రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సురినాం అత్యున్నత పౌర పురస్కారం

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సురినాం అత్యున్నత పౌరపురస్కారం ‘గ్రాండ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద ఛైన్‌ ఆఫ్‌ ద యెల్లో స్టార్‌’ను ఆ దేశ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్‌ సంతోకీ అందజేశారు.

Published : 07 Jun 2023 03:56 IST

పరమరిబో: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సురినాం అత్యున్నత పౌరపురస్కారం ‘గ్రాండ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద ఛైన్‌ ఆఫ్‌ ద యెల్లో స్టార్‌’ను ఆ దేశ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్‌ సంతోకీ అందజేశారు. రెండు దేశాల బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు గౌరవ చిహ్నంగా పురస్కార ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా పరమరిబోలోని సురినాం అధ్యక్ష భవనంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ... తనకు లభించిన ఈ సమున్నత గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు జరిగిన సత్కారంగా అభివర్ణించారు. సురినాంలో కొన్ని తరాలుగా స్థిరపడిన భారతీయులకు దానిని అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. రెండు దేశాల మధ్య గాఢమైన మైత్రీబంధాన్ని ఏర్పరచటంలో వీరు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. సురినాం అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ముర్ము ఆదివారం సురినాం చేరుకున్న విషయం తెలిసిందే. సురినాం అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందిన రాష్ట్రపతి ముర్ముకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

భారత సంతతి ప్రజలకు ఓసీఐ నిబంధనల సడలింపు

సురినాంలో స్థిర పడిన భారత సంతతి ప్రజలు ఓసీఐ(ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా) కార్డు పొందటానికి వీలుగా నిబంధనలు సడలిస్తున్నట్లు రాష్ట్రపతి ముర్ము ప్రకటించారు. దీని ప్రకారం భారత్‌ నుంచి వలసవచ్చిన నాలుగు నుంచి ఆరో తరాల వారి వరకూ ఓసీఐ కార్డులు పొందటానికి అర్హులవుతారని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు