సంక్షిప్త వార్తలు(5)

ఎక్కడైనా నీళ్లు కనిపిస్తే చాలు.. రక్తంలా భావిస్తున్నవారొకరు. తినాలన్న కోరికే పూర్తిగా చచ్చిపోయిందని అంటున్నవారొకరు. ఒడిశాలో దారుణమైన రైలు ప్రమాదం జరిగినచోట ఆపన్నహస్తం అందించడానికి వెళ్లిన ‘జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం’ (ఎన్డీఆర్‌ఎఫ్‌) బలగాల పరిస్థితి ఇది.

Updated : 07 Jun 2023 05:31 IST

నీళ్లు చూసినా రక్తమనిపిస్తోంది.. ఏదీ తినాలనిపించట్లేదు

చలించిపోయిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

దిల్లీ: ఎక్కడైనా నీళ్లు కనిపిస్తే చాలు.. రక్తంలా భావిస్తున్నవారొకరు. తినాలన్న కోరికే పూర్తిగా చచ్చిపోయిందని అంటున్నవారొకరు. ఒడిశాలో దారుణమైన రైలు ప్రమాదం జరిగినచోట ఆపన్నహస్తం అందించడానికి వెళ్లిన ‘జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం’ (ఎన్డీఆర్‌ఎఫ్‌) బలగాల పరిస్థితి ఇది. దీని గురించి ఆ దళం డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ కర్వాల్‌ స్వయంగా వెల్లడించారు. ‘విపత్తులపై స్పందించే సామర్థ్యం పెంపు’ అనే అంశంపై మంగళవారం దిల్లీలో జరిగిన వార్షిక సదస్సులో ఆయన ప్రసంగిస్తూ- ఒడిశా అనుభవాలను బలగాలు తనతో పంచుకున్నట్లు చెప్పారు. ‘బాలేశ్వర్‌కు వెళ్లినవారు అనేక మరణాలను, అంతులేని నరకయాతన అనుభవిస్తున్నవారి వ్యథాభరిత దృశ్యాలను దగ్గర నుంచి చూశారు. వారు ఎదుర్కొన్న వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని బలగాలకు మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ అందించాలని నిర్ణయించాం. మానసికంగా దృఢంగా ఉండడంపైనా వారికి కోర్సులు నిర్వహిస్తాం. ఇటీవల తుర్కియేలో భూకంప బాధితులకు సాయం అందించడానికి వెళ్లివచ్చినవారికీ కౌన్సెలింగ్‌ నిర్వహించాం. ఇలాంటి వాటికోసం శాశ్వత ప్రాతిపదికన కౌన్సెలర్‌ను నియమించుకునే ప్రక్రియలో ఉన్నాం’ అని వివరించారు. నీట మునిగిన ఘటనల్లో దేశంలో ఏటా 36,000 మంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నారనీ, వీరిలో ఎక్కువమంది స్నాన ఘట్టాల్లోనే చనిపోతున్నందువల్ల దానిని నివారించడంపై దృష్టి సారించామని డీజీ చెప్పారు.


టికెట్లు రద్దు చేసుకోవడం తగ్గింది

ఐఆర్‌సీటీసీ స్పష్టీకరణ

ఒడిశాలో రైళ్ల ప్రమాదం తర్వాత వేల మంది ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకున్నారన్న కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలను ఐఆర్‌సీటీసీ ఖండించింది. ఆ పార్టీ ఆరోపణలు వాస్తవం కాదని పేర్కొంది. కాంగ్రెస్‌ ఆరోపణలకు భిన్నంగా.. టికెట్లు రద్దు కావడం తగ్గిందని తెలిపింది. జూన్‌ ఒకటిన 7.7 లక్షల టికెట్లు రద్దైతే.. జూన్‌ మూడు నాటికి ఆ సంఖ్య 7.5 లక్షలకే పరిమితమైందని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. రైలు టికెట్లు భారీగా రద్దయ్యాయంటూ కాంగ్రెస్‌ నేత, భక్త చరణ్‌ దాస్‌ సోమవారం విలేకరుల సమావేశంలో ఆరోపణలు చేశారు. ప్రయాణంలో భద్రత ఉండదన్న కారణంతో చాలా మంది టికెట్లు రద్దు చేసుకున్నారని తెలిపారు. దీంతో ఐఆర్‌టీసీసీ టికెట్ల రద్దు వివరాలు వెల్లడించింది.  


అది నిరాధార ప్రచారం

భారత ఆర్థిక గణాంకాలను నేను సమగ్రంగా విశ్లేషించాను. మన దేశం ప్రగతి పథంలో వేగంగా దూసుకెళ్తోందంటూ చేస్తున్న ప్రచారమంతా నిరాధారమైనదే. త్వరలోనే సంబంధిత గణాంకాలను బయటపెడతా. ఒక్కముక్కలో చెప్పాలంటే- నెహ్రూ హయాంలో సాధించిన దానితో పోలిస్తే ఇప్పుడే భారత వృద్ధిరేటు తక్కువ.

 సుబ్రమణ్య స్వామి


రైల్వేకు పూర్తిస్థాయి మంత్రి అవసరం

భారతీయ రైల్వేకు పూర్తిస్థాయి మంత్రి అవసరం. అంతేతప్ప- రెండు శాఖల్లో అటో అడుగు ఇటో అడుగు వేసి తీరిక లేకుండా ఉండేవారు కాదు. పూర్తి సమయాన్ని రైల్వేకే కేటాయించే మంత్రిని నియమించడం ప్రధానమంత్రి కనీస బాధ్యత.

కార్తీ చిదంబరం


దానిపై దీర్ఘకాలంగా నిర్లక్ష్యం

సముద్ర వాతావరణాన్ని మానవాళి దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేస్తోంది. చేపల వేటకు ఉపయోగించి వదిలేసిన వలలు, గేర్లను రీసైక్లింగ్‌/అప్‌సైక్లింగ్‌ చేయడం ద్వారా సముద్రాలు, మహాసముద్రాల్లో ప్లాస్టిక్‌ కాలుష్యానికి అడ్డుకట్ట వేయడం ప్రస్తుతం అత్యావశ్యకం. అందుకే ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాలర్లకు.. ముఖ్యంగా మహిళలకు ఈ విషయంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

సౌమ్య స్వామినాథన్‌


సాంకేతికతపై ఆశ కంటే భయమే ఎక్కువ

ఈ రోజుల్లో సాంకేతికత అభివృద్ధి అంటే సమాజంలో ఆశ కంటే భయమే ఎక్కువగా కనిపిస్తోంది. డిజిటల్‌ సాంకేతికతల వల్ల తలెత్తే ముప్పులను తగ్గించేందుకు ప్రభుత్వాలు సంయుక్తంగా కృషిచేయాలి. ఆ ఆవిష్కరణల ప్రయోజనాలను ప్రతిఒక్కరికీ చేరవేసే మార్గాలను అన్వేషించాలి. 

ఆంటోనియో గుటెరస్‌


విమానంలో బాంబు ఉందంటూ ప్రయాణికుడి అరుపులు
కోల్‌కతా విమానాశ్రయంలో ఘటన

కోల్‌కతా: టేకాఫ్‌ కావడానికి కొద్ది క్షణాల ముందు.. విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు గందరగోళం సృష్టించిన ఘటన కోల్‌కతాలో మంగళవారం జరిగింది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దోహా మీదుగా లండన్‌ వెళ్లాల్సిన ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం తెల్లవారుజామున 3:20 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. సరిగ్గా టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఒక ప్రయాణికుడు నిలబడి బాంబు ఉందని గట్టిగా పలుమార్లు అరిచాడు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది సీఐఎస్‌ఎఫ్‌ బలగాలకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ప్రయాణికులందరినీ దించేశారు. విమానాన్ని జాగిలాలతో జల్లెడ పట్టినప్పటికీ అనుమానాస్పదంగా ఏమీ కనపడలేదు. బాంబు ఉందంటూ అరిచిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తోటి ప్రయాణికుడు తనతో అలా చెప్పాడని సమాధానమిచ్చాడు. అనంతరం అతడి తండ్రిని అధికారులు విమానాశ్రయానికి పిలిపించారు. తన కుమారుడు మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటున్నాడని అతడు పోలీసులకు వైద్య నివేదికలు సమర్పించినట్లు సమాచారం.


విధ్వంసకారులను గుర్తించడానికి వెనక్కి చూడాల్సిందే కదా!
రాహుల్‌ వ్యాఖ్యలపై ధన్‌ఖడ్‌ స్పందన

దిల్లీ: దేశంలోని సంస్థలను విధ్వంసం చేసిన కలంకితులను గుర్తించడానికి వెనక్కి తిరిగి చూడాల్సిందే కదా అని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని రియర్‌ వ్యూ అద్దంలో చూసి కారు నడుపుతున్నారని, అందుకే ప్రమాదాలెక్కువ జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ధన్‌ఖడ్‌ స్పందించారు. ‘కొంత మంది పెరుగుతున్న మన ప్రతిష్ఠను చూసి ఓర్చుకోలేకపోతున్నారు. తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. దేశం సాధిస్తున్న నిజమైన విజయాలను గుర్తించలేకపోతున్నారు. 2047కల్లా దేశం కచ్చితంగా ప్రపంచంలో అగ్ర రాజ్యంగా అవతరిస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం దిల్లీలో తనను కలిసిన డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్‌ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చరిత్ర లగేజీని మోయవద్దని, అది అభివృద్ధిని ఆడ్డుకుంటుందని సూచించారు. రియర్‌ వ్యూ అద్దంలో నుంచి చూసేది ప్రమాదాలను నివారించడానికేనని తేల్చి చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని