ఆపరేషన్‌ బ్లూస్టార్‌ డేలో ఖలిస్థాన్‌ నినాదాలు

ఆపరేషన్‌ బ్లూస్టార్‌ డే సందర్భంగా మంగళవారం సిక్కు తీవ్రవాద సంస్థల కార్యకర్తల ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలతో స్వర్ణ దేవాలయం ప్రాంగణం మారుమోగింది.

Published : 07 Jun 2023 04:43 IST

అమృత్‌సర్‌: ఆపరేషన్‌ బ్లూస్టార్‌ డే సందర్భంగా మంగళవారం సిక్కు తీవ్రవాద సంస్థల కార్యకర్తల ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలతో స్వర్ణ దేవాలయం ప్రాంగణం మారుమోగింది. అకల్‌తక్త్‌ వద్ద ఎంపీ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌, ఆయన సహచరుడు మాజీ ఎంపీ దియాన్‌ సింగ్‌ మాండ్‌ల నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్‌ (అమృత్‌సర్‌) పార్టీ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఆ సమయంలో ఎంపీ మాన్‌ సైతం అక్కడే ఉన్నారు. సిక్కు తీవ్రవాద సంస్థ దల్‌ఖాల్సాకు చెందిన వందల మంది కార్యకర్తలు ఖలిస్థాన్‌ జెండాలను, జర్నల్‌ సింగ్‌ భింద్రేవాలె ఫొటోలతోపాటు ఆపరేషన్‌ బ్లూస్టార్‌ సమయంలో దెబ్బతిన్న అకల్‌తక్త్‌ ఛాయాచిత్రాలను ప్రదర్శించారు.  ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అకల్‌తక్త్‌ జతేదార్‌ జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌ సిక్కు సమాజానికి తన సందేశం ఇచ్చారు. ‘‘సిక్కు బోధకులు, మేధావులు గ్రామాల్లో పర్యటించండి. యువతకు సిక్కు మతంలోని గొప్పతనాన్ని, చరిత్రను బోధించండి. అకల్‌తక్త్‌ ఆధ్వర్యంలో వారిని ఏకం చేయండి. మత్తుపదార్థాల బారిన పడుతున్న యువతను సన్మార్గంలోకి తీసుకురండి’’ అని ప్రబోధించారు.

ఖలిస్థాన్‌ ‘టైగర్‌ ఫోర్స్‌’పై ఎన్‌ఐఏ నజర్‌

చండీగఢ్‌: ఖలిస్థానీ అనుకూల ఉగ్రసంస్థలకు నిధులు సమకూరుస్తోందన్న ఆరోపణలపై ఉగ్ర ముఠా ‘ఖలీస్థాన్‌ టైగర్‌ఫోర్స్‌ (కేటీఎఫ్‌)’కు చెందిన 10 స్థావరాలపై (పంజాబ్‌, హరియాణాల్లో) జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం దాడులు నిర్వహించింది. పాక్‌ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను రప్పించడం వంటి ఆరోపణలు కూడా కేటీఎఫ్‌పై ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని