భార్య, అత్త, బావమరిదిని కోల్పోయాడు.. చివరి క్షణంలో ఆగి బతికిపోయాడు!

బహానగా రైలు ప్రమాదంలో భార్య సహా అయిన వారందర్నీ కోల్పోయి దీనంగా రోదిస్తున్న గౌతమ్‌దాస్‌ది ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించే కథ.

Updated : 05 Jun 2023 09:14 IST

బహానగా రైలు ప్రమాదంలో భార్య సహా అయిన వారందర్నీ కోల్పోయి దీనంగా రోదిస్తున్న గౌతమ్‌దాస్‌ది ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించే కథ. ఈయన భార్య విష్ణుప్రియదాస్‌ (22) ఇటీవలే కటక్‌లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించి తదుపరి వైద్యం కోసం ఆమె తల్లి ఝరుణాదాస్‌, సోదరుడు హిమాన్ష్‌దాస్‌తో కలిసి కటక్‌ వెళ్లేందుకు బాలేశ్వర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. వారితో పాటు అదే రైలులో గౌతమ్‌ దాస్‌ కూడా ప్రయాణించాల్సి ఉంది. దీని కోసం టికెట్‌ కూడా ఆయన కొనుక్కున్నారు.  

చివరి క్షణంలో అత్యవసర పని పడటంతో బాలేశ్వర్‌లోనే ఆగిపోయారు. ఆ తర్వాత వచ్చే రైలులో కటక్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ నుంచి బయల్దేరిన అరగంట వ్యవధిలోనే ప్రమాదానికి గురైందన్న సమాచారం అందటంతో ఆందోళనకు గురైన గౌతమ్‌ దాస్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే అతని భార్య, అత్త, బావమరిది ముగ్గురూ విగతజీవులుగా కనిపించడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆదివారం ఆ ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. గౌతమ్‌ దాస్‌కు వివాహమై ఇటీవలే ఏడాది పూర్తయ్యింది. ఇంతలోనే భార్యను కోల్పోవడంతో ఆయన రోదిస్తున్న తీరు అక్కడున్న వారందరికీ కన్నీటిని తెప్పించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు