అమెరికా ఆహ్వానాన్ని సగౌరవంగా సమ్మతిస్తున్నా

పరస్పర ప్రజాస్వామ్య విలువలు, ప్రజల దృఢమైన  అనుబంధాల మీద నిర్మితమైన భారత్‌-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో ఘనమైనదని ప్రధాన మంత్రి మోదీ తెలిపారు.

Updated : 07 Jun 2023 05:27 IST

యూఎస్‌ కాంగ్రెస్‌ సంయుక్త భేటీలో ప్రసంగం గురించి ప్రధాని మోదీ ట్వీట్‌

దిల్లీ: పరస్పర ప్రజాస్వామ్య విలువలు, ప్రజల దృఢమైన  అనుబంధాల మీద నిర్మితమైన భారత్‌-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో ఘనమైనదని ప్రధాన మంత్రి మోదీ తెలిపారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యాల కోసం అత్యంత నిబద్ధతతో రెండు దేశాలు దీనికి కట్టుబడి ఉంటాయన్నారు. అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించాల్సిందిగా తనను ఆహ్వానించిన స్పీకర్‌ కెవిన్‌ మెకార్థితో పాటు సెనెట్‌లో మెజారిటీ లీడర్‌, రిపబ్లికన్‌, డెమ్రోకటిక్‌ నేతలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆహ్వానాన్ని సగౌరవంగా సమ్మతిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. యూఎస్‌ కాంగ్రెస్‌లో మరోసారి ప్రసంగించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 22న ప్రధాని మోదీ యూఎస్‌ కాంగ్రెస్‌ సంయుక్త భేటీలో ప్రసంగిస్తారు. ప్రపంచం ముందున్న సవాళ్లు, వాటినెదుర్కొనడంలో భారత్‌-అమెరికా కృషి, భవిష్యత్తుపై భారత్‌ దార్శనికత తదితరాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అతిథ్యంతో పాటు అధికారిక విందు అదే రోజు ఉంటుంది. 2016లోను మోదీ యూఎస్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. మన దేశ ప్రధాని ఒకరు ఆ వేదికపై రెండు సార్లు ప్రసంగించడం ఇదే ప్రథమం అవుతుంది. యూఎస్‌ కాంగ్రెస్‌ భేటీలో అత్యధికంగా మూడు సార్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని