Odisha train tragedy: ఉద్దేశపూర్వక చర్యేనా?
రైళ్లు సురక్షితంగా నడవడంలో అత్యంత కీలకమైన ‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ’లో మార్పులు చేయడమే ఒడిశాలో ఘోరమైన రైలు ప్రమాదానికి కారణమని బయటపడింది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి కారణం అదేనని ప్రాథమిక అంచనా
ఇంటర్‌లాకింగ్‌లో మార్పులు జరిగాయి
పాయింట్ మెషీన్ సెట్టింగ్‌ను మార్చారు
నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు
ఈ నేరచర్యకు బాధ్యుల్ని గుర్తించాం
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
బాలేశ్వర్, న్యూస్‌టుడే-భువనేశ్వర్: రైళ్లు సురక్షితంగా నడవడంలో అత్యంత కీలకమైన ‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ’లో మార్పులు చేయడమే ఒడిశాలో ఘోరమైన రైలు ప్రమాదానికి కారణమని బయటపడింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందా, విధ్వంసం సృష్టించే ఆలోచనతోనే ఇలా చేశారా అనేది నిగ్గుతేల్చడానికి సీబీఐని రంగంలో దించనున్నారు. ప్రమాదంలో రైల్వే లోకోపైలట్ల (డ్రైవర్ల) తప్పేమీ లేదని ఉన్నతాధికార వర్గాలు క్లీన్‌చిట్ ఇచ్చాయి. రైలు పట్టాలు మారుతూ వెళ్లడంలో ఇంటర్‌లాకింగ్ వ్యవస్థే ప్రధానం. ‘మా విచారణ పూర్తయింది. ఘోరకలికి మూల కారణమేమిటి, దానికి బాధ్యులు ఎవరనేది తేలింది. పాయింట్ మెషీన్ సెట్టింగ్‌ను మార్చారు. ఈ క్రిమినల్ చర్యను ఎందుకు, ఎలా చేశారనేది రైల్వే భద్రత కమిషనర్ (సీఆర్‌ఎస్) దర్యాప్తు నివేదికలో బయటపడుతుంది. అందువల్ల నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్లను. పూర్తి నివేదిక మాకు రానివ్వండి. రైళ్లు ఢీకొనకుండా నివారించే కవచ్ వ్యవస్థకు, ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు’ అని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రమాద ఘటనపై సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫార్సు చేసిందని వెల్లడించారు. ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలో మూడురైళ్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలసి పనులు పర్యవేక్షిస్తున్న ఆయన ఆదివారం బాలేశ్వర్ ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడారు. చికిత్స అనంతరం క్షతగాత్రుల్ని, వారి సంబంధీకుల్ని ఇళ్లకు చేర్చడానికి వీలుగా ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు చెప్పారు. 300 మంది బాధితుల రక్త సంబంధీకులకు పరిహారం చెల్లించామని చెప్పారు.
విధ్వంసం కోసమే మార్పులు చేశారా?
ఇంటర్‌లాకింగ్‌లో మార్పును ఎవరు ఎందుకు చేశారు? ఇది ఉద్దేశపూర్వకమేనా? ప్రమాదం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు రైల్వే అధికారులను వేధిస్తున్నాయి. విధ్వంసక చర్యకు పాల్పడేందుకే కొందరు వ్యక్తులు.. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సాధారణంగానైతే ఆ వ్యవస్థలో పొరపాటు జరిగేందుకు ఎటువంటి ఆస్కారం లేదని చెబుతున్నారు. పూర్తి విషయాలు సీఆర్‌ఎస్ దర్యాప్తుతో పాటు సీబీఐ విచారణలో నిగ్గుతేలాల్సి ఉన్నాయి.
గూడ్సు రైలులో సరకు ప్రమాద తీవ్రతను పెంచింది
ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు సభ్యురాలు జయవర్మ సిన్హా మీడియాతో మాట్లాడారు. గూడ్సురైలులో నిండుగా ఇనుప ఖనిజం ఉండడంతో ఆ బరువు ప్రభావం దానిని వెనకనుంచి వేగంగా ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై ఎక్కువగా పడిందని తెలిపారు. ‘గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తర్వాతే కోరమాండల్ రైలు ముందుకు వెళ్లిందని తీవ్ర గాయాలపాలైన ఆ రైలు డ్రైవర్ తెలిపారు. ఆయన సిగ్నల్‌ను అతిక్రమించలేదు. రైలు కూడా పరిమితికి మించిన వేగంతో ఏమీ వెళ్లలేదు’ అని వివరించారు. ఆ ప్రాంతంలో గరిష్ఠ వేగ పరిమితి 130 కి.మీ. ఉండగా.. ప్రమాద సమయంలో కోరమాండల్ 128 కి.మీ. వేగంతో వెళ్తోందని స్పష్టంచేశారు. ‘ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో ఏమైనా తప్పు జరిగితే వెంటనే రెడ్ సిగ్నల్స్ వచ్చి రైళ్ల రాకపోకలన్నీ ఆగిపోతాయి. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ సెట్టింగ్స్ మార్చడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఎవరైనా చూడకుండా ఆ ప్రాంతంలో కేబుల్స్‌ను తవ్వడం, ఏదైనా యంత్రాన్ని నడపడం కూడా వ్యవస్థ వైఫల్యానికి కారణం కావచ్చు’ అని వివరించారు. ముందునున్న మార్గంలో వేరే రైలు ఉందా, రైలు మెయిన్‌లైన్లో వెళ్లనుందా, లూప్‌లైన్‌లోనా అనేది డ్రైవరుకు స్పష్టంగా తెలుస్తుందని రైల్వేబోర్డు సిగ్నలింగ్ విభాగం ఈడీ సందీప్ మాధుర్ దిల్లీలో విలేకరులకు తెలిపారు.
ఇంటర్ లాకింగ్ వ్యవస్థ అంటే..
ఇంటర్నెట్ డెస్క్, ఈనాడు: ఒకే పట్టాలపై ఏకకాలంలో రెండు రైళ్లు రాకుండా మార్గం సుగమం చేసేందుకు ఉద్దేశించిన సమగ్రమైన సిగ్నల్ వ్యవస్థనే ఇంటర్‌లాకింగ్ అంటారు. రైలు ప్రయాణాలు సురక్షితంగా జరిగేలా చేయడం.. సిగ్నల్స్‌లో ఎటువంటి అవాంఛిత మార్పులు రాకుండా చూడటమే దీని ప్రాథమిక విధి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రయాణించే మార్గం పూర్తిగా సురక్షితం అని తేలేవరకు రైలుకు సిగ్నల్స్ ఇవ్వకుండా ఈ వ్యవస్థ నిలిపి ఉంచుతుంది. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ వినియోగంలోకి వచ్చిన అనంతరం రైళ్లు ఢీకొట్టడాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పొచ్చు. రైళ్ల కదలికల పర్యవేక్షణ, నియంత్రణలకు ఇది ఎలక్ట్రానిక్ కంట్రోల్ వ్యవస్థ, కంప్యూటర్లను వినియోగించుకుంటుంది. గతంలో మాన్యువల్‌గా సిబ్బంది ఇదంతా చేసేవారు.
వేగం.. కచ్చితత్వం
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో వేగంగా స్పందించే అవకాశం, రైళ్ల నియంత్రణకు సౌకర్యవంతంగా ఉండటం, కచ్చితత్వం వంటి సానుకూలాంశాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలో పట్టాలపై రైళ్ల కదలికల్ని గుర్తించడానికి సెన్సర్లు, ఫీడ్‌బ్యాక్ పరికరాలు వాడుతున్నారు. మార్గాన్ని సుగమం చేయడం, పాయింట్ల నిర్వహణ, పట్టాలపై రద్దీ పర్యవేక్షణ, లెవెల్ క్రాసింగ్ గేట్ల నిర్వహణ వంటి ఎన్నో పనులు దీనితో ముడిపడి ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.