ప్రతిభావంతులు ఎగిరిపోతున్నారు

దేశంలో జేఈఈ పరీక్షలో తొలి వెయ్యి ర్యాంకులు సాధించే విద్యార్థుల్లో 36% మంది విదేశాలకు వలస వెళుతున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ సంస్థ పేర్కొంది.

Published : 07 Jun 2023 04:15 IST

జేఈఈ వెయ్యిలోపు ర్యాంకర్లలో 36% మంది విదేశాలకు వలస
వందలోపు ర్యాంకర్లయితే 62% మంది

ఈనాడు, దిల్లీ: దేశంలో జేఈఈ పరీక్షలో తొలి వెయ్యి ర్యాంకులు సాధించే విద్యార్థుల్లో 36% మంది విదేశాలకు వలస వెళుతున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ సంస్థ పేర్కొంది. రెక్కలు కట్టుకొని విదేశాలకు ఎగిరిపోయే వారి సంఖ్య టాప్‌ 100 ర్యాంకర్లలో అయితే 62%, టాప్‌ 10 ర్యాంకర్లలో అయితే 90% మేర ఉన్నట్లు వెల్లడించింది. టాపర్లు అంతా దేశంలో తొలి 5 స్థానాల్లో ఉన్న బాంబే, కాన్పుర్‌, ఖరగ్‌పుర్‌, మద్రాస్‌, దిల్లీ ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా (65%), బ్రిటన్‌ (5%), సింగపూర్‌ (4%), కెనడా, జర్మనీ (3% చొప్పున), జపాన్‌, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌, యూఏఈ (2% చొప్పున), ఇతర దేశాలకు (12%) వెళుతున్నారు. 83% మాస్టర్స్‌, పీహెచ్‌డీల కోసం వెళుతుంటే, 17% మంది ఉద్యోగం కోసం విదేశీ బాట పడుతున్నారు. ఏటా నిర్వహించే జేఈఈ పరీక్షలో టాప్‌-5 ఐఐటీల్లో చేరడానికి 2,470 మందికి అవకాశం లభిస్తోంది. వీరిలోనే అత్యధికం విదేశాలకు వలస వెళుతున్నారు. ఇందుకు పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ కూడా దోహదం చేస్తోంది. ఎక్కడ మంచి విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నది చెప్పడం ద్వారా పూర్వ విద్యార్థులు కొత్తవారికి బాటలు వేస్తున్నారు. తమ ప్రభావం ఉన్న చోట కొత్త విద్యార్థులకు అవసరమైన కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికీ ఈ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ సాయం చేస్తోంది. అమెరికాలోని టాప్‌ 55 గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో 2,400 మంది కంప్యూటర్‌ సైన్స్‌ బోధనా సిబ్బంది ఉండగా, అందులో 134 మంది (5.6%) టాప్‌-5 ఐఐటీల పూర్వ విద్యార్థులే. ఇలాంటి వారు కొత్త విద్యార్థులకు అక్కడ చదువుకోవడానికి దారి చూపుతున్నారు. దేశీయంగా టాప్‌-5 ఐఐటీలకు ఉన్న బ్రాండ్‌ విలువతోపాటు, విదేశాల్లోని ప్రాంగణాల్లో ఆ సంస్థల పూర్వ విద్యార్థులు బోధనా సిబ్బందిగా ఉండడం ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ దేశాల్లో ప్రతిభావంతులకు అసాధారణ స్థాయిలో ప్రతిఫలాలు దక్కుతుండడమే టాప్‌ ర్యాంకర్లు వలస బాట పట్టడానికి ప్రధాన కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు