స్టేటస్‌లో టిప్పు.. చెలరేగిన చిచ్చు

మహారాష్ట్రలోని కొల్హాపుర్‌ నగరం బుధవారం అట్టుడికింది. 18వ శతాబ్దపు నాటి మైసూర్‌ పాలకుడు టిప్పు సుల్తాన్‌ ఫొటోతోపాటు ఓ అభ్యంతరకర సందేశాన్ని ఇద్దరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో స్టేటస్‌గా పెట్టుకోవడం అక్కడ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

Published : 08 Jun 2023 06:39 IST

మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో తీవ్ర ఉద్రిక్తత

కొల్హాపుర్‌, ముంబయి: మహారాష్ట్రలోని కొల్హాపుర్‌ నగరం బుధవారం అట్టుడికింది. 18వ శతాబ్దపు నాటి మైసూర్‌ పాలకుడు టిప్పు సుల్తాన్‌ ఫొటోతోపాటు ఓ అభ్యంతరకర సందేశాన్ని ఇద్దరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో స్టేటస్‌గా పెట్టుకోవడం అక్కడ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. అసలేం జరిగిందంటే- కొల్హాపుర్‌లో ఇద్దరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో మంగళవారం టిప్పు సుల్తాన్‌కు సంబంధించిన స్టేటస్‌ పెట్టుకున్నారు. దానిపై ఓ వర్గం వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. మంగళవారం సాయంత్రంకల్లా మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన పోలీసులు.. ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై నగరంలో బుధవారం వందల మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొన్ని సంస్థలు కొల్హాపుర్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆ సంస్థలకు చెందిన వ్యక్తులు స్థానిక శివాజీ చౌక్‌ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం వారంతా ఇళ్లకు తిరుగుముఖం పడుతుండగా కొందరు దుండగులు చెలరేగిపోయారు. ఇళ్లు, వాహనాలపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు. బాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతానికి పరిస్థితి నియంత్రణలో ఉందని కొల్హాపుర్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రెఖావర్‌ తెలిపారు. నగరంలో గురువారం వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని