Odisha Train Accident: విద్యుత్తు షాక్‌తోనే 40 మంది మృతి

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగినప్పుడు విద్యుత్తు షాక్‌ వల్లనే దాదాపు 40 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని బయటపడింది.

Updated : 07 Jun 2023 07:43 IST

..అందుకే వారి దేహాలపై ఎలాంటి గాయాల్లేవు
కోరమాండల్‌ దుర్ఘటనలో వెలుగుచూసిన మరో కోణం
ప్రమాదంపై సీబీఐ కేసు.. దర్యాప్తు మొదలు

బాలేశ్వర్‌, భువనేశ్వర్‌/ కటక్‌-న్యూస్‌టుడే: కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగినప్పుడు విద్యుత్తు షాక్‌ వల్లనే దాదాపు 40 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని బయటపడింది. ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద ఈ నెల 2న జరిగిన దుర్ఘటనలో తెగిన తీగలు.. కొన్ని రైలుపెట్టెలకు తగలడంతో వాటిలో ఉన్నవారికి తీవ్రంగా షాక్‌ కొట్టిందని బాలేశ్వర్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసుస్టేషన్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. విద్యుత్తు స్తంభాలు సయితం కుప్పకూలిపోవడంతో ఇలా జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మృతదేహాలకు వైద్యులు పరీక్షలు నిర్వహించినప్పుడు పలువురి శరీరాలపై బయటకు ఏ విధమైన గాయాలు కనిపించలేదు.

రంగంలోకి సీబీఐ

ఘోర రైలు ప్రమాదం వెనుక ఎవరిదో ఉద్దేశపూర్వక ప్రయత్నం, నేరపూరిత నిర్లక్ష్యం ఉన్నాయని అనుమానిస్తూ.. నిగ్గుతేల్చే బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ప్రభుత్వం అప్పగించిన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆ సంస్థ లాంఛనంగా కేసు నమోదు చేసుకుంది. ఎవరినైనా ప్రశ్నించడానికి, ఆధారాలు సేకరించడానికి ఇది తప్పనిసరి. జాయింట్‌ డైరెక్టర్‌ విప్లవ్‌కుమార్‌ చౌధరి నేతృత్వంలో ఆరుగురు అధికారుల బృందం బాలేశ్వర్‌లోని ప్రమాదస్థలికి చేరుకుంది. పలువురు సిబ్బంది నుంచి వివరాలు ఆరా తీసింది. రాష్ట్ర పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను, ప్రమాద తీరును పరిశీలించింది. ఎవరో వ్యవస్థలో జోక్యం చేసుకోనిదే మెయిన్‌లైన్‌కు ఖాయం చేసిన రూటును లూప్‌లైనుకు మార్చడం సాధ్యం కాదని రైల్వే అధికారి ఒకరు తేల్చిచెప్పారు. ఆదివారం రాత్రి నుంచి బహానగా బజార్‌ రైల్వేస్టేషన్‌ మీదుగా 70 రైళ్లు రాకపోకలు సాగించాయి.

తెలుగు రాష్ట్రాలకూ సమాచారం

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో పలువురిని ఇప్పటివరకు గుర్తించలేకపోవడంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, తమిళనాడు రాష్ట్రాలకు సమాచారం పంపించామని ఖుర్దారోడ్‌ డీఆర్‌ఎం రింకేశ్‌ రాయ్‌ తెలిపారు. ఆయా రాష్ట్రాలకు చెందిన వారెవరైనా గల్లంతయ్యారేమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 

డీఎన్‌ఏ నమూనాల సేకరణ

మరోవైపు- డీఎన్‌ఏ నమూనాల సేకరణను ఒడిశా ప్రభుత్వం ప్రారంభించింది. కుటుంబ సభ్యుల నుంచి వీటిని తీసుకుని, మృతుల డీఎన్‌ఏతో సరిపోల్చే పనిని భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ చేపట్టింది. ఉపేంద్రకుమార్‌ శర్మ అనే వ్యక్తి మృతదేహాన్ని పచ్చబొట్టు ఆధారంగా సోమవారం గుర్తించినా దానిని మంగళవారం వేరేవారికి అప్పగించారనీ, ఇక డీఎన్‌ఏ పరీక్షలు చేసి ఉపయోగం ఏమిటని ఝార్ఖండ్‌ వాసి ఒకరు ప్రశ్నించారు. అవసరమైతే ఆరు నెలల వరకు భద్రపరిచేందుకు వీలుగా మృతదేహాలను ఐదు శీతలీకృత కంటైనర్లలోకి తరలించినట్లు అధికారులు తెలిపారు. 


మృతుల సంఖ్య 288: ఒడిశా సీఎస్‌

ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి పెరిగిందని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ప్రదీప్‌ కుమార్‌ జెనా భువనేశ్వర్‌లో విలేకరులకు చెప్పారు. ఇంతవరకు 205 మృతదేహాల గుర్తింపు పూర్తయిందనీ, మిగిలినవారి వివరాలు తెలియలేదని చెప్పారు. భువనేశ్వర్‌కు 193, బాలేశ్వర్‌కు 94, భద్రక్‌కు ఒక మృతదేహాన్ని తరలించారని.. బాలేశ్వర్‌, భద్రక్‌లలో అప్పగింత ప్రక్రియ పూర్తయిందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని