మృతదేహాలను భద్రపరచడం.. పెనుసవాలు

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇంకా 120 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మొత్తంగా ఘటనాస్థలి నుంచి భువనేశ్వర్‌కు 187 మృతదేహాలను తరలించగా.. గుర్తించని శవాలను ‘అన్‌ఐడెంటిఫైడ్‌ బాడీస్‌’గా నిర్ధరించి నగరంలోని పలు ఆసుపత్రుల శవాగారాలకు తరలించారు.

Updated : 05 Jun 2023 07:11 IST

వెబ్సైట్‌లో మృతుల చిత్రాలు

ఈనాడు, భువనేశ్వర్‌, విశాఖపట్నం: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇంకా 120 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మొత్తంగా ఘటనాస్థలి నుంచి భువనేశ్వర్‌కు 187 మృతదేహాలను తరలించగా.. గుర్తించని శవాలను ‘అన్‌ఐడెంటిఫైడ్‌ బాడీస్‌’గా నిర్ధరించి నగరంలోని పలు ఆసుపత్రుల శవాగారాలకు తరలించారు. గుట్టలుగా పడి ఉన్న శవాలను భద్రపర్చడం యంత్రాంగానికి సవాలుగా మారింది. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి శవాలను సంబంధీకులకు అప్పగించేలా ఏర్పాట్లు చేశారు. ఐఏఎస్‌ అధికారి తిరుమనాయక్‌ను పర్యవేక్షకుడిగా నియమించారు. 1929 నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని, కటక్‌ రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఎస్‌సీబీ వైద్య కళాశాల, భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌, విమానాశ్రయం వద్ద సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. మృతుల్లో ఏపీకి చెందినవారు ఉంటే చూసుకునేందుకు వీలుగా ఆ ఫొటోలతో కూడిన జాబితాలను మన రాష్ట్ర అధికారులకు అందించారు.

భయానకంగా చిత్రాలు..

గుర్తించని మృతదేహాలను అధికారులు ఫొటోలు తీసి వెబ్‌సైట్లలో ఉంచారు. www.bmc.gov.in, www.osdma.org లో మృతుల చిత్రాలు పరిశీలించవచ్చు. ప్రమాదం ఈ నెల 2న రాత్రి జరగ్గా, ఆదివారం రాత్రి వరకూ 120 మృతదేహాల కోసం సంబంధీకులు ఎవరూ రాలేదు. వారికి సంబంధించిన పర్సులు, ఫొటోలు, ఓటరు కార్డులు, సెల్‌ఫోన్లు వంటివి మృతదేహాలపైనే ఉంచి ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో పెట్టారు. ఫొటోలు తీసే సమయానికే చాలా మృతదేహాలు గుర్తించలేనంతగా మారిపోయాయి. సగానిపైగా శవాలు రంగుమారాయి. చనిపోయిన వారిలో పురుషులే అధికం. చిన్నారులూ కొందరున్నారు. చాలామంది ముఖాలకు దెబ్బలు తగిలి ఉబ్బిపోయాయి. కొన్నైతే తల నుంచి ఉదర భాగం వరకు, మరికొన్ని చాలావరకు శరీర భాగాలు లేకుండా ఉన్నాయి. నుజ్జయిపోవడంతో వాటిని గుడ్డలో చుట్టిపెట్టారు. ఈ మృతులంతా బోగీల కింద నలిగిపోయినట్లు తెలుస్తోంది. కొందరు తీవ్రమైన దెబ్బలతో మట్టిలో కూరుకుపోయినట్లు కనిపిస్తున్నారు.


ప్రధాని ఫోన్‌ కాల్‌తో భువనేశ్వర్‌కు మాండవీయ

భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు 110 మృతదేహాలు తరలించగా, మిగతా వాటిని కాపిటల్‌, అమ్రి, సమ్‌తో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో భద్రపరిచారు. కోల్డ్‌ స్టోరేజీల్లోనూ ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్టు ఒడిశా ఆరోగ్యశాఖ కార్యదర్శి శాలినీ పండిట్‌ చెప్పారు. ఎయిమ్స్‌లో గరిష్ఠంగా 40 శవాలనే ఉంచేందుకు వీలుండగా, ఇప్పుడు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. శవపేటికలు, ఐస్‌, ఫార్మాలిన్‌ రసాయనాలు సేకరిస్తున్నారు. వేడి వాతావరణం మరో ప్రతిబంధకంగా మారింది. ఈ విషయంలో ఎదురవుతున్న సవాళ్లను ఒడిశా అధికారులు ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. వెంటనే ప్రధాని మోదీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో మాట్లాడి ఎయిమ్స్‌లో మృతదేహాలను భద్రపరిచేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి భువనేశ్వర్‌కు చేరుకొన్న మాండవీయ.. అధికారులతో సమీక్షించారు. మృతులు పలు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో గుర్తించడం పెనుసవాలుగా మారిందని ఒడిశా సీఎస్‌ ప్రదీప్‌ జెనా తెలిపారు.


ఫోన్‌నంబర్లతో గుర్తించవచ్చా?

ఆచూకీ లభించని వారికి సంబంధించిన ఫోన్‌ నంబర్ల ద్వారా వారి చిరునామా గుర్తించి, వాళ్లు ఏమయ్యారనే సమాచారం తెలుసుకునే వీలుంది. ఫోన్‌ నంబర్లతో సిమ్‌ తీసుకునే సమయంలో టెలికం సంస్థలకు ఇచ్చిన చిరునామాతో వాళ్లను గుర్తించేందుకు అవకాశముంది. పోలీసు శాఖకు టెలికం సంస్థల డేటాబేస్‌తో అనుసంధానం ఉంటుందని, దీంతో వారి చిరునామాలు గుర్తించనున్నట్లు తెలుస్తోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు