Odisha train tragedy: వారే స్పందించకుంటే.. ఊహించనంత ప్రాణనష్టం
చుట్టూ చిమ్మచీకటి. మొబైల్ ఫ్లాష్ లైట్లు వేసి చూస్తే కళ్లముందు ఘోర ప్రమాదం. ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సహాయక చర్యలు మొదలుపెట్టారు. అంతలోనే బహానగా ఊరు ఊరంతా అక్కడకు చేరుకుంది. వారంతా యుద్ధభూమిలో సైనికుల్లా వ్యవహరించి బోగీల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకురావటం ప్రారంభించారు.
ఆపత్కాలంలో స్థానికుల పెద్దమనసు
యుద్ధప్రాతిపదికన స్పందించిన బహానగా వాసులు
ద్విచక్ర వాహనాలపైనా బాధితుల తరలింపు
సెల్‌ఫోన్ లైట్లతోనే వందల మందిని కాపాడిన వైనం
ఒడిశాలోని బహానగా నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: దీపక్ రంజన్ బెహరా... విశ్రాంత సైనికోద్యోగి. బహానగా మైదానంలో శుక్రవారం సాయంత్రం తన మిత్ర బృందంతో కలిసి ఆడుతుండగా.. 6.45 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లుగా ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. పెద్ద మెరుపు కనిపించింది. అంతలోనే ఆర్తనాదాలు.. హాహాకారాలు మిన్నంటాయి. అంతే ఎనిమిది మంది మిత్ర బృందం కలిసి అటువైపుగా పరుగులు పెట్టారు. ఘటనా స్థలంలో చుట్టూ చిమ్మచీకటి. మొబైల్ ఫ్లాష్ లైట్లు వేసి చూస్తే కళ్లముందు ఘోర ప్రమాదం. ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సహాయక చర్యలు మొదలుపెట్టారు. అంతలోనే బహానగా ఊరు ఊరంతా అక్కడకు చేరుకుంది. వారంతా యుద్ధభూమిలో సైనికుల్లా వ్యవహరించి బోగీల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకురావటం ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ప్రభుత్వ సహాయ బృందాలు వచ్చేలోపు దాదాపు రాత్రి 9 గంటల వరకూ స్థానికులే అంతా తామై వ్యవహరించారు. ఆ తర్వాత కూడా రాత్రంతా సేవలందించారు. అత్యంత కీలక సమయంలో చురుగ్గా స్పందించారు. వారే లేకుంటే బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో ప్రాణనష్టం ఊహకందనంత తీవ్రంగా ఉండేది. ప్రమాదం జరిగిన రోజు అనుభవాలను సహాయక చర్యల్లో మొట్టమొదట పాల్గొన్న దీపక్ రంజన్ బెహరా, శుభంకర్ జెనా వారి మిత్ర బృందం ‘ఈనాడు ప్రతినిధి’కి వివరించారు. అవి వారి మాటల్లోనే...
బోగీల్లో ఒకరిపై ఒకరు గుట్టల్లా పేరుకుపోయి...
‘‘మేము బోగీల్లోకి వెళ్లేసరికి లోపల ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు గుట్టల్లా పేరుకుపోయి ఉన్నారు. మనుషులపై నుంచి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. చాలామంది కింద భాగంలో చిక్కుకుపోయి కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరినీ బయటకు లాగాం. లోపలంతా చిమ్మచీకటి. ఏమీ కనిపించట్లేదు. అప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కదల్లేని స్థితిలో ఉన్నారు. వారిని భుజాలపై మోసుకుంటూ కిందకు దించాం. మృతదేహాలను ఓ చోట పెట్టాం. బతికున్నవారిని బయటకు తీశాం. మా బృందం 88 మందిని ప్రాణాలతో కాపాడింది. ఊరు ఊరంతా వందల మందిని ఇలాగే రక్షించింది.
సైకిల్, బైక్ ఏది ఉంటే దానిపైనే..
ప్రమాదాల సమయంలో మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఆలోగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు కాపాడేందుకు వీలుంటుంది. అందుకే కాపాడిన వారందరినీ అందుబాటులో ఉన్న వాహనాలపై తరలించాం. కొందర్ని సైకిళ్లపైన, మరికొందర్ని ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో తీసుకెళ్లాం. ప్రమాదం జరిగిన గంట తర్వాత అంబులెన్సులు వచ్చాయి. ఈలోపు స్థానికులే సొంత వాహనాలపై చాలామందిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనివల్ల చాలావరకూ ప్రాణనష్టం తగ్గింది.
మొబైల్ ఫ్లాష్ లైట్ వెలుగులోనే
ప్రమాదం జరిగిన తర్వాత మొదటి రెండు గంటల పాటు మొబైల్ ఫ్లాష్‌లైట్ల వెలుగులోనే పనిచేశాం. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించి బోగీల్లో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసుకొచ్చారు. ఆ విపత్తు సమయంలో ఆ ఫ్లాష్ లైట్లే ఎంతోమంది ప్రాణాలు కాపాడాయి.
ఆ గర్భిణి వేదన హృదయ విదారకం
మేం వెళ్లిన ఓ బోగీలో ప్రయాణికుల మధ్యలో ఓ గర్భిణి కూరుకుపోయి కనిపించారు. ఆమె రోదనలు హృదయవిదారకంగా అనిపించాయి. అతి కష్టమ్మీద ఆమెను బయటకు తీసుకురాగలిగాం. కానీ తన ఇద్దరు పిల్లలు పైన ఉండిపోయారని, వారిని బయటకు తేవాలంటూ ఆమె ప్రాధేయపడ్డ తీరు ఇప్పటికీ మా కళ్లలో అలా మెదులుతూనే ఉంది. నాటి భీకర, బీభత్స దృశ్యాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.’’
స్వచ్ఛంద సంస్థల సహకారం..
బోగీల్లో చిక్కుకున్నవారిని కాపాడడమే కాదు.. సహాయక పనుల్లో పాల్గొన్నవారికి ఆహార పానీయాలు అందిస్తూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాతృత్వాన్ని చాటుకున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ మంచినీళ్లు, అరటి పళ్లు, బ్రెడ్ ప్యాకెట్లు అందించింది. ఒడిశాలోని పారదీప్ పోర్టు ట్రస్ట్ వారు వైద్యసేవలు అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నించనున్న నార్కోటిక్ పోలీసులు
-
సముద్ర తీరంలో 144 సెక్షనా?చంద్రబాబు సైకత శిల్పం వద్ద నిరసన తెలిపిన తెదేపా నేతలపై కేసులు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala : హనుమంత వాహనంపై మలయప్పస్వామి అభయం
-
Epuri Somanna: త్వరలో భారాసలోకి ఏపూరి సోమన్న
-
Hyderabad: ప్యాసింజర్ కష్టాలు.. 2017 సంవత్సరం నుంచి 161 రైళ్ల రద్దు