యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ

యశ్వంత్‌పూర్‌, కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ బోగీల్లో చిక్కుకొని మృతిచెందినవారిని వెలికి తీయడం.. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం.. ప్రయాణికుల సమాచారాన్ని బంధువులకు, ప్రభుత్వాలకు చేరవేసే పనులు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు పునరుద్ధరణ పనులు కూడా వేగంగా పూర్తవుతున్నాయి.

Updated : 05 Jun 2023 09:13 IST

51 గంటల్లో ఒక మార్గం సిద్ధం

ఈనాడు డిజిటల్‌, బాలేశ్వర్‌: యశ్వంత్‌పూర్‌, కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ బోగీల్లో చిక్కుకొని మృతిచెందినవారిని వెలికి తీయడం.. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం.. ప్రయాణికుల సమాచారాన్ని బంధువులకు, ప్రభుత్వాలకు చేరవేసే పనులు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు పునరుద్ధరణ పనులు కూడా వేగంగా పూర్తవుతున్నాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే తిరిగి పట్టాలపైకి రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. మూడు రైల్వే డివిజన్ల అధికారులు, వేలమంది కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు శ్రమించి మరమ్మతులు పూర్తిచేశారు. పునరుద్ధరించిన పట్టాలపై ఆదివారం రాత్రి 10.40 గంటలకు తొలి గూడ్సు రైలు రాకపోకలను రైల్వే మంత్రి ప్రారంభించారు. ఈ రైలు విశాఖ ఓడరేవు నుంచి రవుర్కెలా ఉక్కు కర్మాగారానికి బొగ్గు తీసుకువెళ్తోంది. డౌన్‌లైన్‌ పునరుద్ధరణ పూర్తయిందని రైల్వేమంత్రి ట్వీట్‌ చేశారు. మరికొన్ని రైళ్లను ప్రయోగాత్మకంగా పంపించి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకలకు అవకాశం కల్పిస్తామన్నారు. అత్యంత వేగంగా రైల్వే లైనును పునరుద్ధరించిన సిబ్బందిని, అధికారులను అభినందించారు. వైష్ణవ్‌ రెండు రోజుల నుంచి స్థానికంగానే మకాం వేసి రైలు పట్టాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు.  రైల్వే లైన్‌ను పునరుద్ధరించేందుకు ఆగ్నేయరైల్వేతో పాటు తూర్పుకోస్తారైల్వే అధికార యంత్రాంగమంతా రంగంలోకి దిగింది. సుమారు 1500 మందికి పైగా కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు గత 48 గంటలుగా నిర్విరామంగా క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్నారు. తొలిరోజు నుంచి తీరిక లేకుండా పనిచేస్తున్న సిబ్బంది స్థానంలో పనిచేయడానికి వాల్తేరు డివిజన్‌ నుంచి ఆదివారం ఉదయం 280 మంది సిబ్బందితో ప్రత్యేక రైలు బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రైల్వే ఉన్నతాధికారులతో పాటు వాల్తేరు డీఆర్‌ఎం అనూప్‌ శత్పథి పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు.


బోగీలన్నీతుక్కు.. తుక్కు..

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌తోపాటు బెంగళూరు - హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ బోగీలు ఈ ప్రమాదంలో తుక్కై పోయాయి. వాటికి మరమ్మతులు చేసినా తిరిగి వినియోగించే పరిస్థితిలో లేవు. ఓ రైలు బోగీలు కింద ఉండగా.. దాని చక్రాలు, అడుగు భాగం పైన ఉన్నాయి. మరో రైలు బోగీల చక్రాలు పూర్తిగా విడిపోయి పక్కన ఉన్నాయి. ట్రాక్‌పై ఉన్న స్తంభాలు పూర్తిగా నేలమట్టమై కనిపించాయి. కొన్ని రైళ్ల భాగాలు ఏకంగా మట్టిలో కూరుకుపోయాయి. కొన్ని బోగీల్లో లోపలి భాగం పూర్తిగా తునాతునకలై ఉంది. మరికొన్ని బోగీల ముందుభాగం పూర్తిగా చీలిపోయి కనిపించింది. ప్రమాదతీవ్రత స్థాయిని చెప్పేందుకు ఈ దృశ్యాలు అద్దం పట్టాయి. గూడ్స్‌ రైలుపైకి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ దూసుకు రావడంతో ఇంజిన్‌తోపాటు పలు బోగీలు గూడ్స్‌ వ్యాగన్‌పైకి ఎక్కేశాయి. వాటిని కిందకు దించడానికి భారీ క్రేన్‌తోపాటు నాలుగు పొక్లెయిన్లతో నాలుగు గంటల పాటు కష్టపడ్డారు. ఒడిశా పోలీసులతోపాటు ఆర్పీఎఫ్‌, సాయుధ బలగాలు భారీ సంఖ్యలో పునరుద్ధరణ పనుల వద్ద పహారా కాస్తున్నాయి.


పట్టాలపై.. పెను విషాద గుర్తులు

కూలీ నాలీ చేసి కష్టపడి సంపాదించిన సొమ్ముతో పిల్లల కోసం ఓ తండ్రి కొన్న కొత్త దుస్తులు... బతుకుతెరువు కోసం బయల్దేరిన భవన నిర్మాణ కార్మికుడి తాపీ, పెయింటింగ్‌ బ్రష్‌, ఇతర పనిముట్లు.. తెగిపోయిన చెప్పులు... చిరిగిపోయిన బట్టలు... అక్కడక్కడ ఆనవాళ్లుగా కనిపించే ఆధార్‌కార్డులు... పాస్‌పోర్టు సైజు ఫొటోలు.. బహానగా వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదానికి సంబంధించిన ఇలాంటి విషాద గుర్తులు అనేకం పట్టాలపై కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి, గాయపడ్డవారి వస్తువులు, బ్యాగులు, దుస్తులు, ఫొటోలు, పర్సులు.. ఇలాంటివి పట్టాలపైన, బోగీల్లోనూ చెల్లాచెదురుగా పడి ఉండి విషాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. పట్టాలు తప్పింది రైళ్లు కాదు.. కొన్ని వందల కుటుంబాలు అనేందుకు పట్టాలపై పడి ఉన్న వస్తువులే సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి.


విషాదంలోనూ చేతివాటం

ఇంతటి ఘోర విషాదంలోనూ కొందరు చిల్లర వ్యక్తులు చేతివాటం ప్రదర్శించారు. పట్టాలపై పడిపోయిన పర్సులు వెతుకుతూ వాటిలో ఉన్న డబ్బులు తీసుకున్నారు. మరికొందరు పట్టాల నిండా పడి ఉన్న కొత్త దుస్తులను, ఇతర విలువైన వస్తువులను ఏరుకుని తీసుకెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని