సంక్షిప్త వార్తలు(4)

జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి ఎట్టకేలకు పదేళ్ల గడువుతో సాధారణ పాస్‌పోర్టు జారీ అయింది.

Updated : 05 Jun 2023 05:56 IST

మూడేళ్ల న్యాయపోరాటం తర్వాత ముఫ్తీకి పాస్‌పోర్టు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి ఎట్టకేలకు పదేళ్ల గడువుతో సాధారణ పాస్‌పోర్టు జారీ అయింది. ఇందుకోసం ఆమె మూడేళ్లకు పైగా న్యాయపోరాటం చేశారు. పోలీసు నివేదిక వ్యతిరేకంగా ఉందంటూ 2019 నుంచి  మెహబూబా పాస్‌పోర్టు రెన్యువల్‌ను అధికారులు నిలిపివేశారు. దీనిపై ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గత మార్చి నెలలో ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. మెహబూబాకు కొత్త పాస్‌పోర్టు మంజూరుపై మూడు నెలల్లో అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు మాజీ ముఖ్యమంత్రికి కొత్త పాస్‌పోర్టు అందజేశారు. మరోవైపు.. ఇదే సమస్యతో మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా వేసిన పిటిషను ఈ వారం జమ్మూకశ్మీర్‌ హైకోర్టులో విచారణకు రానుంది.


వాతావరణ విపత్తులపై టీవీ, రేడియోల్లోనూ హెచ్చరిక సందేశాలు!

దిల్లీ: దేశంలో జరిగే అసాధారణ వాతావరణ విపత్తుల గురించి ప్రజలకు మరింత విస్తృతంగా హెచ్చరికలు అందనున్నాయి. ఈ ముందస్తు సందేశాలు టీవీ తెరలపై ప్రత్యక్షం కానున్నాయి. అలాగే రేడియోల్లోనూ వినిపిస్తాయి. అలాంటి సందర్భాల్లో రేడియోల్లో వచ్చే పాటల నిడివిని తగ్గించి, ఈ హెచ్చరికలను జారీ చేస్తారు.   కొంతకాలంగా.. భారీ వర్షాలు, పిడుగుపాటు, వడగాల్పుల గురించి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) మొబైల్‌ ఫోన్ల ద్వారా టెక్స్ట్‌ సందేశాలను పంపుతోంది. ఇప్పుడు టీవీ, రేడియో, ఇతర మాధ్యమాల ద్వారా కూడా ఈ సేవలు అందించాలని నిర్ణయించింది. తద్వారా విపత్తులను ఎదుర్కోవడానికి పౌరులు మెరుగ్గా సన్నద్ధమవుతారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఇది అమలవుతుందని తెలిపారు. స్థానిక భాషల్లోనూ వీటిని జారీ చేస్తామని చెప్పారు. టెక్స్ట్‌ ఆధారిత హెచ్చరిక సందేశాల వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులను టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ ద్వారా అధిగమిస్తామని తెలిపారు.


తమిళనాడువారు అయిదుగురి ఆచూకీ గల్లంతు 

చెన్నై. న్యూస్‌టుడే: కోరమాండల్‌ రైలులో చెన్నై వచ్చేందుకు రిజర్వేషన్‌ చేసుకున్న తమిళనాడువాసుల్లో ఐదుగురి ఆచూకీ తెలియలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో స్థానిక చిరునామా ఉన్న 127 మంది ప్రయాణికులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారి ఫోన్‌నంబర్ల ఆధారంగా ఆరా తీయగా, 122 మంది సురక్షితంగా ఉన్నట్టు తేలింది.


బ్లింకెన్‌కు ధన్యవాదాలు

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై నాకు ఫోన్‌ చేసి సానుభూతి తెలిపిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు ధన్యవాదాలు. ప్రస్తుత క్లిష్ట సమయంలో తన మద్దతు తెలపడం గొప్ప విషయం.

ఎస్‌.జైశంకర్‌


అసమర్థులను మంత్రులు చేయడంలో మోదీ దిట్ట

రైలు ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి.. ప్రధాని ఆమోదంతో పని లేకుండానే రాజీనామా చేయాలి. మోదీ అసమర్థులకు, లేదా సమర్థులైనప్పటికీ వెన్నెముక లేని విధేయులకు మంత్రి పదవులు ఇవ్వడంలో ప్రపంచంలోనే పేరుగాంచారు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాం. ఏమాత్రం కొరగాని భజనపరులకు పదవి ఇస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందనడానికి మణిపుర్‌ హింస మరో ఉదాహరణ.

సుబ్రమణ్యస్వామి


..అలా చేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కావు

రైల్వేలో రోజూ పట్టాల భద్రతను తనిఖీ చేసే గ్యాంగ్‌మెన్ల కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు స్టేషన్‌ మాస్టర్లు అధిక గంటలు విధులు నిర్వర్తిస్తున్నారు. మోదీ వందే భారత్‌ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలపై ఖర్చు చేసిన డబ్బును రైల్వే భద్రతకు వెచ్చించి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కావు.

సీతారాం ఏచూరి


తుపాకుల వినియోగాన్ని నియంత్రించాలి

ఈ ఏడాది తొలి 153 రోజుల్లోనే 260కి పైగా సామూహిక కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. తరగతి గదుల్లోనూ, వీధుల్లోనూ అమెరికా ప్రజలు తుపాకులకు బలవుతున్నా నిర్లిప్తంగా ఉండటం వివేకం కాదు. తుపాకుల వినియోగాన్ని నియంత్రించేలా చట్టం తీసుకురావాలని అత్యధికులు కోరుతున్నారు. పార్టీలకతీతంగా చట్టసభ్యులు ఆ దిశగా ఆలోచించాలి.

కమలా హారిస్‌


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని