సంక్షిప్త వార్తలు

విదేశాల్లో న్యాయ పట్టభద్రులైన భారతీయులు మన దేశంలో న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు అనుమతించే అర్హత పరీక్ష ఫలితాలను వెల్లడించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది.

Updated : 08 Jun 2023 06:03 IST

విదేశీ న్యాయ పట్టభద్రుల అర్హత పరీక్ష ఫలితాల వెల్లడి కోరుతూ పిటిషన్‌
శుక్రవారం విచారణ జరిపేందుకు ధర్మాసనం అనుమతి

దిల్లీ: విదేశాల్లో న్యాయ పట్టభద్రులైన భారతీయులు మన దేశంలో న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు అనుమతించే అర్హత పరీక్ష ఫలితాలను వెల్లడించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. ఈ కేసును శుక్రవారం విచారణ జాబితాలో చేర్చాలని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందల్‌ ధర్మాసనం బుధవారం ఆదేశించింది. ఈ పరీక్షను బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) నిర్వహించింది. ఈ నెలలో ఫలితాలను ప్రకటించకపోతే 75 మందికి పైగా అభ్యర్థులు ఆలిండియా బార్‌ కౌన్సిల్‌ మరో మూడు నెలల్లో నిర్వహించే పరీక్షకు అర్హతను పొందలేరని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. సత్వరమే ఫలితాలు వెల్లడించేలా బీసీఐని ఆదేశించాలని అభ్యర్థించారు.


జులై 10 వరకు ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌పై ముందుకు వెళ్లం
బాంబే హైకోర్టుకు తెలిపిన కేంద్రం

ముంబయి: సామాజిక మాధ్యమాల్లో నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు నిజ నిర్ధారణ విభాగం(ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌) ఏర్పాటు నిర్ణయంపై జులై 10వరకు ముందుకు వెళ్లలేమని కేంద్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. అంతకుముందు జులై 5 వరకు దీనిని ఏర్పాటు చేయమని చెప్పిన కేంద్రం.. ఆ గడువును కాస్త పొడిగించింది. సవరించిన ఐటీ నిబంధనల చెల్లుబాటును సవాలు చేస్తూ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ బాంబే హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారి హక్కులను కాపాడటంతోపాటు వినియోగదారులకు నిర్ధారిత సమాచారాన్ని అందించడం తమ బాధ్యత అని కేంద్రం న్యాయస్థానానికి వివరించింది. ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ ఎడిటర్స్‌ గిల్డ్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మ్యాగజీన్స్‌ కూడా వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశాయి. వీటిపై జులై 6 నుంచి విచారణ చేపడతామని పేర్కొంది. జులై 7లోపు పిటిషినర్లు తమ వాదనలు పూర్తిచేయాలని.. అనంతరం కేంద్ర ప్రభుత్వ వాదన వింటామని తెలిపింది.


‘మోదీ డిగ్రీ’ కేసులో కేజ్రీవాల్‌కు సమన్లు

అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీపై చేసిన వ్యాఖ్యల కేసులో జులై 13వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌లను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జయేశ్‌ ఛోవాతియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి బుధవారమే వారిద్దరూ హాజరు కావాల్సి ఉంది. వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు హాజరై మినహాయింపు కోరారు. కోర్టు పత్రాలను ఇవ్వాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ఆ పత్రాలను ఇవ్వాలని ఆదేశిస్తూ జులై 13న వారిద్దరూ హాజరుకావాలని ఆదేశించారు.


రైతు నేతల అరెస్టు

కురుక్షేత్ర: కనీస మద్దతు ధరకు పొద్దు తిరుగుడు విత్తనాలను కొనుగోలు చేయాలని కోరుతూ మంగళవారం హరియాణాలోని షాబాద్‌వద్ద జాతీయ రహదారిని టిల్లర్లతో దిగ్బంధించిన భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ-చడూనీ) నేతలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ సంఘం అధినేత గుర్నాం సింగ్‌ చడూనీసహా 9 మంది నేతలను కోర్టులో హాజరుపరచడంతో న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. దీంతో వారి విడుదల కోరుతూ బీకేయూ కార్యకర్తలు బుధవారం మళ్లీ ధర్నాలు చేశారు.


మోదీ చొరవతో యువతకు సాధికారత

ప్రధాని మోదీ స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా లాంటి కార్యక్రమాలతో ఆవిష్కరణలు, సంస్థల ఏర్పాటు దిశగా ప్రోత్సాహం అందించడం ద్వారా 9 ఏళ్ల పాలనలో యువతకు సాధికారత కల్పించారు. ఆయన చొరవ కారణంగా దేశంలో వందకు పైగా యూనికార్న్‌ సంస్థలు వెలిసి లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.

అమిత్‌ షా


మణిపుర్‌కు మోదీ ఎందుకు వెళ్లడం లేదు?

మణిపుర్‌లో హింస ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. అయినా ప్రధాని మోదీ ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ రాష్ట్రాన్ని సందర్శించి సయోధ్య కోసం ఎందుకు ప్రయత్నించడం లేదు?   కనీసం ఆ రాష్ట్రంలో పర్యటించే దిశగా అఖిలపక్ష బృందాన్ని ఆయన ఎందుకు ప్రోత్సహించడం లేదు?

జైరాం రమేశ్‌


కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్‌ మోసం

కర్ణాటకలో అందరికీ, ప్రతి ఇంటికీ ఉచితాలను గ్యారెంటీగా అందిస్తామంటూ కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. కానీ తాము ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యం అని ఆ పార్టీ ఇప్పుడు  గ్రహించింది. అందుకే పథకాల అమలుకు  లెక్కకు మించి నిబంధనలు పెడుతూ ప్రజలను మోసగిస్తోంది.

తేజస్వీ సూర్య


ఆన్‌లైన్‌లో విద్వేషానికి చోటివ్వద్దు

ఆన్‌లైన్‌ ప్రపంచంలోని విద్వేష ప్రసంగాలు నిజ జీవితంలోనూ హాని కలిగిస్తాయి. మీ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో వాటికి చోటివ్వకండి. ఏదైనా సమాచారం పంచుకొనే ముందు వాస్తవాలను నిర్ధారించుకోండి. సహనం, సమానత్వ భావనను పెంపొందించే సందేశాలను పంచుకోవడం ద్వారా విద్వేషాన్ని ఎదుర్కోండి. విద్వేషానికి గురవుతున్న బాధితులకు అండగా నిలవండి.

ఐరాస


జేఎన్‌యూలో విద్యార్థినుల అపహరణకు విఫలయత్నం

పోలీసుల అదుపులో ఓ వ్యక్తి

దిల్లీ: దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఇద్దరు విద్యార్థినులను అపహరించే ప్రయత్నం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి వర్సిటీ ఆవరణలోకి కారులో వచ్చిన మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ఇద్దరు విద్యార్థినులను అపహరించేందుకు యత్నించారని జేఎన్‌యూ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆరోపించింది. విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి శారీరక వేధింపులకు సంబంధించి, మరొకటి అపహరణకు సంబంధించి ఉన్నాయి. ఈ రెండు కేసుల్లో నిందితులు, వాహనం ఒకటేనని పోలీసు అధికారి వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్లో ఓ వ్యక్తిని అభిషేక్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.


దేశంలో భాజపా వ్యతిరేక పవనాలు

ఇదే కొనసాగితే 2024 ఎన్నికల్లో మార్పు తథ్యం: శరద్‌ పవార్‌

ఔరంగాబాద్‌: దేశంలో ప్రస్తుతం భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. కర్ణాటక ఫలితాలను బట్టి చూస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో మార్పు తథ్యమని వ్యాఖ్యానించారు. ఔరంగాబాద్‌లో బుధవారం ఆయన విలేకర్లతో ఈ మేరకు మాట్లాడారు. మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే అవకాశాలు లేవని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్న తెలంగాణ మోడల్‌(రైతులకు ఆర్థిక సాయం)పై ఆయన స్పందిస్తూ.. ‘‘తెలంగాణ మోడల్‌ను పరిశీలించాలి. తెలంగాణ చిన్న రాష్ట్రం కాబట్టి అక్కడ అలాంటి సాయం ప్రకటించవచ్చు. వ్యవసాయానికి సంబంధించి మౌలిక సదుపాయాలపై ఎక్కువ నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంలో మీరు అభిమానించే మంత్రి ఎవరన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీపై ప్రశంసలు కురిపించారు. ‘‘నితిన్‌ గడ్కరీ తన పార్టీని దృష్టిలో పెట్టుకుని పనులు చేయరు. మనం ఏదైనా అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే.. అది ఎంత ముఖ్యమైనది అని ఆలోచిస్తారు తప్ప.. ఎవరు చెప్పారు అన్నది చూడరు’’ అని పవార్‌ కొనియాడారు.




Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు