వరికి రూ.143 పెంపు

కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్‌ మద్దతు ధరలను పెంచింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణ కోసం రూ.89,047 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.

Updated : 08 Jun 2023 03:28 IST

14 పంటల మద్దతు ధరలు పెంచిన కేంద్రం
బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణకు రూ.89,047 కోట్లు
కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్‌ మద్దతు ధరలను పెంచింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణ కోసం రూ.89,047 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి 14 పంటలకు 5.3 శాతం నుంచి 10.35శాతం వరకూ కనీస మద్దతు ధరలు పెరిగాయి. రూ.128 (మొక్కజొన్నకు) నుంచి రూ.805 (నువ్వులకు) వరకూ ఈ పెంపుదల ఉంది. బుధవారం దిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం మద్దతు ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించే వరికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.143 (7శాతం), పెసలకు రూ.803 పెరిగింది. గత ఖరీఫ్‌ సీజన్‌తో పోలిస్తే నువ్వులకు గత పదేళ్లలో వరికి అత్యధికంగా 2018-19లో రూ.200 పెరిగింది. దేశవ్యాప్తంగా పంట సాగుకయ్యే సగటు వ్యయంపై 50% అదనపు లాభం కల్పించాలన్న సూత్రం ఆధారంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు కేంద్ర వాణిజ్య, ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. కేబినెట్‌ భేటీ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కొత్త ధరల తర్వాత సాధారణ పరిస్థితుల్లో సగటు పెట్టుబడులమీద సజ్జపై 82%, కందిపై 58%, సోయాబిన్‌పై 52%, మినుముపై 51% లాభాలు రైతులకు వస్తాయని చెప్పారు. మిగిలిన అన్ని పంటలపై 50% లాభం రానుందని  వెల్లడించారు. 2022-23 మూడో ముందస్తు అంచనాల ప్రకారం దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 330.5 మిలియన్‌ టన్నులకు చేరనుందని, 2021-22తో పోలిస్తే ఇది 14.9 మిలియన్‌ టన్నులు అధికమని పేర్కొన్నారు. గత అయిదేళ్లలో ఇది అత్యధిక పెరుగుదలని చెప్పారు.

గురుగ్రామ్‌లో మెట్రో మార్గానికి ఆమోదం

దేశ రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే దిల్లీ సరిహద్దు నగరం గురుగ్రామ్‌లో హుడా సిటీ సెంటర్‌ నుంచి సైబర్‌ సిటీ వరకు 28.50 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 27 స్టేషన్లతో ఈ మార్గంలో ఎలివేటెడ్‌ మెట్రోను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5,452 కోట్లు.  


రైతుల కోసం తీసుకునే ఎన్నో నిర్ణయాల్లో మద్దతు ధర ఒకటి: ప్రధాని

దిల్లీ: గత తొమ్మిదేళ్లుగా రైతుల ప్రయోజనాల కోసం తీసుకుంటున్న ఎన్నో నిర్ణయాల్లో ఈ ఖరీఫ్‌కు పంటల మద్దతు ధర పెంచడం ఒకటని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దీనివల్ల తమ పంట ఉత్పత్తులకు రైతులు సరైన ధరలు పొంది మరింత బలోపేతమవుతారని పేర్కొన్నారు. పంటలకు మద్దతు ధర పెంచుతూ బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని