Odisha train tragedy: మావాళ్లు ఎక్కడ..?

ఛిద్రమైపోయిన తలలు... రెండుగా చీలిపోయి, రూపుకోల్పోయిన ముఖాలు... ఛిన్నాభిన్నమైపోయిన శరీరాలు.. చెల్లాచెదురైపోయిన అవయవాలు... ఇలా గుర్తుపట్టటానికి వీల్లేని విధంగా మృతదేహాలున్నాయి. ఏ శవం ఎవరిదో తెలియని దుస్థితి. దీంతో వాటిని గుర్తించటం సవాలుగా మారింది.

Updated : 05 Jun 2023 06:48 IST

ఎవరి శవం ఏదో గుర్తించలేని దైన్యం
ఆచూకీ దొరక్క బంధువుల పరుగులు
ఫొటోలతో.. మృతదేహాల కోసం వెదుకులాట
కనీస సమాచారం కూడా అందక ఆవేదన
బాలేశ్వర్‌లో ఎటుచూసినా కన్నీటి సుడులే

గేదెల భరత్‌కుమార్‌
బాలేశ్వర్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

కన్నకొడుకు ఎక్కడున్నాడా అని..

జెనిమా మొండల్‌ది పశ్చిమబెంగాల్‌. పొట్టకూటి కోసం చెన్నై బయల్దేరి రైలుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన 32 ఏళ్ల కుమారుడు మంజూర్‌ అలీ మొండల్‌ మృతదేహం కోసం రెండు రోజులుగా ఆమె తిరగని చోటు, వెతకని ప్రదేశం లేదు. కనిపించిన వాళ్లందరికీ తన కుమారుడి ఫొటో, ఆధార్‌ కార్డు చూపిస్తూ మృతదేహం గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. అయినా ఆదివారం సాయంత్రం వరకూ ఆచూకీ దొరకలేదు. చివరికి బాలేశ్వర్‌లో మృతదేహాలు భద్రపరిచిన నోసీ పార్కు వద్దకు చేరుకుని అక్కడున్న మృతుల ఫొటోలు చూస్తూ.. వాటిలో తన కుమారుడి ఫొటో ఉందా అంటూ ఆత్రుతగా వెతుకుతూ కనిపించారు. వరదలా పొంగుతున్న కన్నీటిని దిగమింగుకుని మరీ.. కుమారుడి మృతదేహం కోసం ఆమె వెతుకుతున్న తీరు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తోంది. ఒక్క జెనిమా మొండల్‌.. మాత్రమే కాదు.. వందల మందిది ఇలాంటి దయనీయ స్థితే.


ఛిద్రమైపోయిన తలలు... రెండుగా చీలిపోయి, రూపుకోల్పోయిన ముఖాలు... ఛిన్నాభిన్నమైపోయిన శరీరాలు.. చెల్లాచెదురైపోయిన అవయవాలు... ఇలా గుర్తుపట్టటానికి వీల్లేని విధంగా మృతదేహాలున్నాయి. ఏ శవం ఎవరిదో తెలియని దుస్థితి. దీంతో వాటిని గుర్తించటం సవాలుగా మారింది. అధికారులు ప్రతి మృతదేహంపైన ఓ నంబరు వేసి.. అది కనిపించేలా మృతదేహాల ఫొటోలు తీసి వాటిని ఓ టేబుల్‌పై ఉంచారు. మృతుల కుటుంబీకులు ఆ ఫొటోలు చూసుకుని వాటిలో తమవారు ఉన్నారేమోనని గుర్తించాల్సిందే. అయితే ఆ ఫొటోల్లో మృతదేహాలు ఛిద్రమైపోయి ఉండటంతో చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఒడిశాలోని బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 180 మంది మృతదేహాలను తొలుత బాలేశ్వర్‌లోని నోసీ ఇండస్ట్రియల్‌ పార్కు వద్దకు తీసుకొచ్చి భద్రపరిచారు. ఆ ప్రాంతానికి ఈనాడు ప్రతినిధి వెళ్లి పరిశీలించగా.. ఇలాంటి అత్యంత హృదయవిదారక పరిస్థితులు కళ్లకు కట్టాయి.


ఇద్దరు కుమారులను కోల్పోయి..

చేతికి అందివచ్చిన ఇద్దరు కుమారులను రైలు ప్రమాదంలో కోల్పోయి.. వారి మృతదేహాల కోసం వెతుకులాడుతున్న ఈయన పేరు దినేష్‌. బిహార్‌ వాసి. ఈయన కుమారులు ప్రమోద్‌కుమార్‌, సుబోధ్‌కుమార్‌ పనుల కోసం చెన్నై వెళ్తూ రైలుప్రమాదంలో మరణించారు. విషయం తెలిసి బిహార్‌ నుంచి బాలేశ్వర్‌కు చేరుకున్న దినేష్‌.. తన కుమారుల మృతదేహాల కోసం శనివారం నుంచి వెతుకుతూనే ఉన్నారు. అయినా దొరకలేదు. బాలేశ్వర్‌లోని నోసీ పార్కు వద్ద మృతదేహాలను భద్రపరిచిన ప్రదేశంలో ఉన్న మృతుల ఫొటోల్లో తన కుమారులు ఫొటోలు ఉన్నాయేమోనని పదే పదే వెతికినా ఫలితం లేదు. నిద్రాహారాలు లేకుండా వారి మృతదేహాల కోసం వెతుకుతూనే ఉన్నారు.


తమవారు ఎక్కడున్నారా అని...

కుమారుల మృతదేహాల కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు.. తండ్రి మృతదేహం కోసం వెతుకుతున్న పిల్లలు.. భార్య మృతదేహం కోసం వెతికే భర్త... భర్త ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న భార్య.. తమవారి మృతదేహాల కోసం వెతికి వెతికి.. ఆచూకీ తెలియక నిస్సహాయ స్థితిలో దీనంగా రోదిస్తున్న కుటుంబసభ్యులు... ఇలా అక్కడ ఎవర్ని తట్టినా కన్నీరు వరదలా తన్నుకొస్తోంది. పొట్టకూటి కోసం పనులు వెతుక్కుందామని దూరతీరాలకు బయల్దేరిన బడుగుజీవులే బాధితుల్లో ఎక్కువగా ఉన్నారు. కుటుంబం మొత్తాన్ని పోషిస్తామంటూ బయల్దేరిన తమవాళ్లు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారని తెలిసి.. కనీసం వారికి గౌరవంగా అంత్యక్రియలైనా చేద్దామని మృతదేహాల కోసం పరుగుపరుగున వచ్చారు. కానీ ఇక్కడికొస్తే, కనీస సమాచారం ఇచ్చేవారూ లేరు. గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాల్లో తమవారివి ఉన్నాయేమోనని తరచి తరచి చూస్తున్న వారిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది.


36 గంటలు వెతికితే మృతదేహం దొరికింది

పశ్చిమబెంగాల్‌కు చెందిన దీనబంధు రఘు, సచిన్‌ రవుత్‌ల కుటుంబీకుడు తపస్‌కుమార్‌ రవుత్‌ (21) రైలుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తోటి ప్రయాణికుల ద్వారా విషయం తెలిసిన కుటుంబీకులు వెంటనే బాలేశ్వర్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం నుంచి మృతదేహం కోసం వెతుకుతూనే ఉన్నారు. దాదాపు 36 గంటల పాటు తిరిగిన తర్వాత.. ఆదివారం సాయంత్రం బాలేశ్వర్‌ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహం దొరికింది.


చివరి చూపూ గగనమే...

నోసీ ఇండస్ట్రియల్‌ పార్కు వద్ద ఉన్నవాటిలో ఆదివారం సాయంత్రానికి 97 మృతదేహాలనే గుర్తించగలిగారు. మిగతా వాటిని భువనేశ్వర్‌, కటక్‌లోని వేర్వేరు చోట్లకు పంపించేశారు. దీంతో మృతుల కుటుంబీకులకు తమవారి మృతదేహాలను వెతుక్కోవటం పెద్ద సవాలుగా మారింది. అయిన వారిని కోల్పోయి అసలే విషాదంలో ఉన్న వారు.. ఒక చోట నుంచి మరోచోటకు పరుగులు పెడుతూ.. మృతదేహాల కోసం వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మృతుల్లో ఏ రాష్ట్రం వారు ఎందరనే కనీస సమాచారం కూడా అధికారులు ప్రకటించట్లేదు.


బెంగాల్‌, బిహార్‌ వారే అధికం

ప్రమాద మృతుల్లో అత్యధికులు జనరల్‌ బోగీల్లో ప్రయాణిస్తున్నవారే. వీరిలో పశ్చిమబెంగాల్‌, బిహార్‌కు చెందినవారే అధికం. వారి వివరాలేవీ రిజర్వేషన్‌ చార్టుల ఆధారంగా ఉండే ప్రయాణికుల జాబితాల్లో లేవు. దాంతో.. వారి సమీప బంధువులు తమవారి ఆధార్‌ కార్డులు, ఫొటోలు తీసుకొచ్చి... కనిపించిన ప్రతి ఒక్కరికీ వాటిని చూపించి ఎక్కడైనా చూశారా అంటూ ఆరాతీస్తున్నారు. మృతుల ఫొటోలతో తమ వద్ద ఉన్న ఫొటోలను సరిపోల్చుకుంటూ వారి ఆచూకీ గురించి వెతుక్కుంటున్నారు.


అయినవారి ఆచూకీ లేక..!
ఫొటోలు, ఆధార్‌ కార్డులు పట్టుకుని తిరుగుతున్న బంధువులు

ఈనాడు డిజిటల్‌, బాలేశ్వర్‌:  అన్‌ రిజర్వ్‌డ్‌ బోగీల్లో వెళ్లినవారి సమాచారం తెలియక బంధువులు వారి ఫొటోలు, ఆధార్‌ కార్డులతో కనిపించిన ప్రతి ఒక్కరినీ అడుగుతున్నారు..

మా నాన్న కనిపించడం లేదు

కోల్‌కతా నుంచి 12మంది కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. వారిలో 11మంది క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. మా నాన్న సురేంద్ర సర్దార్‌ ఆచూకీ తెలియలేదు. రైల్వేవారిని అడుగుదామని వస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నాలుగు గుర్తుతెలియని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వెతకడానికి అక్కడికి వెళ్తున్నాం.

సోమేష్‌ సర్దార్‌, కోల్‌కతా


ఏమయ్యారో తెలియడం లేదు

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన మా బంధువు నితమ్‌రాయ్‌ వివరాలు తెలియలేదు. ఎవరిని అడగాలో తెలియక రెండురోజుల నుంచి తిరుగుతున్నాం. రైల్వే అధికారులను అడిగితే సరిగ్గా చెప్పడం లేదు. అతడికి తండ్రి లేడు. తల్లి, భార్య, పిల్లలున్నారు. వారు తిరగలేక మమ్మల్ని పంపించారు. ఎక్కడ వెతికినా సమాచారం రాలేదు.

సిమాన్‌సింగ్‌, పశ్చిమబెంగాల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని