ఆ 83 మృతదేహాలు ఎవరివో!

ఒడిశాలోని బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి ఇప్పటికీ గుర్తించని మృతదేహాల నుంచి అధికారులు డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నారు.

Updated : 07 Jun 2023 10:18 IST

ఇప్పటికీ గుర్తించలేని దైన్యం
భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

ఒడిశాలోని బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి ఇప్పటికీ గుర్తించని మృతదేహాల నుంచి అధికారులు డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడిచినా, 83 మృతదేహాలు ఎవరివో ఇప్పటికీ తేలలేదు. అవి శవాగారాల్లోనే మగ్గిపోతున్నాయి. దాదాపు అన్నీ కుళ్లిపోయి గుర్తుపట్టేందుకు వీల్లేని విధంగా మారిపోయాయి. మృతదేహాలపై ఉన్న దుస్తులు, ఇతర వస్తువులను బట్టి కొన్నింటిని గుర్తిస్తున్నారు. ఇది తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. చాలా మృతదేహాలు ఎవరివో తేలక మార్చురీలో పడి ఉండగా, మరికొన్ని శవాలు తమ వారివంటే తమ వారివంటూ రెండు మూడు కుటుంబాలు పట్టుబడుతున్నాయి. ఇది అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన జహంగీర్‌ మృతదేహాన్ని అతని సోదరుడు గుర్తించి స్వగ్రామానికి తీసుకెళ్తుండగా.. అదే రాష్ట్రానికి చెందిన అంజురల్‌ హక్‌ శవమంటూ అతని కుటుంబీకులు క్లెయిమ్‌ చేశారు. దీంతో మార్గమధ్యలోనే జహంగీర్‌ సోదరుడిని పోలీసులు ఆపారు.

రెండు మూడు సార్లు పరిశీలించిన తర్వాత మృతుడు జహంగీరేనని తేల్చి అతని సోదరుడికి అప్పగించారు. కటక్‌కు చెందిన ఓ మహిళ ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం తన భర్త చనిపోయాడంటూ తప్పుడు క్లెయిమ్‌ చేసి ఓ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించి చివరి నిమిషంలో పోలీసులకు చిక్కింది. ఇలాంటి సమస్యలు రాకుండా శవాలతో పాటు, వాటిని క్లెయిమ్‌ చేస్తున్న వారి కుటుంబీకుల నుంచి అధికారులు డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నారు. వాటిని ఎయిమ్స్‌లోని డీఎన్‌ఏ పరీక్షా కేంద్రంలో విశ్లేషిస్తున్నారు. ఆ నివేదికల ఆధారంగా డీఎన్‌ఏ నమూనాలు సరిపోల్చి మృతదేహాలు అప్పగించనున్నారు. ఎవరూ క్లెయిమ్‌ చేయని శవాల నుంచి కూడా డీఎన్‌ఏ నమూనాలు సేకరించి భద్రపరుస్తున్నారు. ఒకట్రెండు రోజుల తర్వాత ఆ మృతదేహాలకు ప్రభుత్వమే అంత్యక్రియలు పూర్తిచేయనుంది. ఆ తర్వాత ఎవరైనా వస్తే వారి డీఎన్‌ఏ నమూనాలు కూడా సేకరించి.. తమ వద్ద ఉన్న నివేదికలతో సరిపోల్చి నిర్ధారించనుంది. ఇంకా మిగిలిపోయిన శవాలను భద్రపరిచేందుకు పారదీప్‌ పోర్టు నుంచి కంటైనర్లను తెప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని