రైళ్లే కాదు, జీవితాలూ పట్టాలు తప్పాయ్‌!

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామన్న ఆనందం కంటే.. ఇకపై కుటుంబాన్ని పోషించడమెలా అన్న ఆందోళనే వారిని ఎక్కువగా వెంటాడుతోంది.

Updated : 06 Jun 2023 10:23 IST

కోలుకొనేదాకా ఇల్లు గడిచేదెలా?
మునుపటిలా పని చేయగలమా?
భవిష్యత్తుపై బాధితుల ఆందోళన
బాలేశ్వర్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామన్న ఆనందం కంటే.. ఇకపై కుటుంబాన్ని పోషించడమెలా అన్న ఆందోళనే వారిని ఎక్కువగా వెంటాడుతోంది. కాళ్లు, చేతులు విరిగిపోయి, తలలు పగిలిపోయిన గాయాల బాధ కంటే.. తాము కోలుకుని తిరిగి మునుపటిలా పనిచేయటానికి వెళ్లేంత వరకూ ఇల్లు గడవడమెలా అనే ఆలోచనే వారిని అధికంగా భయపెడుతోంది. ఒడిశాలోని బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో గాయపడి బాలేశ్వర్‌, కటక్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి దయనీయ పరిస్థితి ఇది. బాధితుల్లో అత్యధికులది నిరుపేద నేపథ్యమే. రెండు రోజులు కూలి పని చేయకపోతే మూడు రోజు నుంచి మూడు వేళ్లూ నోట్లోకి వెళ్లని దుస్థితి. అలాంటిది ఇప్పుడు నెలలు తరబడి పని చేయలేకపోతే.. ఇల్లు గడిచేదెలాగని వారు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి పలకరించినప్పుడు వారి మాటల్లో బతుకు పట్ల, భవిష్యత్తు పట్ల భయమే వ్యక్తమైంది. ఈ ప్రమాదంలో రైళ్లే కాదు, తమ జీవితాలూ పట్టాలు తప్పిపోయాయని, వాటిని గాడిలో పెట్టడం ట్రాక్‌ను పునరుద్ధరించినంత సులభం కాదని బిహార్‌కు చెందిన ఓ బాధితుడు వాపోయారు.

కుటుంబానికి వారే జీవనాధారం

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఎక్కువ మంది ఆయా కుటుంబాలకు వారే జీవనాధారం. పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన వీరు చెన్నై, బెంగళూరు నగరాల్లో దినసరి కూలీలుగా, హోటళ్లలో, ప్రైవేటు సంస్థల్లో కార్మికులుగా, భవన నిర్మాణ శ్రామికులుగా, ఇతరత్రా చిన్నాచితకా పనులు చేసుకుంటూ ఆ ఆదాయంతో తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని పోషించుకుంటున్నారు. వీరికి కాళ్లూచేతులూ విరిగిపోవటం, తలలు పగిలిపోవటంతో నాలుగైదు శస్త్రచికిత్సలు చేయాల్సిన పరిస్థితి. వీరు కోలుకొని, గతంలో మాదిరిగా తిరగడానికి కనీసం ఆర్నెల్ల నుంచి ఏడాది పట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతకాలం పనికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటే పూట గడిచేదెలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులకు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగానే చికిత్స అందిస్తున్నారు. డిశ్చార్జి చేసిన తర్వాత కూడా తదుపరి వైద్యం, మందులకు చాలా ఖర్చవుతుంది. ఇంటి అవసరాలే తీర్చుకోలేరంటే.. వైద్యానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని వారు వాపోతున్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమిచ్చే పరిహారం సరిపోదని చెబుతున్నారు.


ఇల్లు ఎలా నడుస్తుందనే భయమంతా!

28 ఏళ్ల గురు పలాయ్‌ది ఝార్ఖండ్‌. వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యాపిల్లలను పోషించుకునేందుకు సొంతూరిలో ఓ వాహనానికి హెల్పర్‌గా పనిచేసేవారు. ఆ ఆదాయం చాలకపోవటంతో చెన్నైలో పేపర్‌ మిల్లులో పని చేసేందుకు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఓ కాలు పూర్తిగా విరిగిపోయింది. మరో కాలి మడమ నుజ్జునుజ్జయిపోవడంతో తొలగించారు. బాలేశ్వర్‌ ఆసుపత్రిలో మరో 15-20 రోజులు ఉండాల్సి ఉంటుంది. ‘నేను కోలుకోవడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియదు. కోలుకున్నా మునుపటిలా బరువైన పనులు చేయలేను. ఈ లోగా నా తల్లిదండ్రులను, భార్యాపిల్లల్ని పోషించడమెలా అన్న భయం వెంటాడుతోంది. వాళ్లను చూస్తుంటే ఏడుపు ఆగట్లేదు’ అని గురు పలాయ్‌ కన్నీటిపర్యంతమయ్యారు.


కోలుకోవడానికి రెండు, మూడు నెలలు

-అజయ్‌కుమార్‌, ఒడిశా

నేను చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తా. నా ఆదాయమే కుటుంబానికి జీవనాధారం. ప్రమాదంలో చేతులు విరిగిపోయాయి. తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం లేవలేని స్థితిలో ఉన్నాను. పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లోకి చేరాలంటే కనీసం రెండు, మూడు నెలలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈలోగా డ్యూటీకి వెళ్లలేను కాబట్టి జీతం రాదు. అప్పటివరకూ అప్పు చేసి గడపాల్సిందేనా?


ఇద్దరం మంచాన పడ్డాం

-సమస్‌ ఉద్దీన్‌, అస్సాం

నేను, నా భార్య సజనాబేగం ఇద్దరం బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తాం. పిల్లలిద్దరూ అస్సాంలో ఉంటారు. వారిని చూసేందుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం బారిన పడ్డాం. నాకు కాలు విరిగిపోయింది. నా భార్యకు చేతులు విరిగిపోయాయి. ఈ గాయాలు మాని, తిరిగి మేము పనికి వెళ్లాలంటే కనీసం ఆరేడు నెలలు పడుతుంది. మేమిద్దరం పని చేసుకుంటూ సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది. అలాంటిది ఇద్దరం ఒకేసారి మంచాన పడ్డాం. మున్ముందు ఎలా గడపాలి, పిల్లల బతుకులెట్లా అన్నది అర్థం కావట్లేదు.


పరదాల ఆవల.. ప్రమాద ఆనవాళ్లు

రైళ్ల ప్రమాదం గుర్తులు, ఆనవాళ్లు, దెబ్బతిన్న బోగీలు కనిపించకుండా బహానగా వద్ద రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా అధికారులు గ్రీన్‌మ్యాట్‌ పరదాలు కట్టారు. పూర్తిగా దెబ్బతిన్న ట్రాక్‌ పునరుద్ధరణ పనులు ఆదివారం రాత్రికే పూర్తి కాగా, సోమవారం ఉదయం నుంచి ఈ మార్గంలో పలు రైళ్లు నడిచాయి. ప్రయాణికులకు ప్రమాద తీవ్రత కనిపించకుండా, ఆందోళన చెందకుండా ఇలా పరదాలు కట్టినట్లు తెలుస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని