. ఈ విధానం అమల్లోకి వచ్చిన ఆరేళ్లలో ముందుగా చెప్పినట్లుగా ఏటా రూ.20వేల కోట్ల చొప్పున రూ.1.20 లక్షల కోట్లు కేటాయించి ఖర్చుచేసి ఉండాలి. కానీ 2017-18 నుంచి 2022-23 మధ్యకాలంలో భద్రత కోసం కేటాయించింది కేవలం రూ.85,175.71 కోట్లేనని పార్లమెంటు స్థాయీసంఘం నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ మొత్తం ప్రభుత్వం చెప్పినదానికంటే దాదాపు 30% తక్కువ. గత రెండేళ్లుగా ఈ కోష్‌కు ఏటా చేయాల్సిన రూ.20వేల కోట్ల కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం రూ.11వేల కోట్లకు తగ్గించినట్లు తేలింది.   ‘‘రాష్ట్రీయ రైల్‌ సంరక్ష కోష్‌ విధానం అమల్లోకి రాకముందు అన్నిరకాల రీప్లేస్‌మెంట్‌ అండ్‌ రెన్యూవల్‌ పనులు డిప్రిసియేషన్‌ రిజర్వ్‌ ఫండ్‌ పేరుతో జరిగేవి. అయితే ఇప్పుడు భద్రతా కారణాలతోచేపట్టే రెన్యూవల్‌, రీప్లేస్‌మెంట్‌, అప్‌గ్రెడేషన్‌ పనులన్నీ రాష్ట్రీయ రైల్‌ సంరక్ష కోష్‌ కింద జరుగుతున్నాయి. 2017-18లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు యేటా రూ.20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పినా 2022-23 బడ్జెట్‌ నాటికి కేటాయింపులు రూ.12వేల కోట్లకు తగ్గిపోయాయి. ఇందులో రూ.10వేల కోట్లు బడ్జెట్‌ నుంచి వస్తే రూ.2వేల కోట్లు రైల్వే అంతర్గత వనరుల ద్వారా సమకూర్చాల్సి ఉంది. అయితే రైల్వే సొంత వనరులనుంచి నిధులు సమకూర్చలేని పరిస్థితిలో ఉంది. అందుకే గత సంవత్సరాల్లో సంరక్షణ కోష్‌లో మిగిలిపోయిన రూ.1,000 కోట్లను 2022-23 బడ్జెట్‌లో ఖర్చుపెట్టింది. దాంతో మొత్తం వ్యయం రూ.11వేల కోట్లకు తగ్గిపోయింది. రైల్వేలో ఇదివరకున్న విభిన్న రకాల భద్రతా నిధులను రద్దుచేసి అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి దీర్ఘదృష్టితో ఏర్పాటుచేసిన రాష్ట్రీయ రైల్‌ సంరక్షణ కోష్‌కు చెప్పిన విధంగా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోతే అది ఏర్పాటుచేసిన ఉద్దేశం విఫలమవుతుంది. కొవిడ్‌ మహమ్మారి నుంచి కోలుకొని రైల్వే మళ్లీ పట్టాలెక్కి గత డిసెంబర్‌ నాటికి 10.4% వార్షిక వృద్ధిరేటు నమోదుచేసిన తరుణంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ రాష్ట్రీయ సురక్ష కోష్‌కు నిధుల కేటాయింపునకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ సంరక్షణ కోష్‌ ప్రధాన లక్ష్యం రైళ్లు ఢీకొట్టడం, పట్టాలు తప్పడం, మనుషులు లేని లెవెల్‌క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించడమే. రైల్వేలో 90% ప్రమాదాలు ఈ మూడింటి ద్వారానే జరుగుతున్నాయి. 2017-18లో ఈ కొత్త విధానం ప్రారంభించిన తర్వాత ప్రమాదాలు భారీగా తగ్గినట్లు రైల్వేశాఖ చెప్పుకుంటున్నప్పటికీ 2020-21లో 22కి పరిమితమైన ప్రమాదాలు 2021-22లో 35కి పెరిగాయి. రైల్వే భద్రతాపరమైన అవసరాలు తీర్చడానికే రాష్ట్రీయ రైల్‌ సంరక్షణ కోష్‌ ఏర్పాటుచేసినట్లు చెప్పినప్పటికీ అందులో కనిపిస్తున్న లోపాలు రైల్వే సామర్థ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తాయి. అందువల్ల ప్రస్తుతం కనిపిస్తున్న లోపాలను సరిదిద్దుకొని రైల్‌ సంరక్షణ కోష్‌ ఏర్పాటుచేసిన ముఖ్య ఉద్దేశం నెరవేరేలా చూడాలి. దీనిపై రైల్వేశాఖ ప్రధానంగా దృష్టిసారించాలి’’ అని 2023-24 బడ్జెట్‌ పద్దులపై ఇటీవల ముగిసిన సమావేశాలకు సమర్పించిన నివేదికలో పార్లమెంటరీ స్థాయీసంఘం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు