జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండితే ఓటు
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారందరినీ ఓటర్లుగా చేర్చాలని రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
వార్షిక ఓటర్ల జాబితా సవరణకు ఈసీ ఆదేశం
5 రాష్ట్రాలు మినహా మిగిలినచోట్ల ప్రక్రియ
ఈనాడు, దిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారందరినీ ఓటర్లుగా చేర్చాలని రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ సీఈవోలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల అధికారులు దీనిని అనుసరించాలని స్పష్టం చేసింది. 2024 జనవరి 1ని గడువుగా పెట్టుకుని వార్షిక ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని సూచించింది. ఈ మేరకు మే 29వ తేదీతో ఉన్న ఉత్తర్వులను సోమవారం విడుదల చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లో కొత్త ఓటర్లను చేర్చడానికి జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబరు 1ని అర్హత తేదీలుగా నిర్ణయించినందున జనవరి 1ని గడువుగా పెట్టుకుని ఓటర్ల వార్షిక సవరణ కార్యక్రమం చేపట్టాలని పేర్కొంది. ఈ కొత్త ఓటర్ల జాబితాను జనవరి 25న జరిగే జాతీయ ఓటర్ల జాబితాకు ముందే ప్రచురించడంవల్ల కొత్తగా చేరిన ఓటర్లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవంనాడు పండగ వాతావరణంలో ఫొటో గుర్తింపు కార్డులు పంపిణీ చేయొచ్చని పేర్కొంది.
సవరణకు ఎన్నికల సంఘం విధించిన గడువులు
1. ఈఆర్‌వో, ఏఈఆర్‌వో, బీఎల్‌వోలకు చట్టాలు, మార్గదర్శకాలపై శిక్షణ - 01.06.2023 నుంచి 20.07.2023 వరకు.
2. బీఎల్‌వోల ఇంటింటి తనిఖీ - 21.07.2023 నుంచి 21.08.2023 వరకు.
3. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ/సర్దుబాటు, ఓటర్ల జాబితా/ ఫొటో గుర్తింపు కార్డుల్లో లోటుపాట్ల దిద్దుబాటు. గుర్తింపు కార్డుల్లో మంచి నాణ్యమైన ఫొటోలు చేర్చడం. సెక్షన్లు/ భాగాలను పునర్నిర్వచించడం, పోలింగ్ స్టేషన్ల సరిహద్దుల ఖరారు, లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దడానికి తుది వ్యూహాన్ని ఖరారు చేయడం, అందుకు తగిన గడువులు నిర్దేశించడం. కంట్రోల్ టేబుల్ అప్‌డేషన్- 22.08.2023 నుంచి 29.09.2023 వరకు.
4. ఫార్మాట్ 1 నుంచి 8 వరకు సంసిద్ధం చేయడం- 30.09.2023 నుంచి 16.10.2023 వరకు.
5. సమీకృత ముసాయిదా ఎన్నికల జాబితా ప్రచురణ- 17.10.2023.
6. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ దాఖలుకు గడువు- 17.10.2023 నుంచి 30.11.2023 వరకు.
7. ప్రత్యేక ప్రచార తేదీలు- క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్‌లో రెండు శనివారాలు, రెండు ఆదివారాలు. తేదీని సీఈవోలు ఖరారు చేయాలి.
8. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం- 26.12.2023.
9. సవరించిన జాబితాను తనిఖీ చేసి తుది ప్రచురణ కోసం కమిషన్ అనుమతి కోరడం. డేటాబేస్ అప్‌డేట్ చేసి సప్లిమెంట్లు ప్రింట్ చేయడం- 01.01.2024.
10. ఎన్నికల జాబితా తుది ప్రచురణ- 05.01.2024.
మార్గదర్శకాలు
* కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేటప్పుడుగానీ, ఉన్న స్టేషన్‌ను పునర్వ్యవస్థీకరించేటప్పుడుగానీ కుటుంబాలు రెండు స్టేషన్ల మధ్య విడిపోకుండా చూడాలి. ఒక కుటుంబంలోని సభ్యులంతా ఒకే స్టేషన్ పరిధిలోకి వచ్చేలా జాగ్రత్త పడాలి.
* 1500 ఓటర్లకు మించిన పోలింగ్ స్టేషన్లను హేతుబద్ధీకరించాలి. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించకముందే ఈ పని పూర్తి చేయాలి.
* ఒక భవనంలో నివసించే ఓటర్లంతా ఒకేచోట ఉండేలా చూడాలి. విలీనం చేసిన పోలింగ్ స్టేషన్లలోని ఓటర్లు రెండు కిలోమీటర్లకు మించి దూరం ప్రయాణించే లేదంటే సహజ సిద్ధమైన అడ్డంకులు దాటి వెళ్లే పరిస్థితులు కల్పించకూడదు.
* ఓటరు గుర్తింపు కార్డులో తప్పులుంటే సరిదిద్దాలి. ఒక ఓటరు పేరు మీద ఒకటికి మించి ఓటరు కార్డులంటే తాజాగా జారీ చేసిన కార్డు ఉంచి మిగతా వాటిని రద్దు చేయాలి.
* ఒకే ఓటరు నంబరుతో పలువురు ఓటర్లు ఉంటే తొలిసారి ఆ నంబరు కేటాయించిన ఓటరును ఉంచి మిగతా వారందరికీ కొత్త ఓటరు కార్డులు, నంబర్లు జారీ చేయాలి. వారి నుంచి పాత ఫొటో గుర్తింపు కార్డులన్నీ సేకరించి ధ్వంసం చేసి, ఆ వివరాలన్నీ రికార్డులో నమోదు చేయాలి.
* ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరే వారందరి నుంచి ఫాం-6 తీసుకోవాలి. జాబితాలో చేర్చడానికి ప్రతిపాదించిన పేర్ల పట్ల తెలిపే అభ్యంతరాలకు, జాబితా నుంచి పేర్లు తొలగించాలంటే విధిగా ఫాం-7 స్వీకరించాలి.
* ఓటరు ఒకే నియోజకవర్గం పరిధిలోగానీ, వేరే నియోజకవర్గంలోకిగానీ ఒకచోట నుంచి ఇంకోచోటికి మారినప్పుడుగానీ ఓటర్ల జాబితాలో సవరణలు చేసుకోవాలనుకుంటే సంబంధిత వ్యక్తి నుంచి ఫాం-8 తీసుకోవాలి.
* ఫాం-6, ఫాం-8 కింద దరఖాస్తు చేసుకునేవారి నుంచి స్వచ్ఛందంగా ఆధార్ నంబరు తీసుకోవాలి. అయితే ఆ వివరాలు ఇవ్వడానికి ఓటరు అంగీకరించనంత మాత్రాన వారి పేర్లను జాబితాలో చేర్చడానికి తిరస్కరించొద్దు. అలాగే ఉన్న పేరూ తొలగించకూడదు.
* దరఖాస్తుదారులు ఇచ్చిన పుట్టిన తేదీల ఆధారంగా వాటిని అర్హత తేదీల ఆధారంగా వేరు చేయాలి.
* ప్రస్తుతానికి 1.1.2024 తేదీ నాటికి 18 ఏళ్లకు చేరుకునేవారి దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలి.
* ఫాం-7 ద్వారానే తొలగింపులు చేపట్టాలి. మరణాల విషయంలో తప్ప మిగిలిన ఏదైనా కారణంగా పేర్లు తొలగించేట్లయితే ఓటరుకు నోటీసులు జారీ చేయాలి. ఒకవేళ ఆ అడ్రస్‌లో ఓటరు లేకపోతే ఇద్దరు సాక్షుల ముందు ఆ నోటీసును సదరు ఇంటి తలుపుపై అతికించాలి. ఆ సాక్షుల సంతకాలు తీసుకుని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఫైల్‌లో భద్రపరచాలి. అలాగే సంబంధిత వ్యక్తి వాదనలూ వినాలి.
* మరణాల కారణంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేటప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంగానీ, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారి వాంగ్మూలంగానీ తీసుకోవచ్చు.
* మరణాలు మినహా మిగతా కారణాలవల్ల పేర్లు తొలగించేటప్పుడు ఫామ్-7పై తుది ఉత్తర్వులు జారీచేసే ముందు తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు స్థాయి అధికారులు తనిఖీ చేయాలి. మొత్తం తొలగింపుల్లో కనీసం 10% మొత్తాన్ని అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలి.
* ఒక పోలింగ్ స్టేషన్‌లో తొలగింపులు మొత్తం ఓటర్లలో 2%కి మించి ఉంటే, ఒకే వ్యక్తి 5 కేసులకు మించి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతంగా పరిశీలించి ధ్రువీకరించుకోవాలి.
* మరణం కారణంగా తొలగించిన ఓటర్ల పేర్లు మినహాయిస్తే మిగిలిన తొలగింపులన్నింటినీ సూపర్‌వైజర్లు, ఏఈఆర్‌లు, ఈఆర్‌వోలు తనిఖీ చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటోంది: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో
-
Rajnath: DAD.. రక్షణశాఖ నిధులకు సంరక్షకుడు: రాజ్‌నాథ్
-
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. రెండు రోజులే!