వంతెన కూలిన ఘటనలో గార్డు గల్లంతు

బిహార్‌లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెనను కూల్చివేసిన సందర్భంగా సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఓ గార్డు ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

Published : 06 Jun 2023 05:04 IST

బిహార్‌లో కొనసాగుతున్న గాలింపు చర్యలు

పట్నా: బిహార్‌లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెనను కూల్చివేసిన సందర్భంగా సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఓ గార్డు ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భాగల్‌పుర్‌, ఖగడియా జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న అగువానీ - సుల్తాన్‌గంజ్‌ వంతెన స్తంభాలు గత ఏప్రిల్‌ నెలలో తుపాను కారణంగా కొంతభాగం దెబ్బతిన్నాయి. బిహార్‌ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రూ.1,717 కోట్లు కేటాయించింది. 2015లో నీతీశ్‌కుమార్‌ శంకుస్థాపన చేసిన ఈ నిర్మాణం 2020 నాటికి పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. ఈ క్రమంలో డిజైన్‌ లోపాలతో ఆదివారం దానిని కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ వంతెనకు సమీపంలో పనిచేస్తున్న గార్డు ఒకరు గల్లంతయ్యారు. ‘వంతెన కూలిన తర్వాత నుంచి ఎస్‌పీ సింగ్లా సంస్థ తరఫున గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఓ వ్యక్తి కనిపించకుండా పోయారు. ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం అతడి కోసం గాలింపు జరుగుతోంది’అని అధికారులు తెలిపారు. గడచిన 14 నెలల్లో ఆ వంతెన కూలడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నిర్మాణంలో ఉన్న వంతెన కూల్చివేత ఘటనలో దోషులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ప్రకటించారు.‘ఈ వంతెన నిర్మాణాన్ని సరిగ్గా చేపట్టలేదు. అందుకే ఏప్రిల్‌ 2022 నుంచి రెండుసార్లు కూలిపోయింది. ఇది చాలా తీవ్రమైన అంశం. దీనిపై సంబంధిత విభాగం సమగ్ర దర్యాప్తును ఇప్పటికే మొదలుపెట్టింది. దోషులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం నీతీశ్‌ వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు