కుజ దోషం నిర్ధరణపై హైకోర్టు ఆదేశాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు

అత్యాచారానికి గురైన ఓ మహిళ జాతకంలో మంగళ (కుజ) దోషం ఉందో లేదో తేల్చాలని లఖ్‌నవూ విశ్వవిద్యాలయ జ్యోతిశ్శాస్త్ర విభాగాధిపతికి అలహాబాద్‌ హైకోర్టు జారీ చేసిన అసాధారణ ఆదేశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

Published : 04 Jun 2023 04:49 IST

దిల్లీ: అత్యాచారానికి గురైన ఓ మహిళ జాతకంలో మంగళ (కుజ) దోషం ఉందో లేదో తేల్చాలని లఖ్‌నవూ విశ్వవిద్యాలయ జ్యోతిశ్శాస్త్ర విభాగాధిపతికి అలహాబాద్‌ హైకోర్టు జారీ చేసిన అసాధారణ ఆదేశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఉదంతంపై శనివారం సుమోటో విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం... బెయిలు దరఖాస్తును విచారించేటప్పుడు జ్యోతిషుడి నివేదికను హైకోర్టు కోరడమెందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తి బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా అది మే 23న హైకోర్టు పరిశీలనకు వచ్చింది. బాధితురాలికి మంగళ దోషం ఉంది కాబట్టి తన క్లయింటు ఆమెను పెళ్లిచేసుకోలేడని పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. మహిళకు అలాంటి దోషం లేదని ఆమె న్యాయవాది వాదించారు. ‘‘హిందూ జ్యోతిషం ప్రకారం వధూవరులలో ఒకరికి మంగళ దోషం ఉండి రెండో వారికి లేకపోతే అది అరిష్టం, వారిద్దరూ పెళ్లి చేసుకోకూడదు. దీంతో ఇద్దరి జాతకాలను పరిశీలించి 10 రోజుల్లో సలహా చెప్పాల’’ని హైకోర్టు లఖ్‌నవూ విశ్వవిద్యాలయ జ్యోతిశ్శాస్త్ర విభాగాధిపతిని కోరింది. వాదిప్రతివాదుల సమ్మతితోనే హైకోర్టు సదరు ఆదేశం పంపిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనానికి విన్నవించారు. ఈ వ్యవహారాన్ని చూశారా అని సుప్రీం ధర్మాసనం సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రశ్నించగా... ‘చూశాను, దీనిపై స్టే ఇవ్వండి’ అని ఆయన సూచించారు. ఈ వ్యవహారంలో వ్యక్తిగత గోప్యతా రక్షణతో పాటు పలు అంశాలు ఇమిడి వున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశంపై స్టే ఇస్తూ తదుపరి విచారణను జులై 10కి వాయిదా వేసింది. మరోవైపు అలహాబాద్‌ హైకోర్టు జూన్‌ 26కు కేసు విచారణను వాయిదా వేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు