Ashwini Vaishnaw: రెండు రోజులు ఘటనా స్థలిలోనే.. కార్మికుల్లో ఒకడిగా కేంద్రమంత్రి వైష్ణవ్‌

ఒడిశాలోని బహానగా వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరగ్గా, శనివారం ఉదయమే ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. ఆదివారం రాత్రి రైళ్లు పునరుద్ధరించే వరకూ అక్కడి నుంచి కదల్లేదు.

Updated : 06 Jun 2023 07:22 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని బహానగా వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరగ్గా, శనివారం ఉదయమే ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. ఆదివారం రాత్రి రైళ్లు పునరుద్ధరించే వరకూ అక్కడి నుంచి కదల్లేదు. ప్రమాదం తర్వాత ప్రతి పనినీ ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తూ, అధికారులకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ప్రమాదం తర్వాత 51 గంటల్లో రైలు మళ్లీ పట్టాలపై పరుగులు తీసేవరకూ అక్కడే గడిపారు. దెబ్బతిన్న బోగీల తొలగింపు, ట్రాక్‌ల పునరుద్ధరణ, ఛిన్నాభిన్నమైన ఎలక్ట్రిక్‌ సిగ్నల్‌ వ్యవస్థకు మరమ్మతులన్నీ ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. రెండురోజుల పాటు కునుకైనా తీయకుండా కేంద్ర మంత్రినన్న హోదా పక్కనపెట్టి కార్మికుల్లో ఒకడిలా కలసిపోయారు.

విమర్శలొచ్చినా.. నిగ్రహాన్ని కోల్పోలేదు

ఘటనా స్థలానికి వచ్చిన ప్రధాని మోదీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ సీఎంలు నవీన్‌పట్నాయక్‌, మమతాబెనర్జీలకు ప్రమాదం గురించి మంత్రి వైష్ణవ్‌ వివరించారు. సీఎం మమతా ఆయన ముందే విమర్శలు చేసినా, నిగ్రహాన్ని కోల్పోలేదు. సహచర కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆయనకు తోడుగా నిలిచారు. బాలేశ్వర్‌, భద్రక్‌ ఆసుపత్రుల్లో చేరిన క్షతగాత్రుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ వైష్ణవ్‌ స్వస్థలం. సివిల్స్‌లో టాపర్‌గా నిలిచి ఒడిశా కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా కొన్నాళ్లు పనిచేశారు. కేంద్రంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఒడిశా సీఎం నవీన్‌ సహకారంతో రాష్ట్రం నుంచి భాజపా అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికై మోదీ కేబినెట్‌లో రైల్వేమంత్రిగా బాధ్యతలు చూస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని